కమలాదేవి కమనీయ సంగతులు!!:-- యామిజాల జగదీశ్
 కమలాదేవిగారిపై ఈ మాటలు రాసేం
దుకు దారి చూపిన ఆలిండియా రేడియో (మద్రాసు) అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న లలితగారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా....


గురుపూజోత్సవం పురస్కరించుకుని
మా సైన్స్ మాష్టారు రామచంద్ర శాస్త్రిగారి గురించి రాయాలనుకున్న సందర్భంలో మాష్టరుగారి తండ్రిగారైన కీ.శే. కోరాడ రామకృష్ణయ్యగారికి వరుసకు మనవరాలైన లలితగారితో మాట్లాడాను. ఇంతకూ మీకెలా బంధువీలని అడగ్గా
చుట్టరికాలన్నీ చెప్పిన లలితగారు రామకృష్ణయ్య గారి కుమార్తె కమలాదేవిగారు తణుకులో ఉన్నారని, ఆవిడతోనూ ఓమారు మాట్లాడండి అంటూ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు.


ఇంకేముంది అదేరోజు రాత్రి కమలాదేవిగారికి ఫోన్ చేసి నేను ఫలానా అంటూ సూర్యనారాయణ క్లాస్ మేట్ నని చెప్పుకుని మాటలు కొనసాగించాను. 


అప్పుడావిడ తమ గురించి చెప్పుకొచ్చారు. ఈ కమలాదేవిగారెవరో కాదు, మా మాష్టారైన కోరాడ రామచంద్ర శాస్త్రిగారికి రెండో చెల్లెలు. కమలాదేవిగారి మావగారింటి పేరు భమిడి. గోదావరి జిల్లావారు. 


మద్రాసులోని లేడీ వెలింగ్టన్ స్కూల్లో చదువుకున్న కమలాదేవిగారు తమ అన్నయ్యగారైన మా మాష్టారుని గురువుగారిని నమస్కరించుకుంటూ కొన్ని సంగతులు చెప్పారు.


మర్యాద, అభిమానం, స్నేహం, ఉపకారం పుష్కలంగా ఉన్న ఆనాటి రోజులవి. 1927లో విజయనగరం నుండి వెళ్లి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చేరిన తమ నాన్నగారు శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారిని ఎందరో వచ్చి కలిసిపోతుండేవారన్నారావిడ.
ఆరోజుల్లో వారి అమ్మ చేతి వంట తిన్నవాళ్ళెందరో....

మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి వచ్చిన శ్రీ మాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల గారు వీరింట్లోనే అద్దెకు దిగారు. ఆయన శ్రీమతి గారికి కమలాదేవిగారంటే ఎంతో ముద్దు. 
పూలజడలు వేసి రంగు రంగు రిబ్బన్లతో రెండు జడలు వేస్తుండేవారు. 


ఈవిడ చదివే ముకుంద మాల శ్లోకాలంటే అప్పలాచార్య దంపతులకెంతో ఇష్టం. తర్వాతి కాలంలో… కమలాదేవిగారు పెళ్ళై తణుకులో సుందరకాండ ప్రవచనానికి వచ్చినప్పుడు ఆమెను గుర్తు పట్టి చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకున్నారట అప్పలాచార్య దంపతులు.సంగీతం నేర్చుకున్న ఈవిడ వారి కోరిక పై ముకుందమాల శ్లోకాలు రాగయుక్తంగా పాడితే, ఎంతో ఆనందించి ” ఈ ముకుందనామం ఈనాటి సమాజానికి ఎంతైనా అవసరం. సమాజానికి ఎంతైనా మేలుచేయగలదు. నువ్వు రాగయుక్తంగా పాడి కాసెట్  చెయ్యరాదూ?" అంటూ ప్రేమపూర్వకంగా ఆదేశించారు. 


అంతే! వారం రోజుల్లో 40 శ్లోకాలకూ తాను రాగాలు కూర్చి, వ్యాఖ్యానంతో సహా పాడి కాసెట్ చెయ్యగలిగానంటే అది వారు తమకందించిన సంకల్పబలమే అంటారు కమలాదేవిగారు. వారి తిరుహస్తాలతో ఆవిష్కరించబడిన ఈ కాసెట్ / సి.డి.లు ఇటు ఆంధ్రదేశంలోనూ, అటు అమెరికాలోనూ ఎందరో విజ్ఞులైన పెద్దల మెప్పుపొందింది.

శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారూ వీరి నాన్నగారూ తరుచూ కలుసుకుని చాలా సేపు చర్చించుకునేవారు. వెళ్ళేముందు శర్మగారు ఈవిడను పిలిచి "ఏం పాడుతున్నావ్? బాలరామాయణం ఎందాకా వచ్చిందీ...." వంటివి అడుగుతుండేవారు. 


ఆవిడకు "వేంకటేశ్వర సుప్రభాతం రాగయుక్తంగా పాడటం నేర్పించింది రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారేనట. వాటిని ఆర్తితో పాడే విధానంకూడా వారే నేర్పారట. తర్వాతి కాలంలో ఏ శ్లోకాన్నైనా, పద్యాన్నైనా భావంతో, రాగయుక్తంగా పాడటానికి ఆయన ఆరోజుల్లో నేర్పిన విధానమే ఎంతగానో తోడ్పడిందంటారు కమలాదేవిగారు.

బారిస్టర్ పార్వతీశం పుస్తకం అంటే ఆవిడకు బోలెడంత ఇష్టం. 
ఓరోజు బారిస్టర్ పార్వతీశం రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రిగారు తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం పొందిన విషయం చిరస్మరణీయమని అన్నారావిడ. 


ఇక తమ అన్నయ్యగారైన రామచంద్ర శాస్త్రి గారి (అంటే మా మాష్టారుగారు) గురించి కమలాదేవి గారి మాటల్లోనే చూద్దాం....


"నన్ను తీర్చి దిద్దిన గురువు మా అన్నయ్య. నా ధైర్యానికి మార్గదర్శకుడు. దాదాపు ముప్పై సంవత్సరాలపాటు మద్రాసు టీ. నగర్లోని రామకృష్ణామిషన్ హైస్కూల్లో సైన్స్ అసిస్టెంట్ గా పని చేసిన ఉత్తమ పాధ్యాయుడు అన్నయ్య శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి. ఆ రోజుల్లో ఉత్తమ ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండేవారు. లేదా ఉపాధ్యాయులెప్పుడూ ఉత్తములుగా ఉండేవారు. వారికి ఈ రోజుల్లోలా అప్పట్లో ఆ బిరుదు (అవార్డు) లిచ్చేవారు కాదు. పిల్లల ఉన్నతే లారికి లభించిన అవార్డు. వారి హృదయాలలో మా మాష్టారుగా నిల్చిపోవడమే వారికి బిరుదు.

104 వసంతాలు చూసిన మాష్టారు నాకు 4, 5, 6 ఫార్మ్స్ లో (హైస్కూలు) మాష్టారు. ఎలాగంటే ఉదయం 7 గంటల నుండి 9 వరకు ఇంట్లో ప్రైవేట్ పిల్లలు వచ్చేవారు. సైన్సు ఇంగ్లీషు పూర్తిగానూ, తక్కిన సబ్జెక్టులు అప్పుడపుపుడూ చెప్పే అన్నయ్య బోధనా రీతి చాలా ప్రత్యేకమైనది. నేనూ నా క్లాసుపిల్లల టైములో వాళ్ళతో  పాటు వెళ్ళి కూర్చునే దాన్ని.

ఇంగ్లీషులో వ్యాసాలు రాయడం, ఇచ్చిన వ్యాసాన్ని క్లుప్తీకరించడం, ఒక్కసారి అన్నయ్య దగ్గర నేర్చుకుంటే చాలు. ఇక్కడ అన్నయ్య మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇచ్చిన ప్యాసేజ్ ని ఒకటికి నాలుగు సార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవడంలోనే ఉందంతా... ఈ విషయం ఇంగ్లీషులో ఉన్న దాన్ని తెలుగులో అర్థం చేసుకోవాలి. విషయం అర్థమయ్యాక సందర్భం చూసుకుంటూ అనవసరం అనిపించిన వాక్యాలు తీసి, అన్వయం కుదిరిన వాక్యాలకి మన సొంత వాక్యాలు ఒకటి రెండు కలిపి వాక్యం పూర్తి చేయాలి... అన్నయ్య చెప్పినట్లే ఫాలో అయిన మాకు పూర్తి మార్కులు పడేవి పరీక్షలో... అర్థం చేసుకోలేరు అనిపించిన వాళ్ళకు వేరుగా కొన్ని కొండ గుర్తులు చెప్పేవాడు. ఆ గుర్తులు కొండంత అండగా ఉండేవి పరీక్షల్లో. పాఠ్యపుస్తకాలు ఎలా చదవాలి, చదువుకున్న విషయాన్ని పేజీనీ ఎలా కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో మెదిలేలా చేసుకోవాలో, ఆ పేజీలో విషయాన్ని మాష్టారు చెప్పిన అర్థాన్ని ఎలా అన్వయించుకుంటూ (అనుసంధానిం చుకుని) భావించాలో ...అబ్బో ఎన్ని టెక్నిక్కులో....

 అన్నయ్య ఇచ్చిన మానసిక శిక్షణ (సందర్భానుసారం) తోనే నా జీవితంలో భయం, పిరికితనం వంటివి లేకుండా పోయాయి. అలాగే నాన్నగారు అందించిన భగవద్గీత కూడా ఓ కారణమే. ధన్యోస్మి.
ఆ రోజుల్లో మరీ అంత భయాలు ఉండేవి కావు. కానీ, ఎగ్జిబిషన్ కెళ్ళినప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలూ కొండొకచో పెద్దవాళ్ళూనూ తప్పిపోయే అవకాశముండేది. అందుకని (ఫిఫ్త్ క్లాసులో) ఇంటి అడ్రెస్సు, నాన్నగారిపేరూ ఎవరేనా అడిగితే ఎలా చెప్పాలో నేర్పాడు.
ఒకసారి సెంట్రల్ స్టేషన్లో ఇద్దరం నడుస్తున్నాం. అంతట్లో అన్నయ్య కనబడలేదు. భయంతో ఏడుస్తుంటే ఓ పోలీసు చూసి అడిగితే ఇంటి అడ్రెస్సు, పేరూ చెప్పాను. కాస్సేపు చూసి బస్సులో తీసుకెళ్తానని స్టేషన్ బైటకి రాబోతుంటే అప్పుడు కనబడ్డాడు మా అన్నయ్య. 'ఈ పాప చక్కగా అడ్రెస్ చెప్పింది.... ఏమైపోయారు సార్ ' అని పోలీసు చెప్పగా అన్నయ్య నన్ను అనునయించి అలా ధైర్యంగా ఉండాలి అంటూ నా భుజం తట్టారు. ఎప్పటికీ ఇలాగే అన్నయ్య మెచ్చుకునేలా ఉండాలి అనుకున్న నాటి సంగతి ఇప్పటికీ  గుర్తే. ఏ పనైనా చెయ్యడానికి ధైర్యం అవలంబించాల్సి వచ్చినప్పుడు అన్నయ్య తట్టిన భుజం (స్పర్శ) ధైర్యానని ఇస్తుంది. ఇలాటి స్ఫూర్తులు ఎన్నో. మా పెద్దన్నయ్య వల్ల... కోరాడ రామచంద్ర శాస్త్రి గురుపూజోత్సవం వేళ గురువైన అన్నయ్యకి నా పాదాభివందనాలు...." 
మద్రాసులో విద్యాభ్యాసం చేసిన కమలాదేవిగారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక సంగీతంలో డిప్లొమా పొందారు.
నలబై సంవత్సరాల సంగీత బోధనానుభవంతో రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల (తణుకు) ప్రిన్సిపాలుగా ఉన్న కమలాదేవిగారు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ కి కార్యదర్శికూడా.

భక్తితత్వం – ముకుందమాల, నాదయోగ వైభవం – వాగ్గేయ కార సమారోహం, శివానందల హరి – సరళ వ్యాఖ్యానం, పాలంగి కథలు వంటి పుస్తకాలు రాసిన కమలాదేవిగారు రాసిన వ్యాసాలనేకం సంగీత సాహిత్య ఆధ్యాత్మిక మాసపత్రికలలో ముద్రితమయ్యాయి.
అందరూ స్త్రీలే పాత్రధారులుగా తాను రాసిన నాద యోగ వైభవం – సంగీత నృత్య రూపకానికి దేశ రాజధాని ఢిల్లీతో సహా విశాఖ మొదలైన అనేక పట్టాణాలలో ప్రదర్శింపబడి విశేష ఆదరణ పొందింద న్నారామె. 
చివరగా ఒక్క విషయంతో ఇది ముగిస్తాను...
కమలాదేవిగారి చిన్నతనంలో మద్రాసులో ఉండటం వల్ల ఎంతసేపూ సాంబార్ వంటి అరవాళ్ళ వంటలేనా తినడం? ఆంధ్రదేశంలో బెల్లం పులుసు అవీ ఇవీ వండి తినమంటే అప్పుడు తెలుస్తుందే" అన్నారట ఆమె వదినగారు (మా మాష్టారుగారి భార్య). తీరా నిజంగానే పెళ్ళయి కమలాదేవిగారు కాపురానికి ఆంధ్రదేశానికి వెళ్ళిపోతుంటే "ఏదో మాట వరసకలా అన్నానే తప్ప ఆ మాటిలా జరుగుతుందను కోలేదే....దూరంగా వెళ్ళిపోతున్నావా?" అని బాధపడ్డారట వదినగారు. కామెంట్‌లు