ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 297 1999

 పట్నం నుండి
మా మల్లారం 
నేను ఎప్పుడు పోయినా
"ఎప్పుడచ్చినవ్ బిడ్డా?"
"అంతా మంచిదేనా?"
"పానం మంచి గుంటుందా?"
"పట్నం ల ఎక్కడ జూసిన గని
బగ్గ గడిదే నట గదా?"
"రాంగ, పోంగ
బస్సులు ఎక్కే కాడ,
దిగే కాడ జెర పయిలం బిడ్డా!"
"ఊరిడిసిన మనిషి
అనమిడిసిన కోతి,
 ఒక్క లెక్కనే!
బతుకు దెరువు కోసం
పట్నం బోతివి
గా పట్నం ల అయ్యనా? అవ్వనా??
నోరు మంచిదైతే ఊరు మంచిదైతది
అందరితోనీ మంచిగ
కలిసి మెలిసి ఉండాలే బిడ్డా
ఎవ్వల తెరువు పోవద్దు,
ఎవ్వల జోలికి పోవద్దు,
ఎవ్వల తోని లొల్లి పెట్టుకోవద్దు,
మంచోల్ల తోనే సోపతి జేయాలే
గసొంటోల్లే అక్కెర కత్తరు
గాల్లే దీముంటరు
ఊరిడిసి 
బతుకు దెరువు కోసం
వోయినందుకు
కాడ వోకుంట 
నౌకరి మంచిగ జేసుకో
దుబారాగా కర్సు సెయ్యకు
నాలుగు పైసలు కూడ వెట్టుకో
ఓటల్లల్ల తినకు
నువ్వే అండుక తిను
కాల్ రెక్కల్ మంచిగుంటే
మత్తు సంపాదిచ్చుకోవచ్చు
పానం మంచిగ కాపాడుకో
ఊరిడిసి,ఇల్లిడిసి పట్నం పోయినందుకు అయ్యవ్వ పేరు నిలవెట్టు బిడ్డా!"
అని  తల్లి లెక్క,తండ్రి లెక్క,అన్న లెక్క,అక్క లెక్క బుద్ధీ,గ్యానం సెప్పే
మా పల్లె మనుషులు
మల్లె మనసులుల్లా!
ఔ మల్ల!

కామెంట్‌లు