"మింట్" కథాగమనం:-- యామిజాల జగదీశ్ తంగశ్శాలై - చెన్నైలో డబ్బు ముద్రించిన వీధి. తమిళంలో తంగశ్శాలై అన్న దానినే ఇంగ్లీషులో మింట్ స్ట్రీట్ అంటారు.
చెన్నైలో ఒక్కొక్క వీధికో చరిత్ర ఉంది.
మహాత్మా గాంధీ నడచిన వీధి, వల్లలార్ ఉండిన వీధి, మౌంట్ బాటన్ విహరించిన వీధి, మన్రో నడచిన వీధి, రాబర్ట్ క్లయివ్ వచ్చి ఉండిన వీధి అంటూ చెన్నైలో అనేక వీధులు చరిత్రపుటలకెక్కాయి. కాల ప్రవాహంలో పాత అడుగుజాడల చోట కొత్త కొత్తవి నమోదవుతుండటాన్ని ఎవరూ ఆపలేకపోవచ్చు. కానీ గత చరిత్ర తెలుసుకోవాలనే ఆరాటముంటే ఏదో ఒక పాతదే కొత్త  సంగతిలా మన కళ్ళ ముందు కదలాడుతాయి.
అటువంటి చెన్నైని ఒకానొకప్పుడు నలుపు - తెలుపు ప్రాంతాలుగా  చెప్పుకున్న వాటిలోనే మింట్ స్ట్రీట్ ఒకటి. 
చెన్నైని పాలించిన బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ నాణాలు ఈ వీధిలోనే తయారయ్యేవి. ఇక్కడ తయారైన నాణాలే భారత దేశమంతటా చలామణిలో ఉండేవి.
చెన్నై సెంట్రల్ (రైల్వే స్టేషన్) మొదలుకొని ఓల్డ్ జైల్ రోడ్డుతో ముగిసే ఈ రెండున్నర కిలో మీటర్ల పొడవు వీధి చెన్నై ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలకు కేంద్రబిందువుగా ఉండేది.
నాటి ఎగ్మూర్ నదీ తీరాన ఉండిన ఈ వీధిలోనే ఆంగ్లేయులు, బట్టలు ఉతికే కార్మికుల నివాసంకోసం ఏర్పాటు చేసిందే వణ్ణార్ శాలై. వణ్ణారప్పేట్టై అని అనికూడా అంటారు. దీనినే వాషర్మన్ పేట్ అనేవారు ఇంగ్లీషులో. 
జార్జ్ కోటలో పని చేసిన ఆంగ్లేయాధికారుల దుస్తులను శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసివ్వడమే వీరి ప్రధాన పని. 
కాలక్రమంలో వస్త్ర ఎగుమతి పెరిగి తెలుగుని మాతృభాషగా కలిగిన నేతగాళ్ళు వస్త్రాలు నేసి వర్ణాలద్దే కార్మికులూ ఈ వీధి పరిసరాలలో నివసించడం మొదలుపెట్టారు.
 
కొన్ని సమాధులుకూడా ఉన్న ఈ వీధిలోనే  ఓ విద్యాలయం నడుస్తోందిప్పుడు.
విజయనగర నాయకుల ప్రతినిధులు, గుజరాతీలు, మార్వాడీలు తదితర ఇతర తెగలవారుకూడా ఈ వీధిలో నివసించిన వారే. ఇప్పటికీ ఉన్నారుకూడా. ఈ కారణంగానే పలు భాషలను వినిపించే ఈ వీధిని భిన్నత్వంలో ఏకత్వమని చెప్పుకోవచ్చు.
పదిహేడో శతాబ్దంలో విజయనగర నేతల ప్రతినిధి వేంకటాద్రి నాయకర్ పాలనలో ఉండేదీ చెన్నై.
విష్ణుమూర్తి వరాహ అవతార రూపంలో బంగారు వరాహాలు అప్పట్లో వాడుకలో ఉండేవి. ఆ కాలంలో  ఈ నగరానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ వర్తక బృందం, చెన్నైని వాణిజ్యంకోసం కొనుక్కుంది. అలాగే తామే నాణాలను ముద్రించే హక్కులనూ పొందారు.
ప్రాచీన చెన్నై మెల్లమెల్లగా వాణిజ్యపరంగా విస్తరించడం, చెన్నై సెయింట్ జార్జ్ కోటలో ఓ మింట్ పరిశ్రమను ఈస్టిండియా కంపెనీ ప్రారంభించడంతో ఈ వీధి చరిత్రపుటల్లో ప్రధానమైనదిగా నమోదైంది. ఇక్కడ తయారైన బంగారు, వెండి కరెన్సీ చలామణిలోకి తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీలకు ప్రధాన కేంద్రంగా మార్చింది ఆంగ్లేయులే.
అంచలంచెలుగా ఇక్కడి నుంచి వృద్ధి చెందిన ఇంగ్లీష్ వారు నాణాల అవసరం పెరిగింది. దాంతో నాణాల పరిశ్రమలన్నింటినీ ఏకం చేసి వణ్ణారశాలైలో 
భారీ ఎత్తున ఒక పరిశ్రమను స్థాపిస్తే బాగుంటుందని అప్పట్లో ఆర్థిక రంగాన్ని పర్యవేక్షించిన డాక్టర్ బానిస్టర్ సూచించారు.
ఆయన చేసిన సూచనను పరిగణలోకి తీసుకుని మొత్తం నాణాలను తయారుచేసే పరిశ్రమలను వణ్ణార్ శాలైకి మార్చింది ఈస్టిండియా కంపెనీవారే. అణా, పైసా, రూపాయి ఇలా రకరకాల నాణాలు, నోట్లు ఈ పరిశ్రమలోనే తయారయ్యేవి. వణ్ణార శాలై క్రమక్రమంగా తంగశ్శాలై (మిట్ స్ట్రీట్) గా మారింది.
దేశమంతటా తమ పాలనను విస్తరించిన ఈస్టిండియా కంపెనీ అనంతరం బొంబాయి (ముంబై), కలకత్తా తదితర ప్రాంతాలలో నాణాల పరిశ్రమలను నెలకొల్పింది. దాంతో చెన్నైలోని నాణాల పరిశ్రమ క్రమంగా తరుగుతూ వచ్చింది. 1869లో ఈ పరిశ్రమను మూసివేశారు. ఈస్టిండియా కంపెనీ దీనిని ధృవపత్రాలను ముద్రించే కేంద్రంగా మార్చేసింది. తర్వాతి కాలంలో తమిళనాడు ప్రభుత్వం దీనిని అధికారపూర్వక ముద్రాణాలయంగా మార్చింది. ఇప్పటికీ బడ్జెట్ మొదలుకుని కవర్లు వంటివన్నీ ఇక్కడి ప్రెస్సులోనే అచ్చవుతుంటాయి.
డబ్బులను ముద్రించే తంగశ్శాలై కాలక్రమేణా ప్రింటింగే ప్రెస్ కేంద్రంగా మారిపోయింది.  ఈ వీధిలోనే మరొక ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉండేది.  తిరుక్కురళ్, ఆత్తిచ్చూడి వంటి అనేక ప్రసిద్ధ గ్రంథాలూ కావ్యాలూ ఇక్కడే అచ్చయ్యేవి.
1900లో ఆరంభమైన శాస్త్ర సంజీవినీ ప్రెస్ ఇప్పటికీ అదే పేరుతో ఇక్కడ నడుస్తోంది.
1880లలో "ది హిందూ" పత్రిక వారానికి మూడు రోజులు వచ్చేది. అప్పట్లో ఇక్కడి వీధిలోనే ఈ పత్రిక అచ్చయ్యేది. 
అప్పట్లో పల ప్రముఖ తమిళ , తెలుగు పత్రికలు ఈ వీధిలోనే అచ్చయి దక్షిణ భారతదేశమంతటికీ పంపిణీ పంపిణీ అయ్యేవి. 
నాణాలు, ప్రింటింగ్ ప్రెస్సులతో చరిత్రపుటలకెక్కిన ఈ తంగశ్శాలై కళలకూ నిలయమైంది. వాణిజ్యంకోసం ముంబై వెళ్ళినప్పుడు అక్కడి నాటకాలను చూసి ఆశ్చర్యపోయిన పొన్నేరి మురుగేశ ముదలియార్, మింట్ ప్రాంతంలో ఉన్న సెయింట్ జేవియర్ వీధిలో ఉన్న తన అంగడి కేంద్రాన్ని నాటక వేదికగా మార్చి మెజస్టిక్ థియేటర్ అని నామకరణం చేసారు. ఆ వేదికపై ఎస్జీ కిట్టప్పా మొదలుకుని టి.కె. షణ్ముగం సోదరులు, కాళి ఎన్. రత్నం వంటి ప్రముఖ కళాకారులు తమ నాటకాలను ప్రదర్శించారు. ఆ తర్వాత చలన చిత్రాలు మొదలయ్యాయి. ముంబై నుంచి సినీపరిశ్రమకు అవసరమైన పరికరాలను కొనుక్కొచ్చిన మురుగేశ ముదలియార్ నాటక వేదికనే థియేటర్ గా మార్చేశారు. సినిమాలు చూడటానికి వచ్చేవారి సంఖ్య అధికమవడంతో మెజస్టిక్ సినిమా థియేటర్ ఆవరణలోనే ప్రిన్స్ అనే మరొక కొత్త థియేటర్ నికూడా నిర్మించారాయన. కానీ బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం దానికి లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో అది ప్రారంభమైన ఏడాదిలోపే మూతబడింది. 1931లో మౌఖిక సినిమాలు మొదలైనప్పుడు మెజస్టిక్ థియేటర్ కాస్తా కినిమా సెంట్రల్ అని పేరు మారింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మౌఖిక చిత్రమైన ఆలం ఆరా, తమిళంలో మొదటి మౌఖిక చిత్రమైన కాళిదాస్ మొదలుకుని అనేక సినిమాలను ఈ కినిమా సెంట్రల్ లోనే విడుదలయ్యాయి. మురుగేశ ముదలియార్ మరణించిన తర్వాత అతని కుమారుడు పరమశివ ముదలియార్ తన తండ్రి స్మృత్యర్థం మురుగన్ టాకీస్ అని కినిమా సెంట్రల్ కి పేరు మార్చాడు.
మార్వాడీలు, గుజరాతీలు, జైన్లు, ఇలా అనేక తెగలవారు నివసించిన మింట్ స్ట్రీట్లో 
దేవాలయాలు, భజన మఠాలూ ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి. 
మింట్ స్ట్రీట్ చరిత్ర గుర్తుగా దాని ఉత్తర దిశ అంచున ఓ పురాత క్లాక్ టవర్ ఉంది. అది అరవై అడుగుల ఎత్తున్న క్లాక్ టవర్. దీనికి 1948లో అప్పటి నగర మేయర్ కృష్ణారావు ప్రారంభోత్సవం చేశారు. 
ఇలా చెప్పుకుంటే బోలెడంత ఉంటుంది ఈ వీధి చరిత్ర. 

కామెంట్‌లు
Unknown చెప్పారు…
మంచి విషయాలు చెప్పార. అన్ని విషయాలుకలిపి ఓ పుస్తకం తీసుకరండి