కడకు గాలి, నీరు కలుషితంబు
వేల వెర్రి కలలు వేగంపు బతుకులు
కరుణ, ప్రేమ, దయలు కరవులయ్యె.
కామక్రోధ లోభము మద మత్సరములు
మోహములవె వైరులిహము నందు
వాని గెలువ గల్గు వాని కెదురు లేదు
పోరు జరుపవలయు వీరులైన.
తాటిచెట్టు ఎక్క తలదన్ను మరొకడు
ఘనత యైన కొలత హీనమగుచు
చిన్న దగును రేపు గిన్నీసు గ్రంథాన
పెద్ద తలచి ఎపుడు పెంచకహము.
బలము లేవి కలవు? బలహీనతలు ఏవి?
నీకు నీవె ఎంచి నిగ్గు తేల్చి
వాని పెంచుకొనుచు వీని త్రుంచుకొనుచు
సాగ, నీకు కలుగు సతత జయము.
భావికాలమందు తావి మిగులునట్టి
ఆశయంబు నెంచి అడుగు సాచ
అడ్డులెన్ని రాని, గడ్డు కాలము కాని
నీకు జయము కలుగు నిశ్ఛయంబు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి