రాజుకు గుణపాఠం (కథ) సరికొండ శ్రీనివాసరాజు

 మగధ సామ్రాజ్యాన్ని తిరుమలేశ్వర చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అతడు ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. అయితే తిరుమలేశ్వరునికి ఒక బలహీనత ఉంది. తనను పొగుడుతూ ఎవరైనా కవిత్వం రాస్తే వారికి అంతులేని బహుమానాలు ఇస్తాడు. ఎంత పొగిడితే అంత. మహామంత్రి రామకృష్ణులు రాజుగారికి సలహా ఇచ్చారు. ఇలా ధనాన్ని అనవసరంగా దానం చేస్తే సోమరిపోతులు పెరిగిపోతారని, ప్రజోపయోగ కార్యక్రమాలకు ఖర్చు పెడితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఈ సలహాకు రాజుగారు మండిపడ్డారు.
       రాజుగారు, మంత్రిగారు తరచూ రాత్రివేళ మారు వేషాల్లో తిరుగుతూ రాజ్యంలోని రక్షణ వ్యవస్థను పర్యవేక్షించడం పరిపాటి. ఒకరోజు రాత్రివేళ ఒక కుగ్రామం చేరినారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండటం గమనించారు. "ఒరేయ్ వీరభద్రా! ఎన్ని ఉపాయాలు పన్ని, దొంగతనాలు చేద్దామన్నా కుదరడం లేదు. ఈ రాజ్యంలో రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. చేయి తిరిగిన గజదొంగలం ఏమీ చేయలేక పోతున్నాం." అన్నాడు గంగన్న. "చూడు గంగన్నా! మన రాజుగారు బాగా పొగిడితే ధనరాసులు కురిపిస్తాడట. మంచి కవిని పట్టుకొని అతనికి కొంత డబ్బు ఇచ్చి లేదా బెదిరించి రాజుగారిని పొగిడేలా కవిత్వం రాయించుకుందాం. ఇక కనక వర్షం కురుస్తుంది అనుకో. ఎన్ని దొంగతనాలు చేసినా అంత సంపాదించలేము. మన మిత్రుడు రామయ్యను చూడు. వాతావరణం అనుకూలించక వ్యవసాయంలో చాలా నష్టపోయి దయనీయ స్థితిలో ఉన్నాడు. అతణ్ణి ఎవరు పట్టించుకున్నారు. మూర్ఖుడు. అతనికి నా సలహా నచ్చలేదు." అన్నాడు వీరభద్రం. రాజుగారికి ఆవేశం కట్టలు తెంచుకుంది. మంత్రిగారు శాంతపరిచారు. రాజుగారికి తన తప్పు తెలిసి వచ్చింది. తన పథకం విజయవంతమైనందుకు మంత్రి సంతోషించారు.

కామెంట్‌లు