మహా తిమింగలం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   తిమింగలం(whale)చేప మోస్తరు ఉండే అతి పెద్ద జంతువు.నిజానికి తిమింగలం చేప జాతి కాదు,పాలిచ్చి పిల్లను పెంచే క్షీరదం! వీటి రక్తం వేడిగా ఉంటుంది.
         15మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద తిరిగే ఒక రకమైన జంతువులు సముద్ర జీవులను తింటూ పరిణామ క్రమంలో తిమింగలాలుగా మారాయని కొందరి శాస్త్రజ్ఞుల ఊహ.ఇవి భూమి మీద బ్రతకలేవు,సముద్రంలో అపారమైన ఆహారం,వాటికి సరిపోయే వాతావరణం ఉండటం వలన అవి అతి పెద్దవిగా ఎదిగాయి.
        నీలి తిమింగలం(Balaenoptera) సుమారు 30మీటర్లు ఎదుగుతుంది.  160 టన్నుల బరువు ఉంటుంది.ఇవి పుట్టినప్పటినుండి రమారమి పది సంవత్సరాలు ఎదుగుతూనే ఉంటాయి.నీలి తిమింగలం నాలుక మూడు మీటర్ల మందంతో ఒక ఏనుగ కంటే ఎక్కువ బరువు ఉంటుంది.దీని గుండె బరువు అర్థ టన్ను ఉండి ఎనిమిది టన్నుల రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది.భూమి మీద బతికిన అతి పెద్ద జంతువులు డైనోసర్స్ అనుకొంటాం,కానీ ఈ తిమింగలాలు డైనోసర్స్ కంటే చాలాపెద్దవి!దీని శరీర వేడికి కారణం 'బ్లబ్బర్' అనే కొవ్వు పదార్థం దీని శరీరంలో ఉండటమే.శరీరంలో వేడి బయటికి పోకుండా ఈ కొవ్వు కాపాడుతుంటుది.
      ఇవి కొన్ని వేల కిలో మీటర్లు ప్రయాణిస్తుంటాయి. దీని శరీర నిర్మాణం,శరీరం మీద జారుడుతనం ఇవి నీటిలో అతి వేగంగా ప్రయాణించేందుకు అనుకూలంగా ఉన్నాయి.ఇవి గంటకు సుమారు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.శరీరం పెద్దది కనుక తిమింగలం రోజుకు సుమారు నాలుగు వేల కిలోల ఆహారం తింటుంది!చిన్న చిన్న చేపల్ని నత్తగుల్లలు మొదలైన సముద్ర జీవుల్ని తింటాయి.ఈ ఆహారం చాలా తక్కువే!అదే కొందరు మనుషులు సంవత్సరానికి శరీర బరువుకు 15రెట్లు ఎక్కువ ఆహారం తింటారు.
        ఆడ తిమింగలం గర్భందాల్చి 11నెలలు మోసి ఒకే ఒక తిమింగలం పిల్లను కంటుంది.ఈ పిల్ల సుమారు 15సంవత్సరాలు తల్లిని అంటి పెట్టుకుని ఉంటుంది.ఏదైనా ఒక తిమింగలానికి దెబ్భ తగిలినా ఆనారోగ్యం సంభవించినా మిగతా తిమింగలాలు చుట్టూనిలచి దానిని కాపాడతాయి.ఆడ నీలి తిమింగలం రోజుకు సుమారు 500 లీ॥పాలను తన పిల్లకు పడుతుంది.నీలి తిమింగలం పిల్ల రోజుకు ఐదు సెంటీ మీటర్లు పెరుగుతుంది.గంటకు 3కిలోల బరువు పెరుగుతుంది!ఇవి పిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచుతాయి.
         నిజానికి తిమింగలాలు సాధు జంతువులు.ఇవి మనుషుల్ని కానీ పడవల్ని కానీ ప్రమాదాలకు గురి చేయవు.కానీ వీటికి హానిచేస్తే అవి తమ ప్రతాపాన్ని చూపుతాయి.వీటి అరుపుకూడా చాలా పెద్దదే,ఈ అరపులే తిమింగలాల మధ్య పలకరింపులు అని తిమింగలాల మీద అనేక పరిశోధనలు చేసిన జాక్వస్ అనే శాస్త్రజ్ఞుడు తన పుస్తకంలో వ్రాశాడు.
      వీటి చర్మం కోసం,కొవ్వుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేల తిమింగలాలు చంపబడుతున్నాయి. అన్ని దేశాలు తిమింగల వేటను నిషేదిస్తూ ఒక ఒక ప్రణాళిక తయారు చేశాయి.తిమింగలాల చర్మం,కొవ్వు మొదలైనవి అమ్మకం నేరం కింద పరిగణిస్తున్నాయి.సముద్ర కాలుష్యం కూడా వీటి సంఖ్యను తగ్గిస్తున్నది.
       అందుకే సముద్ర జలాలు కాలుష్యం కాకుండా చూడాలి.ముఖ్యంగా తిమింగలాలను వేటాడే వారిని ఖఠినంగా శిక్షించాలి.అప్పుడే ఈ అధ్బుత మహా సముద్ర జంతువు రక్షింపబడుతుంది.
       సృష్టి లో ఇది ఒక అధ్బుతం!

కామెంట్‌లు