జయకాంతన్, మరికొన్ని ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 తమిళ సమాజంలో తన రచనలతో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకున్న సుప్రసిద్ధ రచయిత జయకాంతన్ వ్యక్తిగత ముచ్చట్లు మరి కొన్నింటిని చూద్దాం (గతంలోనూ ఆయన గురించి కొన్ని విషయాలు రాశాను)....
రైల్లో టిక్కెట్ లేని ప్రయాణికుడిలా బయలుదేరిన జయకాంతన్ చేసిన ఉద్యోగాలు.....కిరాణా దుకాణంలో. డాక్టర్ దగ్గర అతని బ్యాగ్ పట్టుకోవడం. పిండి మరలో కూలి. థియేటర్లో సినిమా పాటల పుస్తకాలమ్మడం. కంపోజిటర్ గా పని చేయడం. ఫౌండరీలో బొగ్గు కుమ్మరించడం. ఇంక్ ఫ్యాక్టరీలో చేతి బండి లాగడం. జట్కా బండిని తోలే వాడి దగ్గర సహాయకుడు. ప్రూఫ్ రీడర్. అసిస్టెంట్ ఎడిటర్. అనంతరం రచయితగా స్థిరపడటం.
రెండు వందలకు పైగా చిన్న కథలు. చిన్న నవలలు 40, నవలలు 15, వ్యాసాలు 500. తన జీవిత చరిత్రనే ఆధ్యాత్మిక, రాజకీయ, కళారంగం ఇలా మూడు విభాగాలుగా విభజించి మూడు పుస్తకాలు రాశారు జయకాంతన్.
వీణను వీనులవిందుగా వాయించడం తెలుసు. శృతి తప్పక వాయించేవారు.
మంచి సినిమా పాటనిపిస్తే శృతి కలిపి సన్నని గొంతులో తాళం వేస్తూ పాడేవారు. అది ఏ రాగమో పక్కనున్న మిత్రులకు చెప్పేవారు.
"ఈ ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయింది అని ఎవరన్నా అంటే ఆశ్చర్యపోను. ఈ ప్రపంచాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే ఆశ్చర్యపడటమే కాదు, బాధపడతాను" అని జయకాంతన్ తో చెప్పారట ఎస్.ఎస్. వాసన్. ఈ విషయాన్ని ఆయన మిత్రులతో చెప్పి పొందిన ఉద్వేగానుభూతిని చెప్పి గొప్పగా ఫీలయ్యేవారట.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ అంటే అభిమానమూ. మర్యాదానూ. ముఖ్యమంత్రి అయిన తర్వాతకూడా తన తల్లికి ఎటువంటి సౌకర్యాలూ కల్పించని కామరాజ్ నిజాయితీ జయకాంతన్ ని ఆకట్టుకుంది. కామరాజ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిస్ట్ అని పేర్కొనేవారు జయకాంతన్.
 తాను పాల్గొనే సభలలో జయకాంతన్ మాట్లాడేందుకు ఎక్కువ సమయం తీసుకునేవారు. ఇతరులు వినేవారు. ప్రశ్న ఆయనే వేసేవారు. కాస్సేపు మౌనం వహించి తర్వాతే తానే జవాబూ చెప్పేవారు.
జయకాంతన్ సభలకు తరచుగా  హాస్యనటుడు నాగేష్, ఎస్వీ సుబ్బయ్య,  నటుడు చంద్రబాబు, భీంసింగ్‌ ఎం.పి. శ్రీనివాసన్, కవి కణ్ణదాసన్, సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు పార్థిబన్, లెనిన్ తదితరులు హాజరయ్యేవారు.
రాజరాజన్ బిరుదు, భారతీయ భాషా పరిషత్ పురస్కారం, సాహిత్య అకాడమీ అవార్డు, నెహ్రూ అవార్డు (సోవియట్ యూనియన్ ప్రసాదించింది), పద్మభూషణ్ వంటివి ఆయన పొందిన అనేక అవార్డులు, రివార్డులలో కొన్ని మాత్రమే. ఓ తమిళ రచయితకు ఇన్ని పురస్కారాలు దక్కడం విశేషం. మరే తమిళ రచయితకు ఇన్ని లభించలేదు.
1077 శాసనసభ ఎన్నికల్లో టీ. నగర్ నియోజకవర్గం నుంచి సింహం గుర్తుపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆయనకు 481 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
కవి భారతిదాసన్ కు జయకాంతన్ అంటే మహా ఇష్టం. తిరువల్లిక్కేణిలో పాండ్యన్ స్టూడియోలో వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటో ఇప్పటికీ జయకాంతన్ ఇంట్లో ఉంది.
 నా పాఠకుడికి నచ్చినట్లల్లా రాయలేను. నేను రాసేది ఇష్టపడేవాడే నా పాఠకుడు అని అంటుండేవారు. 
రాయకుండా ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు రాయడం లేదని అడిగితే "నేను రాసిందల్లా ముందు చదవండి" అనేవారు జయకాంతన్. 
అప్పటికీ ఎవరైనా ప్రశ్నిస్తే "మీ అమ్మ నిన్ను కన్నారు. అలాగని ఇంకా కనివ్వు అని అడుగుతూనే ఉంటావా?" అని ఎదురు ప్రశ్నిం.చేవారు.
ప్రయాణం అంటే మిత్రులతోనే చేసేవారు.
ఆ సమయంలో చలోక్తులకూ నవ్వులకూ హద్దులుండవు. అయితే ఆ చలోక్తులు ఎవరినీ నొప్పించేవిగా ఉండేవి కావు.
 
నటుడు కమల్ హాసన్ తన సినిమాలను జయకాంతన్ కి ప్రత్యేకించి చూపించి ఆయన అభిప్రాయాలను ఆడిగేవారు.
భారతియార్ పాటలు, తిరుక్కురళ్, సిద్ధుల పాటలను ఉట్టినే ప్రస్తావించరు. వాటిని చెప్పేటప్పుడు అర్థాలను విడమరిచి చెప్పేవారు.
జ్ఞాపకశక్తి అధికమే. తాను చదివిన సాహిత్య పుస్తకాల నుంచి ఉదాహరణలు చెప్పవలసివస్తే పొల్లుపోకుండా చెప్పేవారు.
జయకాంతన్ రచనలలో పుదు సెరుప్పు కడిక్కుం, సిల నేరంగలిల్ సిల మణిదర్గళ్, కావల్ దైవం, ఉన్నైపోల్ ఒరువన్, ఒరు నడిగై నాడగం పార్కిరాళ్, కరుణయినాల్ అల్ల, యారుక్కాగ అయుదాన్ వంటివి సినిమాలుగా రూపొందాయి.
ఉదయం కాస్సేపు యోగాసనాలు వేసేవారు. ఆ తర్వాతే ఆహారం. 
ఎంతటి చలైనాసరే చన్నీళ్ళతోనే స్నానం చేసేవారు.
జయకాంతన్ పుట్టిన రోజు 1934 ఏప్రిల్ 24. ప్రతి సంవత్సరం పుట్టింరోజు సంబరాలు ముందురోజు నుంచే మొదలయ్యేవి. పిచ్చాపాటీతో ఉల్లాసంగా గడిపేవారు. ఆరోజు అందరికీ వారింటే విందు.
ఎంతో ఇష్టపడి ఓ కుక్కను పెంచారు. దానిని "తిప్పు" అని పిలిచేవారు. అది చనిపోయిన తర్వాత ఎంతో బాధపడిన జయకాంతన్ ఆ తర్వాత మరే కుక్కనూ పెంచలేదు.
"రేపు చూద్దాం" వంటి హామీలు ఇచ్చేటప్పుడు ఆ మాటతోపాటు "ఇన్షా అల్లా" అని చెప్పేవారు.
ఓ సభ ముగిసి ఆయన బయటకు వస్తుంటే "ఈరోజు మీరు మీ మాటల్లో విశ్వరూపం చూపలేదు. ఎందుకని?" అని ఒక పాఠకుడు అడగ్గా "విశ్వరూపం అనేది చూపడం కాదు. చూడటం" అని జవాబిచ్చారు జయకాంతన్.
పిల్లలకు రైలు బండిమీద పాటలు పాడి వినిపించేవారు.
ఏ సమస్య అయినా ఓ కొలిక్కి వస్తుందని గట్టిగా నమ్మేవారు. అన్నింటికీ ఏదో ఒక పరిష్కారం ఉంటుందని ఆయన నిశ్చితమైన అభిప్రాయం. అంతే తప్ప అది అసాధ్యం, ఇది అసాధ్యం, అదంతే అనే మాటలు ఆయన నోటంట రావు.






కామెంట్‌లు