వాంకిడి గుడి:; -విషయ రచన:శ్రీరామోజు హరగోపాల్

 మా చరిత్రబృందం యువ పరిశోధకుడు సునీల్ సముద్రాల సందర్శన, పరిశోధనయాత్రలో వాంకిడి గుడి:
 ఏ గుడిని చూసినా ఆ దేవాలయవాస్తు నిర్మాణం ఆశ్చర్యం కొలుపుతూనే వుంటుంది. ప్రతి గుడి వెనక దాని నిర్మాతల మతధార్మిక తాత్వికత ఆధారభూతంగా వుంటుంది. విశ్వాసం ఏర్పరుచుకునే ముందు స్వీకరించే వారి దైవారాధనలు ప్రత్యేకంగా ఎంపికచేయబడతాయి. హిందూమతం ఒకే మతం కాదు. పలుమతభావనల సమ్మేళనం. సాధారణీకరించి చెప్పడం వింటుంటాం.
 భారతదేశంలో లింగపూజను శిశ్నపూజలని రుగ్వేదం నిందించింది. కాని, తరువాత కాలంలో వచ్చిన మతధార్మిక పరిణామాల ఫలితంగా శైవం మతంగా, శివలింగం పూజనీయంగా నిలిచింది. వైదికమతంగా చెప్పబడ్డ యజ్ఞాది క్రతువుల స్థానాన్ని దైవారాధన భర్తీచేయబడుతు వచ్చింది. శైవంలో మళ్ళీ అనేక తాత్విక భేదాలు. జీవుడు, దేవుడు అన్న అంశమే ప్రధానంగా ద్వైత, అద్వైత భావనలతో మతశాఖలు ఏర్పడ్డాయి. ప్రాంతాలవారీగా కొన్ని స్వంత ఆరాధానలు చోటుచేసుకున్నాయి. సమకాలికంగా కొనసాగిన బౌద్ధ,జైనాది పరమతాల ప్రభావాలు, కలగలుపులు శైవం, వైష్ణవాది హిందూమతాలలో మనకు అగుపిస్తాయి. దేవతల బదలాయింపు, తంత్ర, మంత్ర, యంత్ర సాధనలు ఎప్పటికపుడు ఆశ్చర్యం గొలిపే విధంగా మతాలన్నిటా విస్తరించాయి. మౌలిక మతభావనలలో పరివర్తనలు కనిపిస్తాయి.
 ఆరాధనా తత్వానికి ప్రతిమారూపం శిల్పం. శిల్పం శిల్పి సృజన. శిల్పి శిల్పం చెక్కడానికి ముందు ఆ ఆరాధన తత్వాన్ని, ధ్యానాన్ని ఆకళింపు చేసుకుని పాదార్థిక కల్పన చేస్తాడు. రాతిలో, దారువులో, లోహంలో, మృత్తికలో శిల్పం రూపొందింపబడుతుంది. సాధారణంగా శిల్పమంటే గుడిలోని విగ్రహాలని రూఢిగా మారిపోయింది. ఏ గుడిలో ఏ మూర్తుల ప్రతిష్టాపన జరుగాలో ఒక పద్ధతి, ప్రణాళికలుంటాయి. అవి నిర్మాతలకన్నా వారి, గురువుల, బోధకుల తత్వాలకు సాకారంగా వుంటాయి. తొలుత శిల్పమంటే ఆంత్రోపోమార్ఫిక్(మానవరూప) శిల. దానికి మానవవికాసంలో ప్రధానమైన నాగరికతా సంస్కృతుల ప్రభావాలే మూలకం. దేవతామూర్తులందరు మానవాతీతశక్తి సంపన్నులనేది విశ్వాసం. విగ్రహకల్పనలో మాత్రం మానవరూపానుసరణే వుంటుంది. దానికొక శాస్త్రం వుంటుంది. శిల్పాలకు, దేవాలయవాస్తుకు శిల్పశాస్త్రాలున్నాయి. మతాలకు ఆరాధనాభావనలున్నాయి. వాటిని సాకారపరిచేవారు శిల్పులు. శిల్పాలకు ప్రతిమాలక్షణాలను రూపొందివుంచారు. ఆ లక్షణాలు కూడా ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్యప్రాంత భేదాలు కలిగివుంటాయి.
  తెలంగాణ చరిత్రది ప్రత్యేక అస్తిత్వం. వింధ్యపర్వతాలు దాటి వచ్చిన ప్రజాసమూహాలు, పాలకులతోపాటు వారి సాంస్కృతిక విషయాలు కూడా తెలంగాణా పొలిమేరలకు చేరాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో వారు ఆవాసాలు ఏర్పరచుకున్న చోట్లలో వారి నిర్మాణాలున్నాయి. వాటిలో ఆలయాలుకూడా వున్నాయి. వాటి ప్రాసాదలక్షణాలు భిన్నంగా కనిపిస్తాయి. ఆలయాలలో దేవతామూర్తులలో కూడా వైవిధ్యం కనిపిస్తుంది.
వాంకిడి ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక మండలకేంద్రం. జాతీయ రహదారి నం.44కు చేరువలో వుంటుంది.ఈ వాంకిడి గుడి చక్రివాగు ఒడ్డున వుంది. పూర్వం ఈ వాగు గుడిని చుట్టుకొని ప్రవహిస్తుండేదిట. వాగుకు వరదలొచ్చినపుడు గుడిలో కొంతభాగం కూలిపోయిందని స్థానికులు చెప్తుంటారు. గుడికి నాలుగువైపుల మెట్లుండేవని ఆనవాళ్ళవల్ల తెలుస్తున్నది. గుడి ఉత్తరాభిముఖంగా వుంది. దేవాలయగోపురాలు ఫంసానా పద్ధతిలో నిర్మించబడ్డాయి.
 ద్వారం ముందర 8స్తంభాల మంటపం వుంది. గుడి బయట మంటపంలోని స్తంభాలశైలి రాష్ట్రకూటుల కాలందనిపిస్తున్నది. ఒక స్తంభం మీద చతురస్రాకార నాగబంధశిల్పముంది. దీనిని నాగకల్(వీరగల్లువలె) అంటారు.
గుడిలోనికి ప్రవేశించేద్వారానికి శైవద్వారపాలకుల శిల్పాలున్నాయి. కొత్తగా నిలిపిన ధ్వజస్తంభం వుంది. గుడిప్రాంగణంలో, ధ్వజస్తంభం ముందరున్న నంది అలంకరణలనుబట్టి చాళుక్యశైలి శిల్పం.
దేవాలయ ప్రవేశద్వారం మీద శైవద్వారపాలకులకు రెండువైపుల ఫల,పుష్పాదులతో, కానుకల సంచీలతో పరివారజనులున్నారు. గర్భగుడి ద్వారం చాళుక్యపూర్వశైలిలో కవాటపద్థతిలో కడప, శేరెలమీద స్తంభోప స్తంభాలున్నాయి. ఉత్తరాశిమీద ప్రస్తరం వుంది. లలాటబింబంగా గణపతి వున్నాడు. గర్భగుడిలో క్షితిజసమాంతరంగా వున్న వర్తులాకార పానవట్టంలో సమతల శివలింగం ప్రతిష్టించబడివుంది. ఇది చాళుక్యశైలి లింగం.
గుడికప్పుశిల అంచున భారవాహకులధార చెక్కివుంది. మరొక కప్పుశిల పద్మగర్భితమై వుంది.
గుడిలో…
సప్తాశ్వరథారూఢుడైన ఆదిత్యశిల్పం మనోహరం. సర్వాంగ సుందరంగా తోరణాదులతో శిల్పం హళేబీడు శిల్పశైలిలో వుంది. కాని, సూర్యుని రెండుచేతులు విరిగిపోయివున్నాయి. ఖజురహోలోని సూర్యశిల్పాన్ని పోలివుంది. 
వాంకిడి గుడిలో కొలువబడుతున్న ప్రధానదేవత ఎల్లమ్మ. ఈ దేవతా శిల్పాన్ని పరిశీలించినపుడు ఉమాలింగనమూర్తి శిల్పంలో ఉన్నట్టే శివుడి( శివుడున్న భాగం నడుము పైనుంచి విరిగిపోయింది.) ఎడమతొడమీద పార్వతి(మహామాయ...?) కుడితొడ చేర్చిసుఖాసనంలో కూర్చుని వుంది. ఆమెకు ఎడమవైపు...చేతులున్నాయి. తలమీదతల ఐదుతలలున్నాయి. ఇద్దరి కింద వాహనంగా రెండుచేతులు, కాళ్లు నేలమీద మోపి వంగివున్న రాక్షసుడు(?)న్నాడు. 
గుడిలోని విడిశిల్పాలు:
1. మహామాయ: కరండమకుటధారి, ప్రభావళితో చతుర్బుజాలలో త్రిశూలం, డమరుకం, ఫలాలు, ప్రసారితహస్తంతో సుఖాసనంలో కూర్చుని వున్న దేవత కాళ్ళకింద అధిష్టానపీఠం మీద 3శిరస్సులున్నాయి. ఒంటె వాహనం వుంది. దేవత తలకు కుడివైపున గణపతి, ఎడమవైపున నంది, తలపైన శివలింగం వున్నాయి. ఆమె భుజాలకు కుడివైపున హనుమంతుడు, ఎడమవైపు (?) వున్నాడు. ఈ దేవత లోహకారుల దేవత మమ్మాయి.
2. శాంకరి/సావిత్రి: మణిమకుటధారి. చతుర్బుజి. ఢమరుకం,త్రిశూలం, అక్షమాల, కమండలాలు ధరించి సుఖాసనంలో కూర్చుని వున్న దేవతకు వాహనం హంస.
3. చాముండ: ఈ దేవత చతుర్బుజి. త్రిశూలం, ఢమరుకం, ఖడ్గం, రక్తపాత్ర ధరించి, సిద్ధాసనంలో కూర్చున్నది. వాహన స్థానంలో చతుర్దళపుష్పం వుంది.
4. ఉమాలింగనమూర్తి: శివుడు సుఖాసనంలో కూర్చున్న శివుని ఎడమతొడమీద ఉమాదేవి కూర్చున్నది. శివుడామెను ఎడమచేత ఆలింగనం చేసుకుంటున్నాడు. వారిద్దరు పాదాలవద్ద నందివాహనముంది. దేవతాధిష్టానపీఠం మీద చెక్కివున్న దంపతుల శిల్పాలలో పురుషుడు మహరాజలీలాసనంలో కూర్చునివున్నాడు. స్త్రీ అంజలి ముద్రతో కూర్చుని వున్నది. కనుక అతడు రాజైవుంటాడు. ఈ దేవాలయ నిర్మాత కావచ్చు.
5. లక్ష్మీనారాయణ: సుఖాసనంలో కూర్చున్న శంఖ, చక్రధారియైన కేశవమూర్తి ఎడమతొడమీద లక్ష్మీదేవి తనకుడితొడను చేర్చి విలాసనంగా కూర్చున్నది. ఇద్దరి తలలమీద కరండమకుటాలున్నాయి. నారాయణునికి యజ్ఞోపవీతం, సన్నవీరము కనిపిస్తున్నాయి. వస్త్రాభరణాలు సుందరంగా వున్నాయి.
6. అనంతశయనుడు: లక్ష్మీనారాయణుని విగ్రహం పక్కన అనంతశయనుని శిల్పం వుంది. అనంతునిమీద పవళించిన చతుర్భుజుడైన మహావిష్ణువు పద్మనాభుడు. ఆ పద్మంలో బ్రహ్మ.అతనికి రెండువైపుల ఐదైదు దశావతారమూర్తులు తోరణంగా అలంకరింపబడ్డారు. ముందు కుడిచేయి యోగముద్రపట్టి, పై కుడిచేయి తలదిండుగా పెట్టుకున్నాడు. చక్రం పక్కన పెట్టివుంది. పై వెనక ఎడమచేతిలో శంఖం వుంది. పాదసంవాహనం చేస్తున్న లక్ష్మీదేవి ఈ శిల్పంలో వుంది. అధిష్టాన పీఠం మీద ద్వాదశమూర్తులు చెక్కివున్నారు.
7. గరుత్మంతుడు: మోకాళ్ళమీద అంజలిపట్టి కూర్చున్న గరుడుని విగ్రహముంది.
8. త్రైపురుషమూర్తి: మూడుతలలు,  ఆరుచేతులు, కుడివైపు చేతులలో ఢమరుకం, శంఖం, అక్షమాలలు,  ఎడమవైపు చేతులలో త్రిశూలం, చక్రం, కమండలాలు ధరించిన త్రిశిరమూర్తి హరిహరపితామహుడు. విష్ణువు విగ్రహంలోవలె యజ్ఞోపవీతం, చన్నవీరం ధరించివున్నాడు.
9. ఉమాలింగనమూర్తి మరొకశిల్పం: ఈ శిల్పంలో మూర్తుల కాళ్ళు విరిగిపోయి వున్నాయి. శివుడు కుడిచేత ఢమరుకం, ఎడమచేత త్రిశూలం ధరించాడు.
10. విష్ణువు: ఈ శిల్పం చతుర్భుజుడైన విష్ణువుది.
11. పాశుపతయోగి: అర్థపద్మాసనంలో కూర్చున్న యోగి జటలు తలపైన కట్టగా కట్టివున్నాయి. కుడిచేత జపమాల, ఎడమచేతిలో కమండలం వున్నాయి. గడ్డం, మీసాలు బాగా పెరిగివున్నాయి. 
12. పాశుపతయోగి: రెండవ పాశుపతయోగి తలనుంచి జటలు కిందికి విడిచివున్నాయి. జపమాల, కమండలాలున్నాయి. మీసాలు, గడ్డాలు మొదటి పాశుపతయోగివలెనె.
గుడి బయట శిల్పాలు:
13.  భైరవుడు: గుడిబయట జగతివెంట అక్కడక్కడ వున్న విడిశిల్పాలలో చతుర్భుజుడైన భైరవుడు ఢమరుకం, త్రిశూలం, గద, రక్తపాత్ర,ఖండితశిరస్సులతో వితస్తపాద ముద్రలో నిలిచివున్నాడు. మెడలోనుంచి జారుతున్న సర్పం(భుజంగత్రాసితరూపం), నగ్నదేహం.
14. భారవాహకులు: గుడి జగతి మీద కొమ్ములున్న సింహాలవంటి వ్యాళీరూపంలో భారవాహకులున్నారు.
15. భైరవుడు: నడుముకు విరిగిన భైరవుని విగ్రహముంది.
16. వీరగల్లు: గుడిబయట కత్తి,డాలుతో డాకాలుమోపి యుద్ధోన్ముఖుడైన వీరుడు తలవెనక సిగముడిచివున్నాడు. తలకట్టు, ఆహార్యాన్ని బట్టి 10వ శతాబ్దానికి చెందిన వీరగల్లు కావాలి.
17. వీరగల్లు: గుడిబయట కుడిచేయెత్తి ఎడమచేత విల్లుతో డాకాలు మోపి నిల్చున్న విలుకాడు వీరుని శిల్పముంది.
18. హనుమాన్: మరొక గుడిలో భూతభంజనుడైన అభయాంజనేయమూర్తి శిల్పముంది. దీన్నిపోలిన శిల్పం కాళేశ్వరంలో కనిపిస్తుంది.
19. వీరభద్రుడు: అష్టభుజుడైన వీరభద్రుని చేతులలో కుడివైపు ఖడ్గం, అమ్ము, చక్రం, పరశువులు, ఎడమవైపు డాలు, విల్లు, ఢమరుకం, త్రిశూలాలున్నాయి. సమభంగ, అర్థవైతస్థిక స్థానక భంగిమలో నిల్చుని వున్నాడు.
20. ?: ద్విభుజి, తామరపుష్పంతో వుండాల్సిన కుడిచేయి విరిగిపోయింది. ఎడమచేయి కిందికి విడిచి వుంది. కరండమకుటం ధరించివుంది.
21. దక్షుడు: మేషముఖంతో ముకుళిత హస్తాలతో నిల్చున్న శిల్పం దక్షునిది. వీరభద్రునితో చేర్చి వుంచాల్సిన శిల్పం.
22. గణపతి: ఈ గణపతి ద్విభుజుడు. లలితాసనంలో కూర్చున్న గణపతి పరశువు, కుడుములున్నాయి చేతులలో తొండం అడ్డంగా చెక్కిన శైలినిబట్టి ఈ శిల్పం రాష్ట్రకూటులకాలంనాటిది.
 గుడి జగతిమీద శిల్పాలు: 
వాంకిడి శివాలయం ఎత్తైన జగతిమీద నిర్మితమైంది.  జగతిమీద గజధార, అశ్వధారలతో పాటు కొన్ని పౌరాణిక కథాదృశ్యాలు చెక్కివున్నాయి. వీటిలో అశ్వ, గజసైన్యాలు, గజాల యుద్ధదృశ్యాలున్నాయి. పాశుపతయోగుల శిల్పాలున్నాయి. గోపికా వస్త్రాపహరణం, అశ్వమేధాశ్వం కొరకు వచ్చిన రామసోదరులతో లవకుశుల యుద్ధదృశ్యం, పాండవులు, పెండ్లి, మంగళస్నానాలు, చతుష్పాద నటత్రయం,నాట్యకత్తె, సింహవ్యాళి, ముచ్చట: ఇద్దరు స్త్రీలు తమపిల్లలతో నిలబడి మాట్లాడుకుంటున్నారు.  
జగతిమీద శిల్పాలలో ఒకచోట ఇద్దరు పరిచారికలచేత సేవింపబడుతున్న శైవగురువు సుఖాసనంలో కూర్చుని వున్నాడు. అతనికి అవతల కుడిచేత తనజుట్టును ఎత్తిపట్టుకుని, ఎడమచేత  తనభార్య రొమ్మును తాకుతున్నాడు.  శైవభక్తుని భార్య అతని సిగను కోస్తున్నది. వారికవతల ఉమాలింగనమూర్తి శిల్పమున్నది. వారిని భక్తురాలు సేవిస్తున్నది. చివరలో ఇద్దరు అప్సరలు చేతులుపట్టుకుని కొనిపోతున్న వీరుడున్నాడు. ఇదొక ఆత్మాహుతి వీరగల్లు దృశ్యం.
విషయ రచన:శ్రీరామోజు హరగోపాల్
వాంకిడి గుడి:

కామెంట్‌లు