ఓడిపోయిన రాజు (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

     విజయపురి రాజ్యాన్ని రాజేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు రాజు అయినప్పటి నుంచి విజయయాత్రలు చేస్తూ ఎన్నో రాజ్యాలను జయించి, రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ప్రపంచంలో అందరి కంటే పెద్ద రాజ్యాన్ని ఏలాలి అనే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకునేవాడు కాదు. 
       శ్రీపురం అనే రాజ్యాన్ని విజయుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకుంటూ రాజ్యంలో ఎవరికీ ఏ సమస్యలూ రాకుండా చూసుకుంటున్నాడు. ప్రజలంతా విజయుడే తమకు శాశ్వతంగా రాజుగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజలలో చాలామంది స్వచ్ఛందంగా యుద్ధ విద్యలు నేర్చుకుంటూ శత్రురాజులు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకుండా చూసుకుంటున్నారు. ఆ శ్రీపురం రాజ్యంపై రాజేంద్రుని కన్ను పడింది. కానీ దాని మీదికి దండయాత్ర చేయడం ఎంతకూ సాధ్యం కావడం లేదు. చాలాసార్లు రాజేంద్రుడు తన మంత్రి మహేంద్రునితో కలిసి మారు వేషాల్లో శ్రీపురం అంతా కలియ తిరిగాడు. అక్కడ రక్షణ వ్యవస్థను చూసి దండెత్తే సాహసం చేయలేకపోయాడు. 
       ఒకరోజు అర్థరాత్రి రాజేంద్రుడు, అతని మంత్రి మహేంద్రుడు కలిసి మారువేషాల్లో వెంట ఎవరినీ తీసుకు రాకుండా శ్రీపురంలో ఒక గ్రామంలో తిరుగుతున్నారు. ఊరి బయట ఎవరూ లేనిది చూసి ఒక చెట్టు కింద వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా చెట్టు పై నుంచి ఇద్దరు మహా బలశాలులైన వ్యక్తులు వీరిపై దాడి చేసి బంధించారు. "భయపడకండి మహారాజా! మిమ్మల్ని ఏమీ చేయము. మీరు శ్రీపురంపై కన్ను వేసి దానిని ఆక్రమించుకోవడానికి త్వరలో ముహూర్తం పెట్టుకున్నట్లు మీ సంభాషణ ద్వారా తెలిసింది. కానీ మా రాజ్యంలో మహా బలశాలులు ఎందరో ఉన్నారు. కానీ ఎవ్వరికీ యుద్ధం చేయాలనే కాంక్ష లేదు. మా మహారాజు పరిపాలనే శాశ్వతంగా ఉండాలని, దాని కోసం ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అందరి ఆకాంక్ష. మీరు ఎన్ని కుట్రలు చేసినా మా రాజ్యాన్ని ఆక్రమించుకోలేరు. అయితే ఓ రెండు రోజులు మా వెంట రండి. మీ రాజ్యం అంతా కలియ తిరుగుదాం." అని అన్నారు. 
       ఆ మహా బలశాలుల వెంట రాజేంద్రుడు, మంత్రి కలిసి ఆ రెండు రోజులు అలాగే మారు వేషాల్లో వారి రాజ్యం అంతా కలియ తిరిగారు. రాజ్యంలో ప్రజల కష్టాలకు అంతులేదు‌. దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువైనాయి. స్త్రీలకు రక్షణ లేదు. ప్రజల సమస్యలు తీర్చే నాథుడే లేడు. ఎవ్వరి నోట విన్నా ఈ రాజేంద్రుని పాలన అంతం కావాలనే మాటే వినిపిస్తుంది. "చూశారా మహారాజా! రాజ్యాల్ని జయించారు కానీ మీ ప్రజల మనసుల్ని గెలవలేకపోయారు. ఇలా ఎన్ని రాజ్యాలను జయించినా వ్యర్థమే. ముందు ప్రజల సమస్యల్ని పట్టించుకోండి. వారి మనసుల్లో దేవునిలా నిలిచిపోండి." అన్నారు. కనువిప్పు కలిగిన రాజు, మంత్రి తమ ఆస్థానంలోకి వెళ్ళిపోయారు. ‌
కామెంట్‌లు