తగిన శాస్తి:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   " ఎప్పుడు గానీ తెలివి గల వాళ్ళతో,మంచి మనసు గల బలవంతులతో స్నేహం చేస్తే వారి స్నేహం మనకు ఎప్పుడయినా ఉపయోగపడవచ్చు,అటువంటి కథే మీకు చెబుతాను" అన్నారు గురువు విద్యాపతి.
      "చెప్పండి చెప్పండి" అని ఆతృత కనబరిచారు విద్యార్థులు.
విద్యాపతి గారు చెప్పడం మొదలు పెట్టారు.
                ****************
     చంద్రగిరి అడవిలో మూడు కుందేళ్ళు ఎంతో స్నేహంగా ఉండేవి.అప్పుడప్పుడూ అవి ఏనుగును కలసి మంచి మాటలు చెప్పేవి.వాటి మంచి మాటలు,మంచితనానికి ఏనుగు ఎంతో సంతోషించి వాటితో స్నేహం చేసింది.
       ఒకరోజు అవి మంచి పండ్లు తిని సంతోషంతో ఆడుకో సాగాయి.దూరం నుండి ఒక పులి కుందేళ్ళను చూసింది,అసలే పులి ఆకలి మీద ఉంది దానికి కుందేళ్ళను చూసే సరికి నోరు ఊరింది! అది చెట్ల చాటున నక్కుతూ కుందేళ్ళ వైపు రాసాగింది. ఒక కుందేలు పులి రాకను గమనించి రాబోయే ప్రమాదాన్ని మిగతా రెండింటికీ హెచ్చరిక చేసింది! అంతే అవి వేగంగా అడవిలో పారే పైడిముఖి నది వైపు పరుగెత్తాయి.అప్పుడే నదిలో స్నానం చేసి వస్తున్న ఏనుగుకి పరుగున వస్తున్న కుందేళ్ళు కనిపించేసరికి ఆశ్చర్య పోయింది.
       "ఏనుగన్నా,మమ్మల్ని పులి తరుముకొస్తోంది, చంపుతుందేమో అని భయంగా ఉంది. మమ్మల్ని కాపాడు"అని ఏనుగుకు చెప్పాయి.
       " మీరు నా స్నేహితులు,నేనుండగా మిమ్మల్ని ఎవరు ఏంచేస్తారు? జాగ్రత్తగా నా తొండం మీద ఎక్కి వీపుపై కూర్చోండి మిమ్మల్ని ఆవలి గట్టుకు చేరుస్తాను" చెప్పింది ఏనుగ.
      వెంటనే మూడు కుందేళ్ళు ఏనుగు తొండం మీదుగా ఎక్కి వీపు మీద కూర్చుని భయం భయంగా ఒడ్డు వైపు చూడ సాగాయి! పులి పరుగున వచ్చి ఏనుగ వీపు మీద ఉన్న కుందేళ్ళను చూసి అవి నావి" అని ఘాండ్రించింది.
       "ఈ కుందేళ్ళు నాస్నేహితులు,వాటిని ఏమైనా చేస్తే నేను ఊరుకోను"అని తొండం ఎత్తి ఘీంకరించింది.
         అయినా పులి మళ్ళీ ఘాండ్రించబోయింది.
"చెప్పినా నా మాట వినవా?" అంటూ ఏనుగ తన తొండంలోకి  నీళ్ళు పీల్చి అతి పీడనంతో నీళ్ళు చిమ్మింది! ఆ నీటి జల్లుకు, ఏనుగ కోపానికి భయపడి పులి అడవి లోపలికి పరుగులు తీసింది!
       బతుకు జీవుడా అనుకుంటూ కుందేళ్ళు నది అవతలి గట్టున ఉన్న సురక్షిత ప్రదేశానికి వెళ్ళి పోయాయి.కుందేళ్ళను రక్షించినందుకు ఏనుగ ఎంతో సంతోషించింది.
                  ***************
   "చూసారా పిల్లలూ కుందేళ్ళకు బలమున్న ఏనుగ స్నేహం ఎలా ఉపయోగపడిందో,అదే విధంగా మంచి తెలివిగల వారితో స్నేహం కూడా ఎప్పుడోకప్పుడు తప్పక ఉపయోగ పడుతుంది,అంతే కానీ చెడ్డ బుద్ధి గల వారితో స్నేహం చేయకూడదు,అది అనుభవాన్ని బట్టి మీకు తెలుస్తుంది" అని వివరించారు విద్యాపతి గారు.
        "మంచికథ చెప్పారు గురువు గారు" అని చప్పట్లు కొట్టారు శిష్యులు.
              ****************

కామెంట్‌లు