*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౦౧ - 101)

 మత్తేభము:
*భసితోద్ధూళనధూసురాంగులు, జటా | భారోత్తమాంగుల్, తపో*
*వ్యసనుల్, సాధితపంచవర్గరతులున్ | వైరాగ్యవంతుల్, నితాం*
*త సుఖస్వాంతులు సత్యభాషణ సము | ద్యద్రత్న రుద్రాక్షరా*
*జి సమేతుల్ తుద నెవ్వరైన గొలుతున్ |  శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
 నేను ఒంటి నిండా విబూది రాసుకుని తిరిగే వారిని, జుత్తుని జడలు కట్టేలాగా పెంచుకున్న వారిని,  తపస్సు చేసుకోవడమే పనిగా వున్న వారిని,  నీ పేరు జపించడమే పనిగా పెట్టుకుని వున్న వారిని,  అన్ని కోరికలను చంపుకుని ఏ కోరికా లేకుండా విరాగిలా వుండే వారిని, ఎప్పుడూ నిజము మాత్మే మాట్లాడే వారిని, రుద్రాక్షను ఎప్పుడూ తమ దగ్గరగా వుంచుకునే వారిని, ఇటువంటి వారు ఎవరైనా నువ్వే వాళ్ళ రూపంలో వచ్చావు అనుకుని, వాళ్ళని నీవే అనుకుని, రోజూ పూజ చేసుకుంటాను.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మహాశివా! విబూదిలో, రుద్రాక్షలో, ఓం కారంలో, నీటిలో, వీస్తున్న పవనంలో, ఇలా నా చుట్టుపక్కల ఎక్కడ చూసినా నీవే కదా కరుణామూర్తీ.  నిత్య తాపసుల రూపంలో, బైరాగుల లాగా ఎవరిని చూసినా నీవే కనిపిస్తావు కదా సర్వాంతర్యామి.  నీవు సర్వ జీవాత్మకుడవు.  ఎవరిని ఎక్కడ చూసినా వారందరిలో నాకు నీవే కనిపిస్తన్నావు, సర్వవ్యాపకా. నిన్ను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో వెదకడం ఎందుకు స్వామీ, నా చుట్టుప్రక్కల అన్ని చోట్లలో  నీవే దర్శనం ఇస్తన్నావు కదా, కాత్యాయనీ పతీ. ఇలా అంతా నీవే అయివుండగా, నేను వేరే ఎవరినో ఎందుకు పూజిస్తాను, వ్యుప్తకేశా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు