టిఫిన్ బాక్స్ ..!! >రచయిత --బి.రామకృష్ణా రెడ్డి >సఫిల్ గూడ .--సికిందరాబాద్ .

 జీతంలో ప్రతి వ్యక్తి ఎన్నో అనుకూల   మరియు ప్రతికూల సంఘటనలు ఎదుర్కొంటూనే ఉంటాడు.  ముందుగానే ప్రణాళిక చేసుకున్న కొన్ని సన్నివేశాలు ,సందర్భాలు, సంఘటనలు  ,ఆహ్లాదభరితంగా,  ఉల్లాసంగా , మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.    అలా కాకుండా కొన్ని ఊహించని  దుర్ఘటనలు సంభవించినప్పుడు  వాటిని  ముందువరుసలో ఉండి ప్రత్యక్ష సాక్షిగా  చూసినప్పుడు, ఆ దుర్ఘటన యొక్క తీవ్రత   అధిక మోతాదులో ఉన్నప్పుడు దాని ప్రభావము చాలాకాలం మదిలో మెదులుతూనే ఉంటుంది.
          1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత భారతదేశంలో అక్కడక్కడ  తరచుగా బాంబు విస్ఫోటాలు జరుగుతూ ఉండేటివి.    ఆ తరువాతి సంవత్సరము లోనే బాంబే తాజ్ మహల్ హోటల్ ప్రాంతములో జరిగిన దుర్ఘటనలో  అధిక ప్రాణ నష్టము, మరియు ఆస్తి నష్టం జరిగిన విషయం మనకందరికీ తెలుసు.    ఆ క్రమంలోనే 1996వ సంవత్సరంలో సికింద్రాబాద్ రైల్వే రిజర్వేషన్ ఆఫీస్ లో జరిగిన బాంబు విస్ఫోట సంఘటనలో నేను ప్రత్యక్ష సాక్షి గా ఉన్నాను.    ఈ దుర్ఘటన జరిగిన సమయంలో కె.ఎస్ .తంగవేలు అనే వ్యక్తి రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ గా ఉండేవారు.    వారు 2001వ సంవత్సరంలో పదవీ విరమణ చేసి ప్రస్తుతము కోయంబత్తూర్లో  సెటిల్ అయినారు..   దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆయనకు నాతో మాట్లాడాలని కోరికతో, నా ఫోన్ నెంబర్ సంపాదించి ఈ మధ్యకాలంలో నాతో సంభాషించారు.    ఈ   సందర్భంగా ఆ నాటి విస్పోటన సంఘటన, తదనంతరము పోలీస్ విచారణలో మేము ఎదుర్కొన్న సమస్యలను గుర్తు  చేసుకున్నాము.  ఆ విశేషాలను నలుగురితో పంచుకోవాలనిపించే ప్రయత్నమే ఈ చిరువ్యాసం ఉద్దెశ్యం.
       యధావిధిగా ఆరోజు కూడా సికింద్రాబాద్ రైల్వే రిజర్వేషన్ ఆఫీస్ తన కార్యకలాపాల్ని ఉదయం ఎనిమిది గంటలకే మొదలు పెట్టింది. మొదటి నుండి నాలుగవ కౌంటర్లో ఆరోజు నేను రిజర్వేషన్ క్లర్క్ గా పని చేస్తూన్నాను. ఆ సంఘటన జరిగిన నాటికి రైల్వే రిజర్వేషన్ టికెట్లు ఇంటర్నెట్లో పొందే సదుపాయము లేదు. ఇప్పటిలాగా అన్ని రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ టికెట్లు పొందే సౌకర్యం కూడా లేదు.   జంట నగరాల విషయానికి వస్తే కేవలము సికింద్రాబాద్, నాంపల్లి, మరియు కాచిగూడ స్టేషన్ల లో మాత్రమే ఈ సదుపాయం ఉండేది.   ముఖ్యంగా సికింద్రాబాదులో అన్ని వేళలా బహు రద్దీగా ఉండేది. కారణం సికింద్రాబాదు రైల్వే హెడ్ క్వార్టర్! , అలాగే డిఫెన్స్ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉండటం వలన కావచ్చు .  ఈ సంఘటన జరిగిన రోజు ఆదివారం, విపరీతమైన రద్దీ ఏర్పడింది.   దీనికి మరో కారణం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆఫీసులు ఆదివారం సెలవు దినం. రైల్వే రిజర్వేషన్ ఆఫీసులు మాత్రమే పని చేస్తాయి. మరొక విషయం ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే . సాయంత్రం తిరిగి కౌంటర్లు తెరువ పడవు. ఈ రద్దీకి అనుగుణంగా ఆ రోజు మొత్తం 16 కౌంటర్లు పనిచేయడం ప్రారంభించాయి. హాలు మొత్తము పూర్తిగా పాసింజర్స్ తో నిండి పోయినది.
     సరిగ్గా  9 గంటలకు నా వెనుక  ఉన్న కౌంటర్ల వైపునుండి ఒక భారీ విస్పోటం లాంటి శబ్దము వినిపించినది. వెంటనే ఆ శబ్దము ఏమిటో, ఎక్కడి నుండి వచ్చిందో మాకు ఎవరికీ అంతుపట్టలేదు. వెంటనే నేను నా సీట్లోనుండి లేచి నిల్చొని, వెనక వైపు తిరిగి చూశాను. నా వెనకవైపు కౌంటర్ల మధ్యభాగం నుండి దట్టమైన తెల్లని పొగ నలువైపులా వ్యాపిస్తూ కనబడింది.   ఆ పొగతో పాటు ఆ ప్రాంతంలో పని చేస్తున్న కౌంటర్ స్టాప్ యొక్క కేకలు వినపడ్డాయి. అదే సమయంలో కౌంటర్ల బయట నిలుచున్న పబ్లిక్ లో కొందరు "లోపల బాంబు బ్లాస్ట్ జరిగినది, అందరూ బయటకు రండి" అని గట్టిగా అరవటం  వినిపించింది. మొదటి కౌంటర్ లో పనిచేస్తున్న మాకు ఈ దట్టమైన పొగ అలముకున్న ప్రాంతము నుండి మాత్రమే బయటకు రావాలి .  వేరే ద్వారము లేదు .నేను వెంటనే నాకు దగ్గరలో ఉన్న పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ నుండి "లోపల బాంబు బ్లాస్ట్ జరిగినది ,రిజర్వేషన్ కార్యకలాపాలు ఇప్పట్లో జరగవు ,పాసింజర్లు అందరూ దయచేసి బయటకు వెళ్లిపోండి" అని అనౌన్స్మెంట్ చేశాను.   ఆ మార్గం నుండి నేను బయటకు రావటానికి ప్రయత్నించినప్పుడు ఆ పొగ ప్రభావముతో నాకు శ్వాస సరిగా ఆడలేదు, అలాగే కళ్లు మండుతున్నాయి .నేను వెంటనే చేతి రుమాలు తో ముక్కుకు, నోటికి అడ్డుగా కట్టుకొని బయటకు వస్తున్నప్పుడు అప్పటికే బయటపడ్డ మహిళా సిబ్బంది    ఆ ద్వారం ద్వారా నేను రావడం గమనించి" రెడ్డి సార్ ! క్యాషియర్ రూమ్ లోనే బాంబు బ్లాస్ట్ జరిగినది ,అందులో బాలాజీ రావు, మరియు బాల సుబ్రహ్మణ్యం ఇద్దరు లోపలే ఉన్నారు చూడండి" అని అని చెప్పడం జరిగింది.
     నా వెనకనే ఉన్న నలుగురు సిబ్బంది లో కిషోర్ కుమార్ అనే వ్యక్తి  మాత్రమే నాతో పాటు ధైర్యంగా నా వెనక నిలుచున్నాడు .మిగిలిన ముగ్గురు బయటకు పారిపోయారు. ఆ దట్టమైన పొగలోనే నేను    కిషోర్ సహాయంతో క్యాషియర్ చాంబర్లోకి అడుగు పెట్టే సరికి అక్కడ ఉన్న టేబుల్ మరియు కుర్చీలు విరిగి పడిపోవటం గమనించాము.   లోపల నుండి గట్టిగా మూలుగు వినపడింది.   నాకు ఎదురుగా బాల సుబ్రహ్మణ్యం గారు బట్టలు చిరిగిపోయి, పొట్టలో నుండి ప్రేగులు బయటపడి రక్తపుమడుగులో కనిపించారు. 
          వెంటనే నేను రెండవ ఆలోచన లేకుండా బాల సుబ్రహ్మణ్యం గారిని కిషోర్ సహాయంతో బయటకు తీసుక వచ్చాను.    ఈ లోపల ఎవరో దయ కలిగిన ఒక పాసింజరు తన అంబాసిడర్ కారు లోపలికి తీసుకవచ్చి  హాస్పిటల్ కి తీసుకెళ్తామని సలహా ఇచ్చారు. వీరిని  మేము  కారులోకి ఎక్కించిన తర్వాత .....లోపల బాలాజీ రావు  కూడా ఉన్నాడు, ఆయనను కూడా బయటకు తీయండి.. అని అప్పటికే బయటకు వచ్చిన సిబ్బంది  చెప్పడం జరిగింది. రెండవ వ్యక్తి కూడా ఆ రూమ్ లోనే ఉన్నారన్న విషయము వారు  చెప్పేంత వరకు నాకు తెలియదు . ఆయన ఎటువైపు పడిపోయారో గమనించే పరిస్థితిలో మేము లేము. ఆ పనికి మరో ఇద్దరు ధైర్యవంతులైన సిబ్బందిని  పురమాయించి, నేను, కిషోర్ కుమార్  ఈ బాలసుబ్రహ్మణ్యం గారిని మాకు దగ్గరలో ఉన్న రైల్వే హాస్పిటల్ కి తీసుకెళ్లాం.
     కారులో నా తొడల పైన పడుకున్న బాల సుబ్రహ్మణ్యం గారు నాతో "రెడ్డి! ఏం జరిగింది ,నా ప్రేగులు ఇలా బయటకుఎలా వచ్చాయి, నేను బ్రతుకుతానా, బాలాజీ ఎలా ఉన్నాడు" అని ఏడుస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. అవే ఆయన ఆఖరు మాటలు.  (ఈ వాక్యాలు వ్రాస్తున్నప్పుడు నాలో కలిగిన బాధ వర్ణనాతీతం. తర్వాతి విషయాలను రాయటానికి బరువెక్కిన హృదయానికి విశ్రాంతి అవసరం... అనిపించినదేమో!.. ఈ జ్ఞాపకాలకు అక్షర రూపం కలిగించటానికి తాత్కాలికంగా" కామా" పెట్టి  మరుసటిరోజు కొనసాగించాను)
     ...... దాదాపు పూర్తిగా శ్వాస ఆగిపోయిన సుబ్రహ్మణ్యం గారిని హాస్పిటల్లో చేర్పించాము. వారిని వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. లోపల ఏం జరుగుతుందో మాకు తెలియలేదు. మా రక్తసిక్తమైన చేతులను ,బట్టలను చూసి అక్కడ ఉన్న హాస్పటల్ సిబ్బంది మాకు కూడా ఏమైనా గాయాలు అయినట్లు భావించి ,హాస్పిటల్ బట్టలతో మా బట్టలు మార్పించి, మాకు కూడా డ్రెస్సింగ్ చేశారు .    ఒక పదిహేను నిమిషాల తర్వాత అప్పటికే చనిపోయి, చిన్నాభిన్నమైన బాలాజీ రావు గారి బాడీని ,మరో వాహనములో ఇదే రైల్వే హాస్పిటల్ కు తీసుకు వచ్చారు.  మెల్లగా అందరూ రైల్వే ఆఫీసర్లు, పోలీస్ బృందాలు, మీడియా ప్రతినిధులు, థియేటర్ బయట బెంచీల లో కూర్చున్న మా దగ్గర గుమిగూడారు .  మిగిలిన సిబ్బంది ద్వారా ఇటువంటి భయానక పరిస్థితులలో  ధైర్యంగా ముందుకు వెళ్లి వారిని రక్షించటానికి ప్రయత్నించారు ...అనే విషయం తెలుసుకున్న రైల్వే జనరల్ మేనేజర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు , మిగిలిన మీడియా సిబ్బంది మమ్ములను అభినందించారు. కానీ మా సీనియర్ సిబ్బంది ఇద్దరినీ కాపాడుకోలేకపోవడం వలన మా ప్రయత్నము వృధా అయినది ...అనే బాధ ఈ నాటికీ అలాగే ఉండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న   మా స్టాఫ్ యొక్క కుటుంబ సభ్యులు ,శ్రేయోభిలాషులు   రైల్వే హాస్పిటల్  మరియు , రిజర్వేషన్ ఆఫీస్కి పరుగు పరుగున వచ్చి తమకి సంబంధించిన వారి   క్షేమ సమాచారాలను విచారించారు .ఆ మరుసటి రోజు ప్రముఖ దినపత్రికలలో ఈ విస్పోటనం గురించి వ్రాస్తూ ప్రత్యేకంగా నా పేరును ప్రస్తావించి       ధైర్యసాహసాలతో రక్షించడానికి ప్రయత్నించారు... అని కొనియాడారు.
       ఈ విస్పోటనానికి కారణాలు వెలికి తీసే క్రమంలో పోలీసు వారు మమ్ములను విచారించిన విధానము చాలా ఇబ్బందికరంగా ఉండేది .  అలా కఠినంగా వ్యవహరిస్తే కానీ నిజాలు బయటకు రావు .. అనే సిద్ధాంతంతో వాళ్ల డ్యూటీ వాళ్ళు చేసి ఉండవచ్చు. పోలీస్ విచారణ వ్యవహారంపై అప్పట్లో మేము డివిజనల్ రైల్వే మేనేజర్ గారికి ఫిర్యాదు చేశాము. దానికి ఆయన సమాధానం చెబుతూ అంతకుమునుపు బాంబే లో జరిగిన బాంబు బ్లాస్ట్ సంఘటనలో ఎందరో ఐఎఎస్, ఐపీఎస్ ,బిజినెస్ మాన్ ,మరియు పేరు గాంచిన లాయర్లును కూడా చాలా కఠినంగా ఇంటరాగేట్ చేశారు .మిమ్ములను కేవలము విచారిస్తున్నారు. అది వారి నైజం . అసలు హంతకులు దొరికేంతవరకు ఈ విచారణ తప్పదు. మీరు వారికి సహకరించాలి.... అని సెలవిచ్చారు .
         పోలీస్ ప్రాథమిక విచారణలో తేలిన విషయం ఏమిటంటే...... బాంబ్ బ్లాస్ట్ కు ముందు రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు క్యాషియర్ గా డ్యూటీ చేసిన రామస్వామి అనే వ్యక్తి, రాత్రి 8 గంటలకు స్టాప్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత, క్యాష్ సీల్ చేయించి, 12 గంటలకు డ్యూటీ కి రావలసిన బాలాజీ రావు గురించి వెయిట్ చేస్తూ ,కౌంటర్ల వెనకవైపు ఉన్న కారిడార్ లో, అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆ సమయంలో ఆయనకు తన ఎదురుగా  కౌంటర్ దగ్గర్లో ఉన్న  పిల్లర్ ప్రక్కన ఒక టిఫిన్ బాక్స్  కనిపించినది. ఆ బాక్స్ ను ఆయన సాయంత్రం కౌంటర్ డ్యూటీ చేసిన వ్యక్తిదిగా భావించి తిరిగి మరుసటి రోజు ఆ వ్యక్తికి  అప్పచెబుదామనే ఆలోచనతో ,ఆ బాక్సను క్యాషియర్ రూములో  ఉన్న స్టీల్  అల్మరాలో పెట్టారు.  ఆ  టిఫిన్ బాక్స్ లోనే టైం బాంబు ఉన్నది ....అనే విషయము ఎవరికీ తెలియదు . ఈ విస్ఫోటం జరగటానికి ప్రణాళిక రచించిన తీవ్రవాదులు ముందుగానే రెక్కీ నిర్వహించి ,ఏ రోజు ,ఏ టైంలో ఎక్కువమంది పబ్లిక్ రిజర్వేషన్ ఆఫీసుకు వస్తారో నిర్ధారించుకుని, ఆఫీస్ సెంటర్లో దీనిని అమర్చడం ద్వారా, అధిక ప్రాణనష్టం జరుగుతుంది అని భావించి ఉదయం 9 గంటలకు పేలేటట్లుగా టైం సెట్ చేసి, కౌంటర్లు మూసి వేసే సమయం కన్నా ముందుగానే వచ్చి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ బాక్స్ ను అక్కడ అమర్చడం జరిగింది. ఈ రామస్వామి అనే వ్యక్తి ఆ టిఫిన్ బాక్స్ అలమరాలో పెట్టిన విషయము ఎవరితోనూ చెప్పలేదు ,ఆ రోజు సాయంత్రం పోలీస్ విచారణలో తప్ప.
       ఈ  దుర్ఘటన ద్వారా చనిపోయిన ఇద్దరు వ్యక్తులను తరువాత గాంధీ హాస్పిటల్ కు తరలించి పోస్ట్ మార్టం చేసారు .క్యాష్ రూములోనే మరణించిన బాలాజీ గారికి ఉదర  ప్రాంతము నుండి దాదాపు 4 కేజీల బరువు గల ఇనుప ముద్దలు లాంటి  భాగాలను వెలికితీశారు .మూసి ఉంచిన ఇనుప బీరువాలో బాంబు పేలడం ద్వారా ఆ  బీరువా యొక్క రేకులు పేలుడు ప్రభావానికి  ముద్దలుగా ఏర్పడి ఉదర భాగంలో  గుచ్చుకున్నాయి అని తెలిసింది. తదనంతర కార్యక్రమాలను మరుసటి రోజు రైల్వే వారు అధికారికంగా నిర్వహించారు.
     తర్వాతి పోలీస్ విచారణకు , సంఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న 6 మంది సిబ్బందిని ,అలాగే రిజర్వేషన్ ఆఫీస్ ఇన్చార్జిని ,ముందు రోజు   టిఫిన్ బాక్స్ అల్మరా లో ఉంచిన రామస్వామి అనే వ్యక్తిని విడివిడిగా పిలిపించి, వారి వారి పద్ధతిలో విచారించారు. ముఖ్యంగా రామస్వామి గారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి తనకు ,బాలాజీ రావు గారికి ఏదో పాత కక్షలు ఉన్నాయి కనుక ,అతన్ని చంపాలని ప్రణాళిక వేసినట్టు అనుమానించి , థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు ..అని తెలిసింది. తర్వాతి విచారణ ఎదుర్కొన్న రెండవ వ్యక్తి రిజర్వేషన్ ఆఫీస్ ఇంచార్జి .కౌంటర్లు మూతబడ్డ తర్వాత ఎవరైనా అనుమానిత వ్యక్తులు, లేదా వస్తువులు లోపల ఉన్నాయా ...అని సరిగా తనిఖీ చేయించలేదనే కారణంతో ఆయనని చాలా ఇబ్బందికి గురి చేశారు. తరువాతి నలుగురు ,బ్లాస్ట్ జరిగిన కౌంటర్ లకు అటు ఇటు పనిచేసిన సిబ్బంది .వారిని సాధారణ విచారణ జరిపించి ,వారితో స్టేట్మెంట్లు తీసుకొని తర్వాత అవసరమైతే తిరిగి పిలిపిస్తాము ...  అని చెప్పి పంపారు.
      ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిలు గా నన్ను, మరియు కిషోర్ కుమార్ అనే వ్యక్తిని నిర్ధారించారు. నన్ను సిబిఐ ఆఫీసర్  లోపలికి పిలిపించి, నలుగురు ఇన్స్పెక్టర్ ల మధ్యన కూర్చోబెట్టి, మర్యాదపూర్వకంగానే మాట్లాడుతూ, మధ్య మధ్యలో కఠినంగా వ్యవహరిస్తూ ,ప్రాథమిక విచారణలో తెలియజేసిన విషయాలు కాకుండా, ఇంకా ఏమైనా కొత్త సమాచారం వెలికి తీయాలనే క్రమములో ..."నువ్వు ధైర్యంగా బ్లాస్ట్ జరిగిన రూమ్ లోకి ఎలా ప్రవేశించావు? అక్కడ ఒకటే పేలుడు సంభవిస్తుంది అని ముందుగానే పసిగట్టేవా? మరో కొన్ని బాంబులు అక్కడ ఉన్నాయేమో  అనే అనుమానం నీకు కలగలేదా ? చనిపోయిన బాల సుబ్రహ్మణ్యం గారిని హాస్పిటల్ కి మీరే తీసుకెళ్లారు కదా ? ఆఖరి సారి ఆయన నీతో ఏమి మాట్లాడారు .ఈ బ్లాస్ట్ కు సంబంధించి నీతో ఏమైనా చెప్పారా? ఇలా ఎన్నో మరెన్నో ప్రశ్నలతో విసిగించే వారు. ఇదే విధానము కిషోర్ కుమార్ విచారణలో  కూడా అవలంబించేవారు అని తెలిసింది. ఇలా నెలరోజుల వ్యవధిలో  5 ,6 సార్లు మా ఇద్దరిని రకరకాల ప్రశ్నలతో విచారించారు.
       మూడు సంవత్సరాల తరువాత అసలు హంతకులు పూణేలో పట్టుబడ్డారు. పోలీసు వారి ఇంటరాగేషన్  లో వారే అసలు హంతకులు.. అని నిర్ధారించుకుని చర్లపల్లి జైలుకు తరలించారు. తిరిగి ఆ ఇద్దరినీ  కోర్టులో ప్రవేశ పెట్టే క్రమంలో, సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మమ్ములను జైల్ ఆవరణలో ఉన్న కోర్టుకు పిలిపించి,  ఎదురుగా ఉన్న బోనులో హంతకులను ప్రవేశపెట్టి  ,వారిని గుర్తించగలరా ?అని జడ్జి గారు ప్రశ్నించారు .దానికి సమాధానంగా మేము ఇంతకుమునుపు వారిని ఎక్కడ చూడలేదు ,వారు ఎవరో మాకు తెలియదు అని చెప్పాము. అంతటితో విచారణ పూర్తి అవటం వలన మమ్ములను విముక్తుల్ని చేశారు. ఈ వ్యవహారం అంతా పూర్తి అవడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది .తర్వాత హంతకులకి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించారు అని తెలిసినది.
      చావుపుట్టుకలు మన చేతుల్లో ఉండవు .అవి ఎప్పుడో భగవంతుడు ముందుగానే నిర్ణయిస్తారు. అనేదానికి ఇది నిలువెత్తు సాక్ష్యం ఈ దుర్ఘటన. అలా కాకపోతే ఉదయం ఎనిమిది గంటలకే డ్యూటీ అయిపోయిన బాలాజీ రావు గారు రిలీవర్ సుబ్రహ్మణ్యం గారు ఆలస్యంగా రావడంతో  9 గంటల వరకు వెయిట్ చేయవలసి వచ్చింది .అలా కాక ముందుగా వెళ్ళిపోయి ఉండి ఉంటే ..బాల సుబ్రహ్మణ్యం గారు ఒక్కరే ఈ సంఘటనను ఎదుర్కొనే వారేమో! అలాగే ముందురోజు రామస్వామి గారు ఆ బాంబు ఉన్న టిఫిన్ బాక్స్ ను గమనించకుండా ఉండి ఉంటే... హంతకులు తమ ప్రణాళికలో ఊహించినట్లుగానే చనిపోయిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడి మిగిలిన  రిజర్వేషన్ సిబ్బంది , మరియు హాలులో అధిక సంఖ్యలో ఉన్న  ప్రజలకు పెను ప్రమాదం జరిగి ఉండేది. క్యాష్ రూములోనే చనిపోయిన  బాలాజీ రావు గారు ఆరోజు ఉదయము 8:30 ప్రాంతంలో ప్రతి కౌంటర్ దగ్గరకు వచ్చి, కౌంటర్లకు అవసరమైన చిల్లర అందించి, అందరిని పలకరించి" టాటా ఇక సెలవు.. తిరిగి ఇకరాను "అనే విధంగా  పలకరించి అనంతలోకాలకు వెళ్లిపోయారు. మా అందరి అదృష్టంమో,  లేక ఆ భగవంతుని కృపా విశేషమో .. తెలియదు కానీ ఆ రెండు ప్రాణాలతోనే  సరిపెట్టుకుంది  ఆ దుర్ఘటన.  ఇలాంటి భయంకర
దుర్ఘటనను,యెలా మరచిపోగలం?
కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
అతి భయంకరమైన
మీ అనుభవం/జ్నాపకం
ఈతరానికి తెలిసేలా
చాలా బాగా రాసారు.
ఆ రోజులు మీకు ఎంతటి
వ్యధను కలిగించాయొ
అర్ధం అవుతున్నది.
మీకు అభినందనలు రెడ్డి గారు.
----డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
Shyamkumar chagal.nizamabad చెప్పారు…
Thank you sir. Good informative story. Nice work 👏
Shyam Kumar చెప్పారు…
Good work by details.tq
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
పెను ప్రమాదం నుండి... ముప్పు తప్పిందాని ఓ రకంగా
సంతోషమే ఐనా.... ఇద్దరు మంచిఉద్యోగుల ప్రాణాలు పోవటం బాధాకరం ! సంఘటనను కళ్ళకు కట్టినట్టు
అభివర్ణించిన రచయితకు ధన్యవాదాలు !🙏🌷🙏

--------కోరాడ నరసింహ రావు
విశాఖపట్నం.