"కమలా పాపకు బాగా నలతగా ఉన్నట్టుంది.ఇందాకటినుండి హుషారుగా లేదు మగతగా పడుకుని ఉంది, ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఎందుకైనా మంచిది దిష్టి తీసేయ్" చెప్పింది తాయారమ్మ కోడలికి.
"అలాగే అత్తయ్యా అంటూ వంటింట్లోకి వెళ్ళి ఎండు మిరప,ఉప్పు తెచ్చి పాప చుట్టూ తిప్పుతూ
"ఛీ దిష్టి,పో దిష్టి" అంటూ అందులో కాస్త ఉమ్మేసినట్టు చేసి బయటకు తీసుక వెళ్ళి రోడ్డు మధ్య లో పడేయసాగింది, అప్పుడే అటు వస్తున్న జయంతి కమల చేస్తున్న పని చూసి " ఏమటి కమలా పారబోస్తున్నావు?" అడిగింది.
"ఆ ఏంలేదు, పాపకు దిష్టి తగిలింది, పొద్దుటనుండి నలతగా ఉంది దానికి, అందుకే మా అత్తగారు దిష్టి తీసెయ్యమంటే తీసేసాను, తెచ్చి ఇక్కడ వేస్తున్నాను" చెప్పింది కమల.
"అంటే ఈ ఉప్పు, మిరపకాయల మీద ఎవరైనా అడుగు వేస్తే వాళ్ళకి దిష్టి చెరుపు తగులుతుందన్న మాట!" అన్నది జయంతి.
."ఏమో" అంది కమల.
"దిష్టి తీసినవి పడేయటంలో ఉద్దేశ్యం అదే, చూడు కమలా పాపకు దిష్టి తీస్తే తీశావు కానీ దానిని ఏ కుప్ప తొట్టిలోనో పారెయ్యలి అంతే, ఎందుకంటే మన వలన ఎవరికీ చెరుపు జరగకూడదు.నిజానికి ఒకరికి మేలు చేయకపోయినా ఏ విధంగానూ హాని చెయ్యకూడదు.ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అసలు ఈ దిష్టి తియ్యడం అనేది ఒక మూఢ నమ్మకం, ఎందుకంటే ఎవరూ చూపుతో హాని కలిగించేంత శక్తి కలిగి ఉండరు.అంతశక్తి ఉంటే సగం ప్రపంచం నాశనం అయి ఉండేది...ఒక్కసారి ఆలోచించు" అని చెప్పింది జయంతి.
జయంతి చెప్పిన మాటలకు కమల ఆలోచనలో పడిపోయింది.
రెండోరోజు కమల జయంతిని కలసి ఈ విధంగా చెప్పింది, " నీవు చెప్పింది బాగా ఆలోచించాను, దిష్టి అనేది ఒక మూఢ నమ్మకం, పాపకు బాగలేక పోతే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి,అంతేగానీ దిష్టి తీయడం వలన ప్రయోజనం ఉండదు...మాపాప పక్కింటి పిల్లలతో కలసి బాగా అల్లరి చేసింది అందుకే కాస్త నలతగా కనబడింది, ఇక మీదట దిష్టి తీయను,డాక్టర్ దగ్గరకు తీసుక వెళతాను,మా అత్తగారు దిష్టి తీయమన్నా దిష్టి తీసి ఎవ్వరూ నడవని చోట పారేస్తాను" చెప్పింది కమల.
కమలలో మారిన ఆలోచనను జయంతి ఎంతో మెచ్చుకుంది.
దిష్టి:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి