గత ఆరున్నర సంవత్సరాల మిద్దెతోట కల్చర్ ప్రచారంలో, ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు నాకు సహాయ సహకారాలు చేస్తూ వస్తున్నారు.వారిని సత్కరించాలని అనుకున్నప్పుడు
అటువంటి సహృదయులు మనసులో మెదిలారు.వారిలో
తుమ్మూరి రామ్మోహనరావు గారు కూడా ఒకరు!
వారిని ఎందుకు సత్కరించుకోవలసి వచ్చిందీ అంటే!?
రామ్మోహనరావు గారిని , ఒకప్పుడు'కూతురు రాంరెడ్డి' గారు- కథారచయిత- మా నారపల్లెలోనే ఉంటారు- వారు పరిచయం చేశారు. మిద్దెతోట సందర్శనకు రామ్మోహనరావు గారిని తీసుకుని వచ్చారు.
అలా రామ్మోహనరావు గారు పరిచయం అయ్యారు.
కవిత్వం నాటకాలు వారి అభిరుచులు. సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగం చేశారు.
వారి స్వగ్రామం కరీంనగర్ దగ్గర 'ఎలగందల్ '
పురాతన రాజధాని నగరం. వెనకట మా గ్రామ కోమటి ఒకరు సంసారం వదిలేసి ఎలగందల్ మఠంలో కలిసాడు.
నా చిన్నప్పుడు విన్నాను అలా ఎలగందల్ పేరు.
రామ్మోహనరావు గారు కూడా ,సమీప పీర్జాదిగూడలోనే(హైదరాబాదు) ఉంటారు. రామ్మోహనరావు గారికి నాకు మధ్య , ఆదిలాబాద్ సామల సదాశివ గారి బంధం కూడా ఒకటి ఉంది.
మిద్దెతోట సందర్శనకు వచ్చి వెళ్లిన తర్వాత, రామ్మోహనరావు గారు మధ్య మధ్య ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. అలా మాట్లాడే క్రమంలో, వారు ఒక సూచన చేసారు. అదేమిటి అంటే?
నేను 2015 డిసెంబరు నెల నుండి మిద్దెతోట కల్చర్ ప్రచారాన్ని , ఫేస్ బుక్ వేదికగా ప్రారంభం చేసాను.
ప్రతీ రోజూ మిద్దెతోటలో ఏ పనైతే చేసేవాన్నో , క్రిందకు వచ్చి లైబ్రరీ రూమ్ లో కూర్చుని ' రూఫ్ గార్డెన్ పరిచయం' అని , సీరియల్ నంబర్ వేసి రాస్తూ ఉండేవాన్ని.
ఆ రూఫ్ గార్డెన్ అనే పదానికి బదులుగా 'మిద్దెతోట' అనే పదాన్ని వాడితే - అది అచ్చ తెలుగు పదమని- బాగుంటుందని సూచించారు. నిజమే అనిపించింది!
అప్పటికి 'మిద్దెతోట' అనే పదం తెలుగులో లేదు.
మిద్దె ఉంది- తోట ఉంది, కానీ, మిద్దెతోట లేదు!
అప్పటి నుండి 'మిద్దెతోట పరిచయం' పేరు వాడటం ప్రారంభించాను.
2017 డిసెంబరు నెలలో 'మిద్దెతోట' పుస్తక ప్రచురణ ఆవిష్కరణను 'రైతునేస్తం' వెంకటేశ్వరరావు గారు చేయించిన తరువాత, మిద్దెతోట పదం మరింత వ్యాప్తిలోకి వెళ్లింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మిద్దెతోట పదం విరివిగా వాడకంలో ఉంది. నాకు మిద్దెతోట పదబంధాన్ని సూచించిన రామ్మోహనరావు గారిని సత్కరించాలని అనిపించింది.
మిద్దెతోట కల్చర్ కు,నుదుట బొట్టు పెట్టిన మనిషి రామ్మోహనరావు గారు!
రామ్మోహనరావు గారి ఇంటికి నిన్న మధ్యాహ్నం వెళ్లాం.
నాతో పాటు 'మిద్దెతోట ఫౌండేషన్' కార్యదర్శి మిత్రుడు
చందుపట్ల జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు.
మా పద్దతి ప్రకారం, పోచంపల్లి'ఇక్కత్ ' డిజైన్ నూతన వస్త్రాలు, మిద్దెతోట ఫౌండేషన్ తరఫున కొత్తగా తయారు చేయించిన జ్ఞాపిక, మిద్దెతోట తెలుగు ఇంగ్లీషు పుస్తకాలను వారి చేతుల్లో ఉంచాం.వారు అభిమానంతో స్వీకరించారు.
వారికి ధన్యవాదాలు.
(ఫొటో తీసిన వారు చందుపట్ల జీవన్ రెడ్డి గారు)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి