మహారాజా మేలుకో--చందుపట్ల రామమూర్తి--టీచర్హుజురాబాద్.
ఓటు అంటే మాట కాదు
చీటీ పైన ముద్ర కాదు..
నీవే మహారాజువంటూ
రాజ్యాంగం నీకిచ్చిన 
రాజకీయ హక్కు..

రూపాయిల నోట్లకు
మద్యం బాటిల్లకు
ఓటు వేసిన పాపానికి..
విద్య వైద్యానికి 
ఉన్నదంతా ఊడ్చి పెట్టి..
రోగాల రొంపిలోనా
దరిద్రపు కుంపటిలోనా
మాడి మాడి చావక
తప్పదు నీకెప్పటికీ..

కులమంటూ మతమంటూ
భాష అంటూ బంధువంటూ
ఓటు వేసిన పాపానికి..
కొలువుల వేటలోనా
లంచాలు ఇవ్వక ఓడిపోయి
ఇంటి ముఖం చూడలేక
పట్నంల నౌకరంటూ..
అమ్మ నాన్నల మోసగిస్తూ
ఆడ్డా కూలీగా మారక 
తప్పదు నీకెప్పటికీ...

అంతా ఉచితం అంటే
హాయిగా బతకవచ్చనీ..
ఉచితంగా ఇచ్చేది
నీ సొమ్మే అని తెలుసుకోక
ఓటు వేసిన పాపానికి..
రెక్కలు ముక్కలవ్వగా
చేసిన నీ కష్ట ఫలం
అమ్మబోతే అడివాయే
కొనబోతే కొరివాయే..
అంబా..అని ఏడ్చిన
అన్యాయం నిలువుదోపిడి
తప్పదు నీకెప్పటికీ..

ఓటరు మహారాజా
ఇకనైనా మేలుకొని
విజ్ఞతతో మసులుకొని
విద్యా వైద్యం తప్పా
మరేదీ ఉచితం వద్దని..
కోరుకోనంత వరకు
ఎవరిని గెలిపించిన 
ఎవరిని ఓడించిన
నీ కష్టాలు తీరవు
నీ బ్రతుకు మారదు..కామెంట్‌లు