పేడాట ....!! >రచయిత--శీరంశెట్టి కాంతరావు >పాల్వంచ .

 మా ఇల్లు చెరువొడ్డున్నే వుండేది ఏడాదిలో ఆరునెల్ల పైనే విడవకుండా జాపాతం మాదిరి హ్హోరుమంటూ మత్తడి పోసేది కొత్తగా మాఇంటికొచ్చిన వాళ్ళకు ఆ అలుగు చప్పుడు ఐదునిమిషాల్లో పిచ్చెక్కించేది రేయింబవళ్ళు ఈ చప్పుడుకు ఇంట్లో ఎట్లుంటున్నారంటూ! వచ్చినపని చూసుకుని ఎమ్మటే ఎల్లిపొయ్యేవాళ్ళు అదే అలుగు  చెరువునీళ్ళు నిండు కోవడంతో ఆరునెల్లు కుంభకర్ణుడు మాదిరి నిశ్శబ్దంగా నిద్రపోయేది నీళ్ళు బిక్కి పోవడంతో చెరువు లోతట్టు మొత్తం గరికపుట్టి పచ్చటి దిబ్బ మాదిరిగా మారి పోయేది దాంతో ఊరి పశువు లన్నీ కట్టుగొయ్యల మీదినుంచి మందలు మందలుగా చెరువు లోకే నడిచేవి ఇక అక్కన్నుండి మాదోస్తులకు చేతినిండ పనుండేది గొడ్లమంద మా ఇండ్ల ముందుకు వచ్చిందంటే చాలు పేడ తట్టలు పట్టుకుని వాటి ముడ్డెనకే నడిచేది ఏ బర్రె తోకెత్తితే దాని దగ్గరకు ఉరికి పేడ తట్ట పట్టేది అప్పుడప్పుడు ఒకేసారి ఐదారు బర్లు పేడవేస్తున్న సన్నివేశం తటస్తపడితే చేతుల్లోని తట్టల్ని పక్కన పారేసి ఒక్కొక్కలం ఒలంపిక్ ఆటల్లో హుస్సేనీ బోల్ట్ మాదిరిగా పరుగులు తీస్తూ పేడ కళ్ళను కాలితో పక్కకు తోసి ఇంకో బర్రె దగ్గరికి ఉరికేది అట్లాంటి సందర్భంలో పేడవేసే వాళ్ళందరం రచించని న్యాయ సూత్రాన్ని ఆచరించేది ఒకడు కాలుదోసిన పేడ కడిని మూడురోజులైనా ఇంకొకడు ముట్టుకునే వాడు కాదు కాలుదోసినోళ్ళు నింపాదిగా వచ్చి ఆ కళ్ళను ఎత్తుకొని పోయేది ఇక ఎండాకాలం మొత్తం చెరువులోనే వుండి పశువులెమ్మటి తిరుగుతూ పేడపోగుజేసి కుప్పలేసేవాళ్ళం మధ్య మధ్యలో కొంతసేపు పచ్చగడ్డిలో కూర్చుని పేడాట ఆడేవాళ్ళం పేడతో ఆటేమిటి అంటారా!? అక్కడే వుంది అసలు మజా.. నలుగురం ఒకదగ్గరచేరి పక్కన మూల ధనం మాదిరి ఇంత పేడ ముద్దను పక్కన పెట్టుకుని గుండ్రంగా కూర్చునేది ఇక అప్పుడు ఎవరి కుప్పలో నుండి వాళ్ళు తాటిముంజంత పేడ తీసుకుని దాన్ని కూరగిన్నెల మాదిరి తయారు చేసుకునేది అట్లా చేయడం అయ్యింది అనుకున్న తరువాత  ఒకేసారి ఆగిన్నేల్ని అర చేతుల్లోకి తీసుకుని వాటిని తిరగేసి నేలకు కొట్టేది దాంతో గిన్నె అడుగు చిట్లిపోయి బొక్కలు పడేవి ఎవరి బొక్క పెద్దగా పడితే వాడు గెల్చినట్టు లెక్క దాంతో మిగిలిన ముగ్గురూ ఒకరి వెనుక ఒకరు తమ మూలధనంలో నుండి ఇంత పేడతీసి లడ్డూ మాదిరిగా చేసి ఆ రంధ్రం నిండా పెట్టేది 
ఆ లడ్డూలు గెలిసినోడి మూలధనంలో చేరిపోయేవి  
ఆ ఆట ఎంతసేపు ఆడినా పేకాట మాదిరి విసుగొచ్చేదే కాదు ఇక తొలకరి మొదలు అవ్వడంతోనే మేం పోగేసిన పేడకుప్పల్ని ఎడ్ల బండ్ల మీద పొలాలకు తోలేది స్వంత పొలాలు లేనివాళ్ళు బండి జల్ల కింతని అమ్మి ఆడబ్బుల్తో పైతరగతికి కొత్త పుస్తకాలు బట్టలు కొనుక్కునేది
మన్నున కలిసిన పేడ మంచి ఎరువుగా మారి మనుషులకు అన్నం పెట్టేది ఇంత గొప్పదైన గ్రామీణ జీవితంతో ఇప్పటి తరానికి అసలు పరిచయమే లేకపోవడం అసలు విషాదం.

కామెంట్‌లు