ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం


 మొన్ననే ఊరు పోయచ్చిన
మూడేండ్ల కిందట ఉన్న
మా ఊరు సెట్టు
పండుటాకులెన్నో 
రాలి పోయినయ్
అచ్చే ఏడుపును 
బల్మీటికి ఆపుకున్నా.
ఉన్నప్పుడు తెల్వదు;
పోయినప్పుడే మనుషుల ఇలువ తెలుత్తది.
ఇగ గా పాడు కరోనా గుడ
శానా మంది సోపతి గాల్లను
కొంట వోయింది.
నేను పుట్టి, పెరిగిన న్యాల,
నేను ఆడుకున్న,
సదువుకున్న జాగను 
కండ్ల నిండ జూసుకున్న.
అన్మశ్పటకు వొయి
తెలుగు సెప్పిన 
లక్ష్మయ్య సారును కులుసుకున్న.
సదువుకున్నప్పుడు
గా సారంటే 
బగ్గ బయమయ్యేది.
సారు ముందు 
నిలుసోవాలన్నా,
మాట్లాడాలన్నా
ఉచ్చ వడేది.
కానీ గిప్పుడు
దైర్నం జేసి
గా సారు ముందే
నేను రాసిన కైతలు,
పాటలు ఇనిపిచ్చిన.
సారు శానా సంబుర పడ్డడు.
నేను దండం బెట్టి 
సారు దేవెనార్తులు దీసుకున్నా
పపంచ తెలుగు మహా సబల
గుడ కైత సదివిన్నని సెప్పంగనే సారు నన్ను 
శానా మెచ్చుకున్నడు
నవ్విన నాప సేనే పండుడంటే
గిదే కావచ్చునుల్లా!
బతుకుడు 
ఎట్ల నన్నా బతుకచ్చు గాని
మనకు ఇట్టం అచ్చినట్టు,
నలుగురు మెచ్చేటట్టు బతుకుట్లనే మనిషి బతుకు
బతుకన్నట్టు!
ఔ మల్ల! 

కామెంట్‌లు