కొన్ని ప్రథమ చికిత్సలు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  ఒక్కొక్కసారి మనకుగానీ,మనింట్లో వాళ్ళకు గానీ ఎవరికైనా వైద్యపరంగా కొన్ని సమయాల్లో అత్యవసర పరిస్థితి కలుగవచ్చు.
       అందుకే కొన్ని ప్రథమ చికిత్సలు తెలుసుకుని ఉండటం మంచిది.అలా వారి ప్రాణాలు కాపాడ గలుగుతాము.ఆయా పరిస్థితులు సంభవించినపుడు  మనం ఏంచేయాలో తెలుసుకుందాం.
      కుక్క కరచినపుడు:ఏ కుక్క కరచినా  వెంటనే శుభ్రమైన నీటిని గాయం పైనుండి పోస్తే కుక్క లాలాజలం పోతుంది.తరువాత అందుబాటులో ఉంటే కార్బాలిక్ సోపు లేక మామూలు సోపుతో గాయాన్ని కడగండి. పిచ్చి కుక్క ఏమో గమనించండి.
వెంటనే వైద్యుడి (ప్రభుత్వ వైద్యశాల) వద్దకు వెళ్ళి తగిన చికిత్స,సలహా పొందాలి.
     గుండెనొప్పి:ఎవరికైనా గుండెనొప్పి ముఖ్యంగా ఛాతీ మధ్యలో వచ్చి,ఊపిరి తీసుకోవడం కష్టమవుతే,నొప్పి ఎడమ భుజానికి పాకితే అది గుండెనొప్పి కావచ్చు(angina).వెంటనే రోగికి గాలి తగిలేటట్టు చేసి,సుమారు 45 డిగ్రీలలో ఆన్చి కూర్చోబెట్టాలి.సాధ్యమైనంత త్వరగా వైద్యుడి వద్దకు తీసుక వెళ్ళాలి.
       కాలిన గాయాలు:కొద్దిగా కాలితే కాలిన గాయం మీద చల్లని నీళ్ళు పోయండి.గాయాలపై సున్నితంగా బట్టలు తొలగించండి.మీకు అందుబాటులో ఉన్న ఆంటీ బయోటిక్ ఆయింట్ మెంట్(సోఫ్రామైసిన్,నియోస్పోరిన్,బర్నాల్ మొదలైనవి)జాగ్రత్తగా పూయండి.మరీ ఎక్కువ కాలితే చర్మాన్ని చిదప కూడదు.రోగిని జాగ్రత్తగా మంచి వైద్యశాలకు తీసుక వెళ్ళాలి.
విషం తాగితే: పురుగుల మందులు తాగితే ఆ డబ్బాల మీద ఆ విషానికి విరుగుడు చికిత్స వ్రాసి ఉంటుంది.అది చదివి ఏంచేయాలో అది చేయండి.ఒక వేళ ఆసుపత్రికి తీసుక వెళితే ఆడబ్బా కూడా తీసుక వెళ్ళండి.రోగి నోటి లోపల చెయ్యి పెట్టి వాంతి చేయించండి.ఒకవేళ ఆసిడ్ వంటివి తాగితే ఎక్కువ నీళ్ళు లేక పాలు ఇవ్వండి.విషం పలుచబడుతుంది.
    కత్తిగాయాలు లేక రక్తపు గాయాలు:రక్తాన్ని చూసి భయపడవద్దు.రోగికి ధైర్యం చెప్పిగాయం పై కట్టు కట్టండి.చల్లని నీటితో తడిపిన గుడ్డతో గాయాన్ని సుతారంగా తుడవండి.గాయం పెద్దదైతే గాయాన్ని శుభ్రమైన గుడ్డతో కప్పి అత్యవసర విభాగం ఉన్న ఆసుపత్రికి తీసుక వెళ్ళండి.
       నీటి మునక: నీటిలో మునిగి నీటిని మ్రింగిన వ్యక్తిని శుభ్రమైన నేల మీద పడుకోబెట్టి అతనికి నోటిద్వారా కృత్రిమ శ్వాస అందించడానికి ప్రయత్నించండి.అంతేకానీ అతడు లేక ఆమె మింగిన నీటిని తీయడానికి ప్రయత్నించవద్దని డాక్టర్లు చెబుతున్నారు.
     గొంతులో ఏదైనా అడ్డుపడినప్పుడు:అతడు మాట్లాడగలడేమో చూడండి.మాట్లాడితే దగ్గు దగ్గి అడ్డు పడిన దాన్ని తొలగించుకోగలడు,లేకపోతే  అతని వీపు మీద మెల్లగా కొట్టాలి.ఎట్టి పరిస్థితుల్లో గొంతులో చెయ్యి పెట్టవద్ధు.నీటిని గానీ మరి ఏ ఇతర ద్రవాన్ని తాగించ కూడదని డాక్టర్లు చెబుతున్నారు.
      విద్యుత్తు ఘాతం:ఎవరినైనా విద్యుత్తు ప్రవహిస్తున్న వైరును తాకినట్టయితే ఎండిన కొమ్మగానీ, చెక్కతో గానీ వైరును తొలగించాలి. ఎట్టి పరిస్థితుల్లో చేతితో లాగ కూడదు.అతని ద్వారా విద్యుత్తు మన శరీరంలోకి ప్రవహించి ప్రమాదం జరగవచ్చు.అతనిని వైరునుండి తొలగించిన తరువాత ఊపిరి ఆడక పోతే నోటిద్వారా కృత్రమ శ్వాస అందించండి.(cardio pulmanory resuscitation).
       మధుమేహ రోగి:మధుమేహ రోగి పడిపోతే అతనికి శరీరంలోచక్కెర తగ్గించే టాబ్లెట్లు గానీ ఇవ్వకండిరోగిలో అనూహ్యంగా చక్కెర శాతం పడిపోయినందువలన(hypoglycemia) సంభవించి రోగి పడిపోయి ఉండవచ్చు.నీరసించి పోయిఉండవచ్చు.అటువంటి సమయంలో రోగికి పండ్లరసంగానీ,చక్కెర నీళ్ళు ఇచ్చి శరీరంలో గ్లూకోజు శాతం పెంచవచ్చు.వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి రక్తంలో గ్లూకోజు శాతం చూపించి తగిన సలహా డాక్టరునుండి పొందవచ్చు.
      కారు,లారీ మొదలైన వాటి వలన ప్రమాదాలు: ఇటువంటి ప్రమాదాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ప్రమాదానికి గురియైన వ్యక్తి ముక్కు చెవుల్లోనుండి రక్తం వస్తుంటే అతని కపాలం పగిలి ఉండవచ్చు. మెడ గానీ వెన్నెముకకు గానీ దెబ్బ తగిలిందేమో చూడండి.అటువంటి పరిస్థితుల్లో వ్యక్తిని జాగ్రత్తగా కదిలించాలి.లేకపోతే పక్షవాతం లేక చావు సంభవించవచ్చు.అంబులెన్స్ లో ఆసుపత్రకి పంపడం మంచిది.రోగిని కంగారు పెట్ట కూడదు.
    వడదెబ్బ: తీవ్రమైన వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గి వ్యక్తి నీరసించి పడిపోవచ్చు.వెంటనే టెంకయ నీళ్ళు,పండ్లరసం,చల్లటి నీరు వంటివి ఇవ్వాలి. కాఫీ, టీలు ఇవ్వవద్దు.చల్లటి నీళ్ళలో తడిపిన టవలు తల మీద వెయ్యండి.రోగిని చల్లని ప్రదేశానికి తరలించండి.తరువాత కాచి చల్లార్చిన నీళ్ళలో చిటికెడు ఉప్పు,చారెడు పంచదార వేసితాగించండి. రోగి కోలుకుంటాడు.
      ఈ వ్యాసం మీ గ్రూపులో అందరికీ పంపండి.
                  **********

కామెంట్‌లు