అందరికీ నమస్కారం, నేను మీ వయోలిన్ వాసు.
  నేను పదిహేను సంవత్సరాల క్రితం జోసెఫ్ మర్ఫీ వ్రాసిన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే ఒక పుస్తకం చదువుతూ , దానిలో ఉన్న విషయాలను, విశేషాలను అర్థం చేసుకుంటూ , నా మీద నేను పరీక్ష చేసుకోగా కలిగిన అనుభవాల సారాంశంగా వ్రాసినదే ఈ వ్యాసం. ఇది చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల దాకా అందరికీ సరిపోతుంది. చదవoడి. ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. 
ఒక వ్యక్తి పరీక్షహాలులో కూర్చుని పరీక్ష రాస్తున్నాడు. మధ్యలో ఒక ప్రశ్నకు సమాధానం గుర్తుకు రాలేదు. ఒక నిమిషం గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించి, రాకపోతే, ఆ తర్వాత ప్రశ్నలకు సమాధానం రాస్తున్నాడు. ఇంకొక కొంత సేపటిలో పరీక్షా సమయం అయిపోతుందనగా, తనకు కావల్సిన ప్రశ్నకు సమాధానం తళుక్కున గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ ప్రశ్నకు సమాధానం వ్రాసి బయట పడ్డాడు, అది సివిల్స్ సర్వీసెస్ పరీక్ష. రిజల్టులో దేశంలోనే మొదటిస్థానంలో నిలచి ఎంతో మందికి స్పూర్తినిచ్చాడు. ఇదంతా ఆ చివర వ్రాసిన ప్రశ్న వల్లనే అంటే.. అతిశయోక్తి కాదేమో!
ఇదంతా ప్రతి మనిషి జీవితం లోనూ ఏదో ఒకసారి జరిగేదే, కానీ ఎవరైనా ఇది ఎలా జరిగింది, దేని వలన మనం మరిచిపోయిన ఆ ప్రశ్నకు సమాధానం వ్రాయగలిగాము అని ఆలోచించారా? ఒకసారి ఆ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే..మనిషికి చేతన, అచేతనావస్థలు అని రెండే ఉంటాయని అందరికీ తెలుసు. చేతనావస్థ అంటే మన ప్రమేయంలో మనకి తెలిసి పని చేయగలిగే స్థితి. అచేతన అవస్థ అంటే నిద్రపోయేటప్పుడు, సృహ కోల్పోయినప్పుడు, కోమాలోకి వెళ్ళినప్పుడు, ఏ పని చేయలేని స్థితి. ఇప్పుడు ఈ రెండింటినీ పరీక్ష సంఘటనకు అన్వయిస్తే..
మనం పరీక్ష రాస్తున్నప్పుడు చేతనావస్థలో ఉంటాం. ఒక ప్రశ్నకు సమాధానం గుర్తుకు రాలేదు. ఆ ప్రశ్న వదిలేసి వేరే ప్రశ్నకు సమాధానం రాస్తున్నాం. (చేతనావస్థ మనం వ్రాసే ప్రశ్న మీద పనిచేస్తుంది). అంటే మనము అచేతెనావస్థలో లేము (మనకి తెలిసి పరీక్ష రాస్తున్నాం కాబట్టి). మరి చేతనావస్థ తన పని తాను చేసుకుంటుండగా, అచేతనావస్థ ఏ పనీ చేయలేని సందర్భంలో మనకి రాని ఆ ప్రశ్నను వెతికి పట్టుకుని చేతనావస్థకు అందజేసింది ఎవరు? అదే "అతః చేతనావస్థ."
దీని ఉపయోగాలు:
అతఃచేతనావస్థ.. అదొక అనంతశక్తి;, గొప్ప సెర్చ్ ఇంజన్, విధేయమైన సేవకుడు. ఇలా చెప్తూ పోతే దాని లక్షణాలు అనేకం. దాన్నే మనం ‘ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటాము. ఏదో ఆలోచిస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాము, మనం తిరగాల్సిన సందులోకి మన ప్రమేయం లేకుండా బండి తిప్పేస్తాము. ఎంతో లీనమై సినిమా చూస్తూ ఉంటాము, ఉన్నట్టుండి ఏదో సత్వరమే చేయాల్సిన పని గుర్తుకు వస్తుంది. పొద్దున్నే లేవాలని అనుకుని పడుకుంటాము, ఆ సమయం దగ్గర పడే సరికి ఉలిక్కి పడి లేస్తుంటాము. ఇవన్నీ అతఃచేతనావస్థ లో చేసే పనులే. అసలు ఏమిటి ఈ అతః చేతనావస్థ, ఏమిటి దీని స్థితి, ఏమిటి దీని తత్వం, శక్తి, ఉపయోగాలు?
దీని స్థితి:
ఎప్పుడైతే మనిషికి చేతనాచేతనావస్థలు (కాన్షియస్, అన్ కాన్షియస్) కాకుండా ఉండే స్థితి ఉంటుందో, అదే అతః చేతనావస్థ (కాన్షియస్ స్టేట్). ఉదాహరణకి, ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోయేముందు వచ్చే మగతగా ఉండే స్థితి, అతః చేతనావస్థ. యోగాలో చెప్పబడే సమాది స్థితి. హిప్నాటిజంలో చెప్పే హిప్నాటైజ్డ్ స్టేట్ ఇవన్నీ అతఃచేతనావస్థకి సంబందించినవే. ఇలాంటి స్థితిలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా ఉత్తేజితంగా ఉండి సూచనలను తీసుకోవడానికి ఆ తర్వాత అమలుపరచడానికి సిద్ధంగా ఉంటుంది.
దీని తత్వం:
సబ్ కాన్షియస్ మైండ్ ఒక విధేయమైన సేవకుని వంటిది. మీరి ఏ పని చెప్తే ఆ పని చేసుకుపోతుంది. సామన్యంగా మనిషి కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఏదైనా పని చేయాల్సివస్తే కాన్షియస్ మైండ్ తర్కిస్తుంది. ఈ పని ఎందుకు చేయాలి, చేస్తే మంచిదా కాదా, ఎప్పుడు చేయాలి అని ఆలోచించి, నిర్ణయంచి పని ప్రారంభిస్తుంది. అన్ కాన్షియస్ స్టేట్లో నిర్ణయాలు తీసుకోబడవు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏ పని చెప్తే అంత బలంగా చేసుకుపోతుంది.
దీని శక్తి:
దీనికున్న శక్తి అమోఘం, అద్భుతం. చరిత్రలో చాలా విషయాలు సబ్ కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు కనిపెట్టినవే. న్యూటన్ ని తీస్కుంటే ఎన్నో ప్రయోగాలు చేతనావస్థలో చేసి సరదాగా చెట్టు కింద కూర్చున్నప్పుడు పండు క్రింద పడటం చూసి, గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. అలానే చాలామంది మేధావులు ఎన్నో ప్రయోగాలు చేసి వదిలేస్తే ఆ తర్వాత ఎప్పుడో సబ్ కాన్షియస్ మైండ్ తళుక్కున వాటి పరిష్కారాలు అందిస్తే వాటి ద్వారా ఎన్నో ఆవిష్కరణలు చేశాము. మనం ఏదో పనిలో ఉన్నప్పుడు అంతకు ముందు ఆలోచించిన సమస్య యొక్క పరిష్కారాలను తళుక్కున తెలిపేదే ఈ సబ్ కాన్షియస్ మైండ్. చరిత్రలో సబ్ కాన్షియస్ మైండ్ కి సంకేతాలు పంపడం ద్వారా మత్తుమందు లేకుండా, నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేసిన సందర్భాలున్నాయి. హిప్నాటిజం వంటి పద్ధతులన్నీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇచ్చే సూచనలే. మనల్ని ఏ ఆలోచనా లేని స్థితికి తీసుకు వెళ్ళి అక్కడ మనకు ఉపయోగపడే, కావాల్సిన సంకేతాలిచ్చి జీవన విధానం మెరుగుపడేలా చేస్తారు. ఏ ఆలోచనాలేని స్థితిలోనే కదా, క్రొత్త ఆలోచనలు తీసుకుని అమలు చేయడానికి అవకాశం ఉండేది. అదే విధంగా యోగాలో కూడా మనిషి ధ్యానం చేస్తున్నప్పుడు అన్ని ఆలోచనలూ పోయి ఒకానొక స్థితిలో నిశ్చల స్థితికి చేరుకుంటాడు. దాన్నే సమాదిస్థితి అంటారు. అదే సబ్ కాన్షియస్ స్టేట్ పూర్వం ఋషులు తపస్సు ద్వారా గాఢమైన సబ్ కాన్షియస్ స్టేట్ కి చేరుకుని దానికి సంకేతాలివ్వడం ద్వారా ఎక్కడికైనా వెళ్ళగల్గిన స్థితిని, వాక్ శుద్దిని సంపాదించారని చదువుకున్నాం. ఈ విధంగా మనిషి కోరుకున్న దాన్ని సాధించుకునేందుకు శాస్త్రపరంగా ఉపయోగించిన వస్తువే ఈ సబ్ కాన్షియస్ మైండ్, దీని శక్తి అమోఘం. ప్రపంచంలో ఎలాంటి పనైనా గానీ దాని దోవలో అది చేసుకుపోతుంది.దీనికున్న శక్తి ద్వారా, దీని ఉపయోగాలు కూడ అంచనా వేయవచ్చు. చెడు అలవాట్ల నుండి, ఫోబియాలనుండి బయటకు చేరుకోవటానికి, లక్ష్యాలను చేరుకోవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది తాగుడు, సిగరెట్లు, పాన్ మసాలాలకు అలవాటు పడిపోతారు. కొంతమందికి స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం, కొంతమందికి నీరంటే మరికొంతమందికి నిప్పంటే భయం. కొంతమంది ఏం చెప్పినా దాని వల్ల వచ్చే నష్టాలను గురించే ఆలోచించి భయపడుతుంటారు. కొంతమంది పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని, కొంతమంది మంచి ఉద్యోగం సంపాదించాలని, ఇలా ప్రతి ఒక్కరికీ ఎదో ఒక లక్ష్యం, ఎదో ఒక భయం, ఎదో ఒక వ్యసనం ఉంటూనే ఉంటాయి. వీటన్నింటినీ సబ్ కాన్షియస్ స్థితిలో సబ్ కాన్షియస్ మైండ్ కి పదే పదే సూచనలివ్వడం ద్వారా అదిగమించవచ్చు. ఇలా దీని ఉపయోగాలు అనేకం. దేనికైన దీనిని అన్వయించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.
దీన్ని ఉపయోగించే విధానం:
ఇదే అన్నింటి కంటే ముఖ్యమైన విషయం. దీన్ని ఉపయోగించే విధం తెలుసుకునే ముందు, అసలు శాస్త్రపరంగా సబ్ కాన్షియస్ మైండ్ పని చేసే విధానం గురించి తెలుసుకోవాలి. సబ్ కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇచ్చే సంకేతాల్ని సూచనల్ని సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుని పనిచేసుకుపోతూ ఉంటుంది. మీరిచ్చే సంకేతాలు మంచివైనా, చెడ్డవైనా, చిన్నవైనా, పెద్దవైనా వాటిని అమలుపరుస్తుంది. మీ ఆలోచనలు మంచివైతే ఫలితం మంచిగా, చెడ్డవైతే చెడుగా ఉంటుంది. ముఖ్యంగా మీరిచ్చే సంకేతాలు వాస్తవానికి దగ్గరగా నిజజీవితంలో సాధ్యమయ్యేదిగా ఉండాలి. ఉదాహరణకి ఒక పరీక్షలో పస్ట్ రావాలనుకోవడం, కలెక్టరో, ఇంజనీరో లేక దేశానికి ప్రధానమంత్రి కావాలనుకోవడం అన్నీ నిజజీవితంలో జరగడానికి అవకాశం ఉన్నవే. కానీ, పక్షిలాగా ఎగరాలునుకోవడం, చెట్టులాగా మారిపోవాలనుకోవడం ఇవన్నీ వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలు. కాబట్టి మనం ఇచ్చే సూచనలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. సూచనల్ని మంచివై ఉంటే మంచిది. అంటే ఎవడిమీదో కక్ష తీర్చుకోవాలని, దొంగతనాలు దొమ్మీలు చేయాలని, బాంబులు పెట్టాలని లాంటి ఆలోచనలు, సూచనలు ఇవ్వడంద్వారా ముందు మనలో వ్యతిరేక భావనలు పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే దిగజారిపోయే అవకాశం ఉంది. కాబట్టీ సానుకూల భావనలు పెంపొందొంచే విధంగా సమాజానికి, మనకీ ఉపయోగపడేలా మన సూచనలు ఉంటే తద్వారా వచ్చే ఫలితం ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. మనం కోరుకున్న పనిని అనుసరించి దాన్ని సాధించడానికి మనం చేసే శ్రమను బట్టి సబ్ కాన్షియస్ మైండ్ తన ఫలితాల్ని అందిస్తుంది. మీరు పరీక్షలో ర్యాంక్ సంపాదించాలని మీరు రోజూ సూచనలిస్తూ మీరు మాత్రం చదవకుండా సినిమాలకి తిరిగితే మాత్రం ఫలితం శూన్యమే! పరీక్షలో ఫలితం ఒక సంవత్సరంలో తెలిస్తే , కలెక్టర్ అవ్వాలంటే ఆ ఫలితం రావడానికి కొన్నేళ్ళు పట్టవచ్చు. మనం కోరిన కోర్కెను బట్టి ఇచ్చిన సూచనల్నీ బట్టి, సబ్ కాన్షియస్ మైండ్ ఫలితాల్నిస్తుంది. ఫలితం వచ్చేదాకా మీరు మాత్రం సుచనలిస్తూనే ఉండాలి, దానికి తగ్గ పరిశ్రమ, కృషి చేయాలి. మధ్యలో ఎక్కడ ఆపినా ఆ పని పూర్తి అవదు.
సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు సూచనలు ఎప్పుడైనా, ఎక్కడైనా ఇవ్వవచ్చు. కానీ సబ్ కాన్షియస్ స్టేట్ లో ఇచ్చిన సంకేతాలు సబ్ కాన్షియస్ మైండ్ లో బాగా రికార్డ్ అయి పని తొందరగా జరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే, రాత్రి నిద్రపోయేముందు వచ్చే మగత సమయంలో కనుక మీరు మీ సూచనలను క్రమం తప్పకుండా ఇచ్చినట్లైతే అద్భితమైన ఫలితాలు కనిపిస్తాయి.సమాజంలో ప్రతిపని వెనుకా, సబ్ కాన్షియస్ మైండ్ హస్తం ఉంటుంది. బాంబ్ పేలిన, బంద్ జరిగినా, హత్యల్లాంటి వ్యతిరేక సంఘటనలూ, శాంతి సదస్సులు, ఒలింపిక్ పతకాలు, లాభాలు వంటి సానుకూల ఘటనలూ, బస్సులో సీటు దగ్గర నుండి నోబెల్ బహుమతి వరకు వచ్చే ఫలితాలన్నింటికీ, సబ్ కాన్షియస్ మైండ్ లో వాటి తాలూకూ భావనలు బలంగా ముద్రించుకుపోవడమే కారణం. కాబట్టి సమాజం సుఖశాంతులతో ఉండాలన్నా, ప్రతి మనిషీ తన మనసులోని వ్యతిరేక భావనలను తీసి సానుకూల భావనలను నింపుకోవాలన్న, వ్యక్తి, సమాజాభివృద్ది జరగాలన్నా, సబ్ కాన్షియస్ పవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతా మనవారే, అంతా మంచికే జరుగుతుంది అనుకోవడం ద్వారా వ్యతిరేక భావనలు తొలగించవచ్చు. ఈ విధంగా మనిషికి, సమాజానికి కావాలిసిన సానుకూల సూచనలన్నింటినీ " సబ్ కాన్షియస్ ప్రేయర్ "లేక ప్రార్థన గా మీకందిస్తున్నాను. ఉదయం లేవగానే మీ యొక్క లక్ష్యాలతోపాటు ఈ ప్రార్థన ని కూడా ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్ కి పంపించి చూడండి. తేడా మీరే గమనిస్తారు. అద్భుతాలు సాధిస్తారు.
 " సబ్ కాన్షియస్ ప్రేయర్ " 
నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. విద్య, వినయం, ఆరోగ్యం, సంపదలతో సంతోషంగా ఉన్నాను. ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కావాల్సిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. ఇప్పటివరకూ చాలా సాధించాను, ముంది చాలా సాధించబోతున్నాను, సాధిస్తాను. నేను అన్ని పనులూ సమర్థవంతంగా చేయగలను. నా మనస్సులో నా అభివృద్దికై వచ్చే ప్రతి సత్సంకల్పమూ కార్యరూపం దాల్చుతుంది. వాటి ఫలాలు త్వరలోనే నా ముందుకు వస్తాయి. ఒక కొడుకుగా, విద్యార్థిగా, అన్నిటికీ మించి ఒక వ్యక్తిగా పరిపూర్ణత సాధిస్తాను. అందరూ నాతో మంచిగా వ్యవహరిస్తారు. నేనుకూడా అందరితో మర్యాదగా వ్యవహరిస్తాను. సమాజం నాకు అన్ని విధాలా సహకరిస్తుంది. కష్టాలన్నీ, నష్టాలన్నీ అవలీలగా అధిగమించి అత్యున్నత శిఖరాలనధిరోహించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా జనుల హృదయాలలో చోటు సంపాదిస్తాను. ఆ శక్తి నాలో ఉంది. నేను చేసే ప్రతీ పని ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతుంది. ప్రపంచంలోని అన్ని విషయాలను నేను ఆనందిస్తాను. అన్ని పనుల్నీ అనుకున్న దానికంటే ముందే పూర్తిచేస్తాను. దానికి తగిన శ్రమ చేస్తాను. అలా అని నేను గర్వాంధుడను కాను. వినయం భూషణంగా వ్యవహరిస్తాను. భగవంతుని ఆశీస్సులు నాతోనే ఉన్నాయి. నా యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి ఉన్న అద్వితీయ శక్తి ద్వారా అద్భుతాలు సాధిస్తాను, సాధిస్తాను, సాధిస్తాను. ప్రపంచశాంతికి నా వంతు సహాయం చేస్తాను. ఇది నిజం.
ఓం శాంతి,శాంతి,శాంతిః
మీ వయోలిన్ వాసు

కామెంట్‌లు