సృజనకు పదును:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 సునీల్ కి ఆటలంటే ఎంతో ఇష్టం,ప్రతిరోజూ సాయంత్రం స్నేహితులతో  క్రికెట్,కబాడీగానీ ఆడి అలసి ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి ఓ కథో,సైన్స్ వ్యాసమో చదివి పడుకునే వాడు.
          ఇలా హాయిగా రోజులు గడిచిపోతుండగానే 'కరోనా' మహమ్మారి వచ్చి పడింది!ఇప్పుడేమో కరనా సెకండ్ వేవ్ అంటున్నారు.
            సునీల్ అమ్మా,నాన్న ఆ భయంకర వైరస్ జబ్బును గురించి పత్రికలలో చదివి సునీల్ బయటికెళ్ళి గుంపులో ఆడుకుంటే కరోనా అంటుకుంటుందేమోనని భయపడి పోయారు.అందుకేసునీల్ ని ఇంటికే పరిమితం చేశారు.
          ఎంతో హుషారుగా ఉండే సునీల్ని బయటకు పోవద్దు అనే సరికి మానసికంగా ఒంటరితనం ఫీల్ అవసాగాడు.
         సునీల్ లో కలిగిన మార్పుని సునీల్ నాన్న,అమ్మగార్లు గమనించారు.సునీల్ని ఏదో ఒక సృజనాత్మకతలో ప్రోత్సహించాలని నిర్ణయించారు!
సునీల్ నాన్నగారు రకరకాల కథల పుస్తకాలను 'ఆన్ లైన్' లో తెప్పించారు.ఆ పుస్తకాలు చూసేసరికి సునీల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది.కథలు చదవ సాగాడు.సరదాగా ఆ కథల్ని అమ్మకు చెప్పసాగాడు!సునీల్ నాన్న ఆ విషయం తెలుసుకుని ఎంతో సంతోషించాడు.
         రెండు రోజుల తరువాత సునీల్ నాన్నగారు పొడుగు తెల్ల కాగితాల నోట్ బుక్ ఇచ్చారు.దాని మొదటి పేజీలో ఈ విధంగా వ్రాసి ఉంది.
             భలే   కథలు
                   రచన
                   సునీల్
దానిని చూసి సునీల్ ఆశ్చర్య పోయాడు! 
     "చూడు బోలెడు కథలు చదివావు,నీవు కూడా ఆలోచించు,నీ బుర్రలో మంచి కథలు పుట్టుకొస్తాయి" అని నవ్వుతూ చెప్పారు సునీల్ నాన్న.
        నాన్న మాటలతో సునీల్ కి తను కథలు వ్రాయగలననే నమ్మకం ఏర్పడింది. రెండురోజుల తరువాత నాన్నగారు ఓ డ్రాయింగ్ పుస్తకం పెన్సిల్,రబ్బరు,వాటర్ కలరు బాక్సు,బ్రష్ లు తెచ్చి ఇచ్చి బొమ్మలు వేయడానికి ప్రయత్నించు"అని చెప్పారు. సునీల్ కథల పుస్తకాల్లోని బొమ్మలు చూసి వేయసాగాడు.ఐదు బొమ్మల తరువాత ఆరో బొమ్మ  చూడటానికి బాగా వచ్చింది!
         తను వ్రాసిన కథలు, బొమ్మ చూసేసరికి సునీల్ కి ఎంతో ఆనందం వేసింది.సునీల్ సృజనాత్మకత చూసి అమ్మా,నాన్న ఆశ్చర్యపోయారు! కరోనా శెలవులు ఆ విధంగా సద్వినియోగం కావడం వారికి ఎంతో తృప్తినిచ్చింది.
         సునీల్ ఎంతో సంతోషంతో  తన క్లాస్ మేట్స్  గోపాల్,సమీర్ కి ఫోన్ చేసి తన బొమ్మలు,కథలు చూపించడానికి పిలిచాడు.ఓ గంట లోనే ఇద్దరూ సానిటైజ్ చేసుకుని ,మాస్క్ కట్టుకుని వచ్చారు. ఇద్దరికీ ఆనందంతో తను వేసిన బొమ్మలు,కథలు చూపించాడు.
         సునీల్ కళాత్మక పనులు వారిని కూడా ప్రభావితం చేశాయి.
           "సునీల్,నీ కథలు,బమ్మలు భలే ఉన్నాయి,ఏది ఏమైనా నీవు గ్రేట్"అని పొగిడారు.
        "నేనేం గ్రేట్ కాదురా,ప్రయత్నిస్తే మీరు కూడా బొమ్మలు వేయగలరు,బాగా ఆలోచిస్తే  కథలు వ్రాయగలరు,కాకపోతే కథలు చదవాలి,కథలు వ్రాసే వారు ఏ విధంగా వ్రాశారో తెలుస్తుంది. బొమ్మలు కూడా బాగా గమనించి కాపీ చెయ్యాలి,తరువాత మీరే వెయ్యగలరు." అని చెప్పాడు సునీల్.
        ఆ మాటలు సునీల్ అమ్మ,నాన్న కూడా విని  సునీల్ అవగాహనకు ఆశ్చర్యపోయారు. చాలా సేపు గోపాల్,సమీర్ సునీల్ ఇంట్లో గంట గడిపారు.సునీల్ అమ్మ వాళ్ళకి వేరుశనగ,గోధుమ పిండితో మంచి బలవర్థక స్నాక్స్ పెట్టింది.ముగ్గురూ అవి తిన్నారు.
      సునీల్కి టాటా చెప్పి ఇళ్ళకు వెళ్ళికథలు చదవటం,బొమ్మలు వేయడానికి ప్రయత్నం చేయడం వంటివి చేశారు.వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారి ఆసక్తిని గమనించి కొన్ని కథలపుస్తకాల్ని ఆన్ లైన్ లో తెప్పించారు.
       సమీర్ వాళ్ళమ్మ కు వైర్లతో బొమ్మలు,బుట్టలు చేయడం వచ్చు.సమీర్ కి ఆమె చిన్న బొమ్మలు, చిన్న బుట్టలు చేయడం నేర్పించసాగింది.సమీర్ ఎంతో ఆసక్తి తో నేర్చుకోసాగాడు.
          మరికొద్ది రోజులకు సునీల్ పదిహేను బొమ్మలు వేశాడు,నాలుగు కథలు వ్రాశాడు.
          సునీల్ నాన్న గారు ఆ బొమ్మలన్నింటికీ తనే చక్కగా బ్లాక్ కార్డు బోర్డు తో ఫ్రేములు చేసి ముందర గది(డ్రాయింగ్ రూమ్) లో చక్కగా తగిలించారు.
      సునీల్ వాళ్ళనాన్న స్నేహితులు వచ్చి అవి చూసి సునీల్ ప్రతిభను మెచ్చుకున్నారు.వారు కూడా వారి పిల్లలను కళల్లో ప్రోత్సహించాలనుకున్నారు.
     గోపాల్,సమీరే కాకుండా  మరికొంత మంది మిత్రులు వచ్చి బొమ్మలు,కథలు చూసి ఎంతో ప్రభావితమయ్యారు!
         దీపావళికి సునీల్ వాళ్ళ డ్రాయింగ్ రూమ్ సునీల్ పెయింటింగ్సతో మరింత శోభ సంతరించుకుంది.
           అభ్యాసంతో,కృషితో,తపనతో కళను అభివృద్ది చేసుకోవచ్చు.సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు!
         మరి మీరు కూడా మీ అభిరుచుల్ని వృద్ది చేసుకోడానికి కృషిచేస్తారుకదూ!


కామెంట్‌లు