నీడలతో క్రీడిస్తూ
నిజంతో సహజీవిస్తున్నాననుకొని,
భ్రమల సాలెగూటిలో
బంధాల పాశమల్లుతూ ఎడతెగక.
తలుపుకవతల ఏవో పిలుపులు..
నన్నేనని నమ్మి
ఆత్రంగా పరిగెడతా గదికడ్డంగా.
వీధి గుమ్మం ముందర తచ్చాడుతున్న
నిరూపమైన దేహపు అలికిడి
స్పృశించే విఫలయత్నంలో
తడబడి..
శూన్యపు సౌధాలలో
నీ పిలుపుల ప్రకంపనలను
అలసిన నా శరీర కంపనలతో కలిపి
అభావపు చిరునవ్వునై..
పొడిపెదవులపై నిర్జీవంగా వేలాడుతూ.
దేహపు సడి వెచ్చగా చేతికంటదు.
మాటల తడి మనసుకు చిక్కదు
ఆలోచనా స్వేచ్చాలోకపు ఆకారాలతో
నిజ జీవిత చెరసాలల్లో సంభాషిస్తూ..,
వసారాలో..కిటికీ మూలల్లో
పడక గదిలో నీళ్ళగదిలో..
వెతుకులాటలు.
చిరుచినుకుల సవ్వళ్ళకు
విప్పారి విరబూసే మరిన్నిమనసుల ఉనికికై
రెపరెపల బ్రతుకులాటలు.
ఇల్లంతా ఒంటరితనపు వాసన.
దండాలపై వేలాడుతున్న ఏకాకితనపు వస్త్రాలు.
ఎండిపోయిన పూలన్నీ
ఒక్కొక్కటిగా రాలిపోతూ
ఎగతాళిగా నవ్వుతుంటే
చివుక్కుమన్న మనసుతో
చిన్నబుచ్చుకున్న మోము..
పూబాలల సౌరభాల్ని ఒడిసిపట్టి
గుదిగుచ్చిన దారపుపోగు.
నల్లని కనుపాపల్లో
విచ్చిల్లిన ఆపేక్షకెరటం.
చెమ్మగిలిన కనుల గడపదాటి
చెప్పరాని గుబుళ్ళ దోవన
అడియాసలైన నిన్నటి ఆశల పరావర్తనం.
దారిపోడవునా తోడొస్తున్న తెలియని సాన్నిహిత్యపు స్పర్శ.
నామకరణం చెయ్యను.
ఎవరివినీవనీ అడగను.
ఎందాకా వచ్చినా
నవ్వుతూ నేస్తం కడతాను.
గమనమే గమ్యం.
ఆసాంతం కలిసొస్తావనే
చిగురాశే..
సుదూరపయనానికి మనసైన ఇంధనం.
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి