కనువిప్పు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 నా ఫ్రెండు గృహప్రవేశం ఉంటే  ఆ రోజు నేను కుటుంబంతో ముంబాయికి వెళ్ళాను.ఎక్కడ కర్నూలు ఎక్కడ ముంబాయి? నాకు ముంబాయి కొత్త.
       మరి ముంబయిలో సెటిల్ అయి ఇల్లు కట్టుకున్నది నా బాల్య మిత్రుడు భాస్కర్.వెళ్ళక తప్పలేదు.
         సరే అడ్రసు పట్టుకుని ముంబాయి వెళ్ళాము.వాడి ఇల్లు అంధేరి ఈస్ట్ లో ఓ సందులో ఉంది.వాడు ఫోనులో వాడు కొన్ని కొండ గుర్తులు చెప్పాడు.
వాడు గృహ ప్రవేశ పనుల్లో మునిగి స్టేషన్ కి రాలేక పోయాడు.
       నాకా సరిగ్గా హిందీరాదు,ఎట్లో రైల్వే స్టేషన్ లో దిగాక ఇంగ్లీషులో ఒకరిని అడిగి టాక్సీ వివరాలు తీసుకుని బయటకు వచ్చి టాక్సీ మాట్లాడుకుని టాక్సీ ఎక్కాము.ముందుగానే టాక్సీ డ్రైవర్ సర్దార్జీకి అడ్రసు వివరాలు చెప్పాను, అందరం కూర్చున్నాక  టాక్సీ నడప సాగాడు, సర్దార్జీ హిందీలో ఏదో చెబుతున్నాడు నాకు అర్థం కాలేదు! అయినా నేను ఇంగ్లీషులో ఏవో చెప్పాను.
      ఎట్టకేలకు టాక్సీ అంధేరీ ఈస్ట్ కు చేరింది.కొండగుర్తులు చెప్పాను.సర్దార్జీ "అచ్చా" అంటూ నేను చెప్పిన కొండగుర్తుల దగ్గరికి తీసుకవెళ్ళాడు.చిత్రంగా గుర్తులైతే ఉన్నాయి గానీ వాడి ఇల్లు మటుకు కనబడలేదు!
       ఇక లాభంలేదని అటుగా వస్తున్న ఓ ఎడ్యుకేటెడ్ శాల్తీకి ఇంగ్లీషులో చెప్పాను.
     అతనో చిరునవ్వు నవ్వి సర్దార్జీతో స్వచ్చమైన హిందీలో ఏదో చెప్పాడు.
       "అచ్చా బాయ్ సాబ్" అంటూ టాక్సీని మరలా వెనక్కు తిప్పి ఓ అర కిలో మీటరు వెళ్ళి మా భాస్కర్ కొత్త ఇంటికి చేర్చాడు.అసలైన కొండ గుర్తులు అక్కడ ఉన్నాయి.
      ఇతను తప్పక మీటరు మీద కనీసం వంద అడుగుతాడు అనుకున్నాను. కానీ సర్దార్ జీ మీటరు మీదకంటే  తక్కువ ఇవ్వమన్నాడు నేను ఆశ్చర్యపోయాను.ఈ లోపల మా భాస్కర్ కొడుకు టాక్సీ వద్దకు వచ్చాడు.
      "ఇదేమిటి తక్కువ డబ్బు తీసుకుంటున్నాడు?" అని వాడిని అడిగాను ఆ సర్దార్జీతో వాడు హిందీలో ఏదో మాట్లాడాడు.
       "నేను చెబుతాను అతను అడిగినంతే ఇవ్వండి,పరవాలేదు" చెప్పాడు.
      ఇంట్లోకి వెళ్ళాక భాస్కర్ కొడుకు చెప్పాడు.
    "అంకుల్, మీకు కరెక్టు అడ్రసుతెలియదు కదా,తనే మిమ్మల్ని తిప్పానని,అది గాక అంత దూరంఆంధ్రా నుండి వచ్చిన వారి దగ్గర తీసుకోలేనని మంచిగా చెప్పాడు" వివరించాడు భాస్కర్ కొడుకు.
       ఇంకా ఈ భూమి మీద మంచి మిగిలి ఉందనిపించింది.ఎందుకంటే చాలా చోట్ల ఆటో,టాక్సీ వాళ్ళు మీటరు మీద ఎక్స్ ట్రా అడగటం చూస్తుంటాము,అంతెందుకు మా ఆఫీసులో రూల్స్ ప్రకారం చేసిన పనికి ఇంకా అదనపు డబ్బు అడగటం పరిపాటి!ఇవన్నీ తలచుకుంటే ఆ సర్దార్జీ మంచిని నింపుకున్న మహోన్నతుడుగా కనుపించాడు.మరొకటి కూడా అవగాహనకు వచ్చింది హిందీ బాగా నేర్చుకోవాలి లేకపోతే పక్కనున్న హైదరాబాద్లో కూడా ఒక్కొక్కసారి కష్టాలు ఎదురవ్వవచ్చు.ఇప్పుడంటే ఫోన్ లో గూగుల్ జి పి ఎస్ వచ్చింది కాబట్టి భయంలేదు!
          

కామెంట్‌లు