// గెలుపు నిజానిదే//;-కలం స్నేహం-కమల ముక్కు
 లోకం తీరింతేనేమో
నిజాన్ని నిర్భయంగా చెప్పే వారంటే 
ఎందుకో నచ్చదు ఈ జనాలకు 
వారిని నానా మాటలూ ఆడుతూ 
దూరంగా పోతారు!!!
నీ ఎదుట పొగుడుతూ 
నీ వెనుక గోతులు తవ్వే 
మాయదారి మల్లిగాళ్ల మాటలే 
నిజమనే భ్రమలో ఉంటారు
అబద్ధాల వెంట పరుగులు తీస్తారు!

నిజాలు మాట్లాడే వైపు 
కన్నెత్తైనా చూడరు 
కానీ అబద్ధాలు మాట్లాడుతూ 
ఓ కొత్త లోకం సృష్టించేవారికి 
జేజేలు పలుకుతూ 
బ్రహ్మరథం పడతారు!!!

ముక్కు సూటిగా మాట్లాడుతూ 
నిజాయితీ ఉంటే నచ్చదు జనాలకు 
అబద్ధాలు చెప్తూ పొగడ్తలతో ముంచెత్తే 
వారే నచ్చుతారు లోకులకు!!!

సూటిగా మాట్లాడితే 
పొగరంటారు గర్వమంటారు
లేనిపోని అబద్ధాలు చెప్పేవాడేమో 
మాటకారీ లౌక్యం తెలిసినవాడూ!!!

అందుకే అంటారేమో 
నటించడం వస్తేనే 
ఈ ప్రపంచంలో బ్రతకగలం అని
ముక్కు సూటిగా ఉంటే 
ఒంటరిగా మిగిలిపోతాం అనీ!!!

కానీ గుర్తు పెట్టుకో ఒక్కటి 
అబద్ధానికెప్పుడూ భయమే 
నిజానికెప్పుడూ నిర్భయమే
చివరాఖరి గెలుపు నిజానిదే 
ఓటమి అబద్ధానిదే!!!


కామెంట్‌లు