తాజా గజల్ :---ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు

తోటలోని పూలేమో తొందరగా పూసినవే 
బాటలోని హృదయాలకు విందులుగా పూసినవే 

కంచెపక్క కమనీయము కస్తూరివి పరిమళాలు 
ఇంచుక సమయం లోనే వింతలుగా పూసినవే 

పులుగులకే వెలుగులయ్యి రేరాణిది మహాఠీవి 
చివరిఘడియ అందాలను వివిధముగా  పూసినవే 

కవనకిరణ మొకటేదో కలం లోను కవితలయ్యె 
కాంతినిచ్చు సూర్యకాంత సుమములుగా పూసినవే 

పచ్చని ఆకుల సందడి వనమంతా పరుచుకుంది 
వెచ్చని ఊహల మొగ్గలు వేడుకగా పూసినవే 

ఉషోదయం ఉల్లాసపు కావ్యగాన స్మృతిఇదే 
భావకవిత్వం పోకడ రేకులుగా పూసినవే 

వేదనలేనిది మధురం వేకువ పసినవ్వు ఉమా 
లాలిత్యపు పదములన్ని కుప్పలుగా పూసినవే !!


కామెంట్‌లు
శుభోదయం మేడంగారు.. సరళమైన పదాలతో చక్కని గజల్ కవితను వ్రాశారు.. గజల్ కవితా నిబంధనలు నాకు తెలియవు.. పూసినవి అని పదే పదే పద ప్రయోగం చేసే బదులు విరిసినవి..సుమించినవి.. కుసుమించినవి లాంటి పదాలను కూడా వాడిఉంటే ఇంకా అందంగా ఉండదేమో అని అనిపించింది..ఈ ఉషోదయాన మీ ప్రశాంతమైన కవితను చదివే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది.. ధన్యవాదాలు మేడంగారు!!