"చదువుకుంటే ప్రయోజనం ఏమిటి?" అడిగాడు చందు తన గురువు గుర్నాధాన్ని..
" చదువుకుంటే జ్ఞానం,విచక్షణా జ్ఞానం రెండూ అలవడతాయి,నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నీకొక కథ చెబుతాను" అంటూ ఈ కథ చెప్పాడు.
"ఒక ఊరిలో సాంబయ్య అనే దొంగ ఉండేవాడు.వాడు కొంత చదువుకున్నవాడే అయినా కొన్ని పరిస్థితుల వలన దొంగగా మారాడు.వాడు చదువుకున్న చదువు వలన విన్న నీతికథల వలన వాడు చేస్తున్నది తప్పు అని బాధ పడేవాడు.
ఒకరోజు వాడు నిర్మానుష్యంగా ఉన్న దారిలో వెళుతుంటే దారిలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అతని పక్కనే ఒక డబ్బు సంచీ పడిఉంది! ఆ వ్యక్తి బాధతో మూలుగుతున్నాడు.సాంబయ్య సంచీ విప్పి చూస్తే కొంత డబ్బు ,బంగారు నగలు ఉన్నాయి! అవి తీసుకుని వెళ్ళి పోవాలనుకున్నాడు సాంబయ్య.నిజానికి అవి తీసుకుని వెళితే అడిగేవాడు లేడు.ఆ వ్యక్తి బాధ చూసి దొంగతనం చేయబుద్ధికాలేదు వాడిలోని చదువు వాడిలోని యుక్తాయుక్త జ్ఞానాన్ని మేల్కొల్పింది.
"అయ్యా,నన్ను ఎద్దు కుమ్మింది నడవలేను ఎల్లుండి నా కూతురు పెండ్లి ఉంది,దయచేసి నా సొమ్ముతో నన్ను ఇంటికి చేర్చు నీఋణం ఉంచుకోను" అని నీరసంగా చెప్పాడు.
అప్పుడే అటు వస్తున్న బండివాడితో మాట్లాడి ఆ వ్యక్తిని డబ్బుతో సహా అతని ఇంటికి చేర్చాడు.
ఇంట్లో పెళ్ళి హడావుడిలో ఉన్న అందరూ సాంబయ్య చేసిన మేలు తెలుసుకుని అతనిని పెండ్లి కి ఆహ్వానించారు,కొత్త బట్టలు పెట్టారు.అతని మంచితనానికి అబ్బర పడి పెండ్లికి వచ్చిన ఒక ధనవంతుడు సాంబయ్యకు తన కర్మాగారంలో కాపలా వ్యక్తిగా మంచి జీతంతో నియమించాడు,చూశావా అతనిలోని చదువు అతనిలో మంచితనాన్ని మేల్కొల్పింది,ఆ చదువే అతను ధర్మ బద్ధంగా బతకడానికి ఉపయోగ పడింది"
అని చందుకు వివరించారు గుర్నాధం.
" మంచి కథ చెప్పి నాలో మంచి ఆలోచనలు రేకెత్తించారు గురువుగారు" అని గురువుకు నమస్కరించి వెళ్ళాడు చందు.
**********
చదువుకుంటే....;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి