హాయిగా నవ్వండి:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిది.సైన్స్ పరంగా చూస్తే నవ్వు వలన బోలెడు లాభాలు ఉన్నాయి!
       నవ్వు అందాన్ని పెంచుతుంది.నోటిలోని సెలైవా గ్రంధుల్ని,,కన్నీటి గ్రంధుల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఎక్కువగా నవ్వితే ఆనంద భాష్పాలు వస్తాయి.శరీరంలో కండరాలు విశ్రాంతి  పొందుతాయి.
        నవ్వడంవలన మెదడులో ఎండార్ఫిన్ అనే రసాయనం స్రవిస్తుంది.దీనివలన నొప్పులు తగ్గిపోతాయి. 
         ప్రకృతిలో మనిషి మాత్రమే నవ్వగలడు. చింపాంజీ కొంతవరకు నవ్వినట్టు కనుపించినా 'అభివృద్ధి చెందని నవ్వు' (primitive laughter) గా శాస్రజ్ఞులు పేర్కొంటున్నారు.నవ్వు మనిషి దుఃఖాన్ని పోగొడుతుంది.బాధలను మరిపిస్తుంది.నవ్వు ఎదుటివారిలో మనమీద సదభిప్రాయం ఏర్పరుస్తుంది.అందుకే సేల్స్ రంగంలో ఉన్నవ్యక్తులు మరికొన్ని వృత్తుల్లో ఉన్నవారికి నవ్వు ఎంతో ముఖ్యం.
       కొన్ని జానపద కథల్లోరాజుగారి దగ్గర విధూషకుడు ఉండి ఆయనకు తన ఛలోక్తులతో ఆనందం కలిగించినట్టు ఉంటుంది.ఎందుకంటే పనివత్తిడి వలన రాజుగారికి మనసుబాగుండక పోతే విధూషకుడి ఛలోక్తులే ఆయనకు సంతోషం కలిగిస్తాయి!
        నవ్వు గుండెవ్యాధుల్ని తగ్గిస్తుంది.అధిక రక్తపుపోటు తగ్గిస్తుంది.అప్పటి అమెరికా ప్రెసిడెంటు అబ్రహాం లింకన్ తన టేబుల్ మీద హాస్య పుస్తకాలు ఉంచుకునేవాడట!ఆయనకు పని వత్తిడి కలిగినా,బాధ కలిగినా చుట్టూ ఉన్న వారిమీద విరుచుక పడకుండా ఆపుస్తకాలు చదివి తిరిగి ఆనందం పొందే వాడట.
       ఈ నవ్వు వలన ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే ముంబాయిలో డా॥ మదన్ కటారియా అనే వైద్యుడు 'లాఫింగ్ క్లబ్' ఐదుగురుతో ప్రారంభించాడు. ఇప్పుడు ఈ క్లబ్బులు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాయి.పొద్దున్నే ఒక పార్క్ లోనో అనువైన ప్రదేశంలో అందరూ చేరి మనసార నవ్వడం నేర్చుకుంటారు.అది క్లబ్ ముఖ్యోద్దేశం.
      నవ్వడానికి ముఖంలోని 17 కండరాలు ఉపయోగిస్తాము.అదే కోపం వచ్చినపుడు 43 కండరాల్ని ఉపయోగించాల్సి ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
      నవ్వడంవలన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
       చూశారా నవ్వతో ఇన్ని లాభాలు ఉన్నాయి. మనసారా నవ్వడానికి ఖర్చు కూడాలేదు.
    అందుకే అందరూ హాయిగా నవ్వండి.
నవ్వడం 'ఒక భోగం-నవ్వకపోవడం ఒక రోగం' అని ప్రసిద్ధ దర్శకుడు కీ.శే.జంధ్యాల గారు చెప్పేవారు.
                   ***********

కామెంట్‌లు