నేను పుట్టిపెరిగిన బజుల్లా రోడ్డులోని పద్నాలుగో నెంబర్ ఇల్లు ఓ మరాఠీ వారిది. ఆ ఇంటి యజమాని రాజారాంగారు ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో పని చేసేవారు. ఇంటి ప్రహరీ గోడ మీద "కామధేను" అని పేరుండేది. విశాలమైన ఇంటి ఆవరణలో వేర్వేరు భాషల వాళ్ళు అద్దెకుండేవారు. కానీ అందరినీ కలిపిన ప్రధాన అంశం ఐకమత్యమే. భిన్నత్వంలో ఏకత్వంగా మా కామధేను నిలయాన్ని చెప్పుకోవచ్చు.
ఇంటి యజమాని వాటాలోని హాల్లో ఓ ఊయల ఉండేది. ఆ ఊయలలో పిల్లలందరం కూర్చుని గోలగోల చేస్తూ ఊగేవాళ్ళం. కానీ ఎప్పుడూ ఇంటివాళ్ళు అడ్డుపెట్టేవారు కాదు. పేరుకే అద్దె వాటాలలో ఉన్నట్టు చెప్పుకోవాలి తప్ప కలిస్తే సొంతింట్లో ఉన్నట్టే ఉండేది. అంత హాయిగా ఆనందంగా గడిపిన కామధేను నిలయమది.
అయితే ఉయ్యాల ఊగేవిషయానికొస్తాను.
ఊయ్యాల ఊగడంలో కొన్ని ముఖ్యాంశాలున్నట్టు ఇటీవల తెలిసింది.
పూర్వకాలంలో ఊరవతల ఓ పెద్ద మర్రి చెట్టుంటే దానికో ఊయల కట్టి ఆడుకునేవారు అమ్మాయిలు. ఆనందంగా ఊయలలో ఊగేవారు. కాలక్రమేణా అది కాస్తా కనిపించకుండా పోయింది.
ఊయల ఊగడంవల్ల మనసులో ఉండే విభిన్నమైన ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు పుట్టడానికి దోహదపడేవట.
పెళ్ళిళ్ళలో ఊయల ఊగడమనేది ఓ సంప్రదాయంగా నిర్వహించేవారని ఈకాలంవారికసలు తెలీదు.
ఊయల ఊగడం వల్ల మానసిక అలసట తీరి ఉత్సాహం పెరిగేది.
తిన్నగా కూర్చుని చేతులు పైకెత్తిరెండు పక్కల సంకెళ్ళను పట్టుకుని వేగంగా ఊగుతున్నప్పుడు రక్తప్రసరణ సవ్యంగా జరిగి మెదడు చురుగ్గా పని చేస్తుందట.
కంప్యూటర్ ముందు కూర్చుని గంటల కొద్దీ అంతర్జాలం చూడటం వీడియో గేమ్స్ ఆడటంతో తలెత్తే సమస్యలు (మెడనొప్పి వంటివి) ఊయలను ఓ నిర్ణీత పద్ధతిలో ఊగితే తీరుతాయట.
హృదయానికి స్వచ్ఛమైన ప్రాణవాయువు ఇచ్చి హృదయం సవ్యంగా పని చేసేలా చేస్తుంది. రోజూ తోటలో ఊయల ఊగేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువట. ఊయల ఊగడం వల్ల దేహంలో రక్తప్రసరణ సక్రమంగా ఉం
డి హృదయానికి రక్తం చక్కగా ప్రసరిస్తుందట.
అన్నం తిన్న తర్వాత అర గంట పాటు మితమైన వేగంతో ఊయల ఊగడం ఆరోగ్యరీత్యా మంచిది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఊయల ఊగడం పనికొస్తుంది.
కోపంతో ఉన్నప్పుడు ఊయల ఊగితే కోపం పోతుందట.
బయటికెక్కడో పని మీద వెళ్ళి ఇంటికొచ్చాక ఊయలలో కూర్చుని కళ్ళు మూసుకుని తలను కాస్త పైకెత్తి రెండు చేతులనూ ఊయల బల్లపై ఉంచి రిలాక్బ్ అయి ఊగితే అలసట ఎగిరిపోయి దేహంలోని ఒక్కొక్క భాగమూ విశ్రాంతి పొంది ప్రశాంతత ఏర్పడుతుంది.
పూర్వకాలంలో దాదాపుగా ప్రతీ ఇంటిలోనూ హాల్లో ఊయల ఉండేది. లేదా ఇంటి ఆవరణలో ఉండే చెట్టున చాంతాడుతో ఓ ఊయల ఏర్పాటు చేసేవారు. ఈ ఊయలలో ఊగడానికి అందరూ ఇష్టపడేవారు. మైదానాలలోనూ ఊయలలుండటం ఎరగడమే కాక ఆడిన రోజులున్నాయి. చలంగారింట చెట్టుకి ఊయల ఏర్పాటు చేసుకుని ఊగిన కాలం గుర్తే. ఊయలలో కూర్చుని మాట్లాడటం అలవాటుగా ఉండేది. కానీ ఈరోజులలో ఊయలనేది నూటికో కోటికో ఉంటోంది. అన్నింటిలాగే ఊయల విషయాన్ని "ఆరోజులలో....." అని మొదలుపెట్టి చెప్పుకునే స్థితిలోకొచ్చాం. ఎంతైనా పాత రోజులే అన్ని విధాలా మంచి రోజులనే అనిపిస్తుంటుంది ఇప్పటికీనూ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి