శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు 94410 65414, peddissrgnt@gmail.com

కారణాలు లేక కల్లమాటలు బల్క
కలుగునేమి ఫలము కాంచుమయ్య
తరుగు నీకు విలువ ఇరుగు పొరుగునందు
లొల్లి కూత విలువ లోక మెరుగు.

సొగసు పెంచ తలచి సోకు జేసు కొనుచు
రంగు బాగ రాసి రాజుననుచు
తలచి తిరుగ వయసు తరుగ దొక్క
ఏడు కూడ నీకు ఎంచి చూడు.

చుట్ట, బీడి, జరద, ఘుట్క, నశ్యములును
పొగయాకు రూపె పోల్చి చూడ
నమల, పీల్చ, కాల్చ నాశమౌ దేహంబు
వాని జోలి కేగ వలదు, తగదు.

ఇన్ని పోలికలను ఎత్తి చూపితి నేను
పిరికితనము వదలి, పెంచుకొనుము
ధైర్య సాహసాలు, లే, లెమ్ము, వేవేగ
నీదు ఆశయమ్ము నిర్ణయించు.

చిర్రుబుర్రులాడి చీకాకు పడబోకు
నీదు కోపమెపుడు నీకె హాని
నీకు నచ్చనట్టి నిందలు, మాటల
నిగ్గుదేల్చ దలచ నడ్డి విరుగు.
కామెంట్‌లు