అసూయకు ఫలితం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

   ఆ అడవికి రాజైన సింహం జీవానురంజకంగా పరిపాలిస్తుంది. ఆ సింహం తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకుంది. ప్రతీ అడవిజీవినీ పేరు పేరునా ఆహ్వానించింది. దాదాపు అన్ని జీవులు సింహం ఇచ్చిన విందును స్వీకరించాయి. జీవజాలం అభిరుచి మేరకు రకరకాల ఆహార పదార్థాలతో విందు సాగింది. విందు ముగిశాక మంత్రి అయిన నక్క సింహాన్ని కలిసింది. "చూశారా మహారాజా! మీ వేడుకలకు అన్ని జీవులూ ఎంతో గౌరవంతో వచ్చాయి. కానీ మీరు ఎంతగానో ప్రేమగా చూసుకునే కుందేలు రాలేదు. సాక్షాత్తూ మహారాజే తనకు మిత్రుడు కావడంతో కళ్ళు నెత్తికెక్కాయి. తక్షణం దానికి తగిన బుద్ధి చెప్పాలి మీరు." అన్నది. "చూద్దాం." అన్నది సింహం. సింహం మంత్రి అయిన తనకంటే ఎక్కువగా కుందేలుతో ఎక్కువ స్నేహం చేయడం నక్కకు ఇష్టం లేదు. అందుకే తరచూ కుందేలు మీద చాడీలు చెప్పేది.
       ఒకరోజు సింహం అడవిలో సంచరిస్తుండగా దానికి కుందేలు కనబడింది. "నా పుట్టినరోజు వేడుకలకు ఎందుకు రాలేదు? అని ప్రశ్నించింది సింహం. అప్పుడు కుందేలు పక్కనే ఉన్న జింక "మహారాజా! మీ పుట్టినరోజు వేడుకలకు అందరూ రావడం సాధ్యం కాదు కదా!. అనారోగ్యంతో బాధపడుతున్న జీవులు, వృద్ధ జీవులు చాలా ఉంటాయి. కుందేలు ఆలోచనతో నేను, కుందేలు కలిసి మీ పుట్టినరోజు వేడుకల సమయంలో అలాంటి జీవులకు ఆహారాన్ని సేకరించి తినిపించాడు." అన్నది. సింహం ఆ రెండిటినీ ప్రశంసించింది. ఆలోచనలో పడింది. తన పుట్టినరోజు వేడుకలకు రానిది కుందేలు ఒక్కటే కాదు కదా! చాలా జీవులు ఉన్నాయి. నక్క కుందేలు మీదనే ఎందుకు చెప్పింది.
       సింహం కుందేలు, నక్కలతో సమావేశం అయింది. కుందేలు తన పుట్టినరోజు సందర్భంగా చేసిన మంచిపని చెప్పింది. "ఇకపై జంతువుల మంచి చెడులను చూసుకునే కుందేలు నాకు మంత్రిగా ఉంటుంది. ఇకపై నీవు విశ్రాంతి తీసుకోవచ్చు." అని సింహం నక్కతో పలికింది. నక్కకు తగినశాస్తి అయింది.

కామెంట్‌లు