మారిన బండోడు (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

 కృష్ణ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. చదువులో అందరి కంటే వెనుకబడేవాడు. కనీసం అక్షరాలు గుర్తు పట్టలేకపోయేవాడు. చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయులు చెప్పే వాటిపై ఏకాగ్రత చూపలేక ఏమీ రానివాడిగా తయారు అయ్యాడు. పైగా కొంతమంది స్నేహితుల బృందంతో కలిసి ఎప్పుడూ ఆటలతో కాలక్షేపం చేసేవాడు. కృష్ణను చిన్నప్పటి నుంచి అందరూ హేళన చేసేవారు. పైగా బండోడు అనే పేరు పెట్టారు. ఎవరైనా చదువుపై శ్రద్ధ చూపకపోయినా, హోం వర్క్స్ చేయలేకపోయినా అలా చేయవద్దురా బండకృష్ణలా తయారు అవుతారు అనేవారు. కృష్ణను అందరి కంటే ఎక్కువగా హేళన చేసేవాడు ఆ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి బలరాం. ఉపాధ్యాయులు కూడా తరచూ కృష్ణను తిట్టేవారు. ఆ తర్వాత బయటికి వచ్చాక కొంతమంది పిల్లలు జోకులు వేసుకుంటూ నవ్వులే నవ్వులు. కృష్ణ ఎంతో కుమిలిపోయేవాడు. 8వ తరగతికి వచ్చాక కష్టపడి చదివుకోవాలని ఆలోచన వచ్చింది. కానీ చూసి చదువుదామంటే అక్షరాలు గుర్తు పట్టలేడు. తనకు మంచి భవిష్యత్తు లేదని బాధపడేవాడు.
       ఇదిలా ఉండగా ఆ పాఠశాలలో 8వ తరగతిలో శివ అనే విద్యార్థి కొత్తగా ప్రవేశించాడు. అతడు చాలా తెలివైన విద్యార్థి. బలరాం కంటే చాలా ఎక్కువ మార్కులు సాధించేవాడు. కృష్ణను అందరూ హేళన చేయడం శివ గమనించాడు. అతడు కృష్ణతో స్నేహం చేశాడు. ప్రతిరోజూ కృష్ణను వదిలి పెట్టకుండా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండేవాడు. "ఆ బండోడితో స్నేహం చేయకు. చెడిపోతావు." అన్నాడు శివతో బలరాం. అయినా శివ వినిపించుకోలేదు. శివతో బలరాం మాటలు మానేయడంతో పాటు తన స్నేహితులను కూడా శివతో మాట్లాడవద్దన్నాడు. పైగా శివను కూడా హేళన చేయడం మొదలు పెట్టారు. ఇవన్నీ శివ పట్టించుకోలేదు.
       శివ కృష్ణకు అక్షరాలు గుర్తు పట్టడం, ఆ తర్వాత పదాలను చదవడం, ఆ తర్వాత వాక్యాలను చదివించడం, ఆ తర్వాత చూడకుండా తప్పులు లేకుండా రాయించడం అభ్యాసం చేయించాడు. 8వ తరగతి పూర్తి అయ్యాక వేసవి సెలవుల్లోనూ కృష్ణను శివ వదలలేదు. కథల పుస్తకాలను చదివించడం, వార్తా పత్రికలను చదివించడం, ఆ తర్వాత పాఠ్యాంశాలను చదివించి అర్థం చేసుకునేలా చేయడం చేశాడు. పట్టుదల కల కృష్ణ కొద్ది కాలంలోనే సగటు విద్యార్థిగా తయారు అయ్యాడు. 9వ తరగతిలో శివ చెప్పినట్లు కృష్ణ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వినడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం, శివతో కలిసి చదవడం చేశాడు. 9వ తరగతి పూర్తి అయ్యేసరికి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. వార్షిక పరీక్షలలో బలరాం కంటే ఎక్కువ మార్కులు సాధించాడు. బలరాం గర్వం అణిగింది. ఎవరినీ హేళన చేయడం లేదు. 

కామెంట్‌లు