వూకూకె (నవ్వుల్లో ముంచెత్తే జానపద కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
  ఒకూర్లో ఒక పిల్లోడుండేటోడు. వానికి ఆటలంటే చానా ఇష్టం. పొద్దస్తమానం షికార్లు కొడతా... తోటి పిల్లలతో బొంగరాలాట, గోలీలాట, లేస్తేలాత్, చిల్లంగోడె, కబడీ, వంగుడు దుంకుడు,
కోతికొమ్మచ్చి... అట్లా ఎన్నెన్నో ఆటలు ఆడుకుంటా, ఊరి పక్కనే వున్న చెరువులో ఈత కొట్టుకుంటా తిరిగేటోడు. కొంచం గూడా పని చేసేటోడు కాదు.
కొంతకాలానికి వాడు పెరిగి పెద్దోడయినాడు గానీ బుద్ధి మాత్రం మారలేదు. దాంతో వాళ్ళమ్మ ఒక రోజు వాన్ని పిలిచి "రేయ్.... దున్నపోతులాగా అడ్డంగా పెరిగినావ్. ఇంకా ఎంత కాలమిట్లా పనీపాటా లేకుండా తిరుగుతావ్. ఇట్లాగే వుంటే రేప్పొద్దున నీకు పిల్లనెవరిస్తార్రా... పెండ్లి చేసుకోడానికి" అంటా బాగా తిట్టింది. దాంతో వాడు "నీకెందుకు మా బెంగ. . నేను పోయి పెండ్లి చేసుకోనొస్తా చూడు" అని ఇంట్లో నుండి బైలుదేరినాడు.
వాడు దారిలో పోతా పోతావుంటే ఒకచోట ఒక అంగడి కనబడింది. ఆ అంగట్లో ఒక చిన్నపాప కూచోనింది. వాళ్ళమ్మ లోపల స్నానం చేస్తా వుంది. వీడు అంగడి దగ్గరికి పోయి మురుకులు కొన్ని పొట్లం కట్టిచ్చుకొన్నాడు. ఆ పాప డబ్బులడుగుతే వాడు నవ్వుతా “మీ అమ్మకు నేను బాగా తెలుసులే... ఈసారి వచ్చినప్పుడు ఇస్తా" అన్నాడు. ఆ పాప “ఏం పేరు నీది" అనడిగింది. దానికి వాడు “పూకూకె" అన్నాడు. అట్లాగా అని పాప గట్టిగా “అమా... ఈయనెవరో మురుకులు తీసుకోని డబ్బులు మళ్ళా ఇస్తానంటా వున్నాడే" అని గట్టిగా అరిచింది. వాళ్ళమ్మ లోపల్నించే “ఎవరే... ఏం పేరే?" అనడిగింది. దానికాపాప “వూకూకెమా" అనింది. దాంతో వాళ్ళమ్మ పూకూకెనా అని వూరుకోనింది.
వాడు మురుకుల పొట్లం తీసుకోని చాకిరేవు కాడికి పోయినాడు. అక్కడ చాకలోళ్ళు బట్టలన్నీ శుభ్రంగా వుతికి, ఆరేసి పిల్లల్ని కాపలా పెట్టి వూళ్ళోకి పోయినారు. వీడు ఒక పాప దగ్గరికి పోయి "పాపా... పాపా... నాకు ఆ బట్టలియ్యి, మళ్ళా సాయంత్రానికంతా తిరిగిస్తా. నాకు ఆ బట్టలిచ్చినావనుకో నీకు ఇదిగో ఈ మురుకులిస్తా" అని ఆశ చూపించినాడు. ఆ పాప సరేనని మురుకులు తీసుకోని "తొందరగా రావాల చూడు" అంటూ బట్టలిచ్చి "నీ పేరేమి" అనడిగింది. దానికి వాడు “సుడిగాలి" అని చెప్పి కొత్తబట్టలేసుకొని పోయినాడు. అట్లా పోయినోడు సాయంకాలమయినా రాలేదు. పాప తల్లి వచ్చి "కొత్త బట్టలు యాడికి పోయినాయే" అనడిగింది. దానికి ఆ పాప ఏడుస్తా "సుడిగాలి వచ్చి ఎత్తుకుపోయినాడుమా" అని చెప్పింది. దానికి వాళ్ళమ్మ "సుడిగాలొచ్చి ఎత్తుకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తార్లే... అంతా మన ఖర్మ... నువ్వు ఏడవద్దు" అని మిగతా బట్టలన్నీ మూటగట్టి గాడిద మీద వేసుకోని వెళ్ళిపోయింది.
వాడు కొత్తబట్టలేసుకోని ఒక చెరువు కాడ పోతావుంటే దారిలో ఒకడు అప్పుడే కొనుక్కొచ్చిన కొత్తగుర్రంతో ఎదురొచ్చినాడు. వాడు వీన్ని చూసి “బాబూ... బాబూ... కాస్త ఈ గుర్రాన్ని చూస్తుంటావా... చెరువులో స్నానం చేసొస్తా" అన్నాడు. వీడు సరేనన్నాడు. వాడు స్నానానికి పోతా పోతా "నీ పేరేమి" అని అడిగినాడు. దానికి వాడు "యజమాని" అని చెప్పినాడు. వాడు స్నానానికి అట్లా పోయినాడో లేదో వీడిట్లా గుర్రమేసుకోని మట్టసంగా మాయమైపోయినాడు.
వాడు స్నానం చేసాచ్చి చూస్తే ఇంగేముంది... గుర్రం లేదు. వాడు లబోదిబోమని ఏడుస్తా వుంటే దారిలో పోతున్నోళ్ళందరూ గుంపయినారు. “ఏమయింది... ఎందుకట్లా ఏడుస్తా వున్నావ్... ఏంది నీ బాధ" అనడిగినారు. దానికి వాడు వెక్కి వెక్కి ఏడుస్తా “నా కొత్త గుర్రాన్ని ఎత్తుకుపోయినాడు" అని చెప్పినాడు. దానికి వాళ్ళు "ఎవరెత్తుకోని పోయినారు" అనడిగితే "యజమాని” అన్నాడు. అంతే... వెంటనే జనాలంతా కోపంగా యజమాని గుర్రాన్ని తీస్కోనిపోతే మధ్యలో నీకెందుకు బాధ... పోతావా లేదా ఈన్నించి" అని వాన్నే బాగా తిట్టినారు.
వీడు మంచి బట్టలతో కొత్త గుర్రమ్మీద పోతావుంటే దారిలో ఒక ఏరు అడ్డమొచ్చింది. ఏటి ఒడ్డున ఒక ముసలామె అందమైన మనుమరాలితో నిలబడి వుంది. వీన్ని చూస్తానే “నాయనా... నాయనా... మమ్మల్ని కాస్త ఏరు దాటించి పుణ్యం కట్టుకో" అనడిగింది. వాడు సరేనని తలూపుతా “మీ ఇద్దరూ ఒకేసారి ఎక్కుతే నా గుర్రం మొయ్యలేదు. ఒకరి తర్వాత ఒకరిని దాటిస్తా” అని ముందు ఆ అందమయిన అమ్మాయిని ఎక్కించుకున్నాడు. ముసల్ది “నాయనా ఇంతకీ నీ పేరేమి" అనడిగింది. దానికి వాడు “దాని మొగుడు" అని చెప్పినాడు. ఆ పిల్ల దారిలో "నాకు ఇష్టం లేకపోయినా ఆ ముసల్ది డబ్బుకోసం ఆశపడి ఒక ముసలోనికి ఇచ్చి పెళ్లి చేస్తావుంది. నన్ను కాపాడవా" అని అడిగింది. వాడు "నీకు ఇష్టమైతే నేను చేస్కుంటా... ఏం సరేనా" అంటూ ఏరు దాటింతర్వాత తిరిగి రాకుండా ఆ పిల్లతో అట్లాగే పారిపోయినాడు.
ముసల్ది ఏడుస్తా రాజు దగ్గరికి పోయి “రాజా... రాజా... నా మనుమరాలిని ఎత్తుకొని పోయినాడు. నువ్వే కాపాడాల" అనింది. రాజు “ఎవరెత్తుకోని పోయినాడు" అనడిగినాడు. దానికామె “దాని మొగుడు" అని చెప్పింది. ఆ మాటింటానే రాజుకు కోపమొచ్చి “దాని మొగుడు దాన్నెత్తుకోని పోక... నిన్నెత్తుకోని పోతాడా... ఫో... ఫో... ఈన్నించి" అంటూ ఆమెను కసురుకోని తిట్టి పంపిచ్చేసినాడు.
వాడు గుర్రమ్మీద ఆ పిల్లని తీసుకోని ఇంటికిపోయి “అమా... అమా... కాస్త బైటికొచ్చి చూడమా... ఎంత చూడచక్కనైన పిల్లను తెచ్చినానో... వెంటనే మాకు పెండ్లి చేద్దువురా" అన్నాడు. ఆమె సంబరంగా పూరందరినీ పిల్చి బ్రహ్మండంగా కొడుకు పెండ్లి జరిపించింది.

కామెంట్‌లు