పేరు లోఏముంది? అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు క్లాస్ లో కొత్త కుర్రాడు చేరాడు.అమాయకపు చూపులు బెరుగ్గా అడుగు పెట్టాడు. టీచర్ అటెండెన్స్ తీసుకుంటుంటే ఆయావచ్చి"అమ్మా!ఈబాబు పేరు రాయి బుక్ లో.పెద్దసార్ చెప్పిండు"అనేసి వెళ్లి పోయింది. "నీ పేరు ఏంటి బాబూ?మీనాన్న పేరు?" ఆపిల్లాడు బిడియంగా "తిమ్మ య్య"అనగానే ఘొల్లున నవ్వారు పిల్లలంతా!మంకీ కోతి బందర్...ఇలాతమభాషా పాండిత్యం ప్రదర్శించి గోలచేస్తున్న అందరినీ నిలబెట్టింది టీచర్. "హనుమంతుడు ఎవరు?వారధి కట్టింది ఎవరు?లంకా దహనం చేసింది ఎవరు?రమణ మహర్షి ఒక కోతిని కూడా పెంచి ప్రేమగా చూసుకున్నారు తెలుసా?" అంతే క్లాస్ అంతా నిశబ్దం!"మీనాన్న పేరు చెప్పు తిమ్మయ్యా!"  ఐదో క్లాస్ లో చేరిన వాడు వెక్కివెక్కి ఏడవసాగాడు. "బాబూ!నిన్ను ఎవరైనా ఏడిపిస్తే నాకు చెప్పు.హెచ్.ఎం.సార్ దగ్గరకు పంపుతా "టీచర్ వాడి భుజంపై ఆప్యాయంగా నిమరసాగింది."టీచర్!నాన్న  కరోనా తో చనిపోయిండు.ఆరునెలలాయె" అంతే! క్లాస్ అంతానిశబ్దం గా ఉండిపోయింది. అంతే టీచర్ వారికి కధచెప్పసాగింది.
ఒకప్పుడు  తక్షశిల విద్యా లయంలో పాపకుడు అనేపిల్లాడు చదువుకుంటున్నాడు.వాడిపేరుని అంతా ఇష్టం వచ్చినట్లు పిలుస్తూ పాపకా పాపాత్ముడా పాపడా అని ఏడిపిస్తారు. వాడి తాతపేరు పాపయ్య  నాన్నమ్మ పేరు పాపమ్మ. ఇప్పుడు అంతా తనపేరుని కుళ్ళపొడుస్తూ పిలుస్తోంటే ఒకరోజు ఒంటరిగా  ఉన్న గురువు గారి  దగ్గరకు వెళ్లి తనగోడు వినిపించాడు. "నాపేరు మార్చుకునేదా?"దానికి ఆయన నవ్వుతూ "ఈనగరమంతా చుట్టి కనపడిన వారిని  వారి పేర్లు అడిగి తెలుసుకో!"అని పంపాడు."నీకు నచ్చిన మంచి పేరు తెలుసు కుని  నాకు చెప్పు. " పాపకుడు వెంటనే బైలుదేరాడు. ఎదురుగా  శవవాహకులు కనపడ్డారు."చనిపోయినవాడిపేరు అమరపాలుడు."హు!పేరు అమరపాలుడు!ఏమి లాభం?బాల్యం నించి ఏదో రోగం!మంచాన పడి తీసుకుని పోయాడు "అన్నారు బంధువులు.ఇంకొంచెం దూరం పోగానే నెత్తిన బరువులు మోస్తున్న ధనలక్ష్మీ అనేఆమె పేరు అడిగాడు. "హు..పేరు ధనలక్ష్మీ!నాచిన్నప్పటినుంచి కడుపు నిండా తిండి  ఒంటినిండా బట్ట ఎరుగనుబాబూ!"అంది.పాపకుడు విస్తుబోయాడు.నిరాశగా ముందు కి సాగిపోతూనే ఉన్నాడు. దొంగను పట్టుకుని వెళ్లుతున్న రక్షకభటులు
కనపడ్డారు."నీపేరేమో ధర్మరాజు!దొంగతనాలలో ఆరితేరి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించావు."అని వాడిని ఈడ్చుకెళ్తున్నారు.ఇంతలో "బాబూ!ధర్మం చేయి!"ఆబిచ్చగాడిని ప్రశ్నించాడు చేతిలో ఉన్న  రాగినాణెం ఇస్తూ"నీపేరు ఏంటి తాతా?"  "నాపేరు కుబేరసామి!" ఫక్కున నవ్వు వచ్చింది పాపకుడికి.ఒక మూర్ఖుని పేరు విద్యాధరుడు.దిగంబర సన్యాసి పేరు పీతాంబరదాసు.ఇంకోచోట ఒళ్లు అంతా గజ్జి చర్మరోగాలతో ఉన్న వాడిపేరు నిర్మలదాసు.ఇలా సాయంత్రం దాకా తిరిగి గురువు గారిదగ్గరకు వచ్చాడు."గురూజీ! పేరుకి మనిషికి ఎలాంటి సంబంధం లేదని గ్రహించాను. "అని తను చూసిన  మనుషులు వారి పేర్లు గూర్చి వివరించాడు. "ఇదే నాయనా!నీవు తెలుసు కుని తీరాలి. మనంచేసే మంచి పనులు సత్ప్రవర్తన తోటే మనం పేరు తెచ్చుకోవాలి. అమ్మా నాన్న తమపెద్దలపై గౌరవం తో పిల్లలకు పేర్లు పెట్టి తల్చుకునేవారు.ఇక శివ  నారాయణ మొదలైన పేర్లు పెట్టి దైవస్మరణచేసేవారు."టీచర్ కధచెప్పిపిల్లల వంక చూసింది.అంతా తిమ్మయ్యవైపు జాలిగా చూస్తూ మమ్మల్ని మన్నించు అని కళ్ళతోటే పశ్చాత్తాపం ప్రకటించారు.
కామెంట్‌లు