హరిత పత్రం (ఆకు)కలంస్నేహం-- విష్ణు ప్రియ
పుడమితల్లి గర్భంలో...
పురుడుపోసుకుని తన తనువును 
చీల్చుకుంటూ విత్తనం....
మట్టిరేణువుల మధ్యలోంచి
చీకటి తెరలను దాటుకుంటూ..
నీలిమబ్బుల మాటునుండి 
తొంగి చూసే బాల భానుడులా
మెల్లమెల్లగా బయటకు వచ్చి..

ఒకేసారి వెళుతురును చూడలేకో...
చిరుగాలి చలిగిలికో దగ్గరకు ముడుచుకొని...
లేలేత ఎర్రని చిగుళ్ళతో...
చిట్టిపాపాయిలా ముద్దుముద్దుగా ముచ్చటగొలుపుతూ...
నవ్వుతుంది సుకుమారంగా....

గుక్కెడు నీళ్లకే పరవశించిపోతూ...
మారాకులు వేస్తూ...
పచ్చపచ్చగా మారుతూ...
చిట్టిమొగ్గలు తొడుగుతూ...
పువ్వుల నవ్వులతో ప్రతివారిని పలకరిస్తూ....
అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ..

ఆకులై,రెమ్మలై,కొమ్మలై పెరుగుతూ...
హరితవర్ణపు ఆకులు రవికాంతుని 
నులివెచ్చని కౌగిట కరుగుతూ...
ఆహారాన్ని తయారుచేస్తూ..
సమస్త జీవజాతి మనుగడకు ఆధారమై నిలుస్తూ...
తన తనువును నిలువెల్లా మనకే 
అర్పిస్తున్న ఆకు దెంతటి త్యాగమో!!
ఆ చెట్టుదెంతటి పుణ్యమో!!
తెంపినా, నలిపినా, నరికినా..
మనకోసం మళ్ళీ మళ్ళీ చిగురిస్తూ...
మనని ఉద్దరిస్తూ సృష్టికి మూలమై 
నిలిచినవి చిన్ని చిన్ని చిగురాకుల చిట్టిమొక్కలే...
మన ప్రాణప్రదాతలు....!


కామెంట్‌లు