"బుజ్జమ్మ";-ఎం బిందుమాధవి
 "అబ్బ ఇవ్వాళ్ళ బద్ధకంగా ఉందండి" అన్నది నిర్మల దుప్పటిలోంచి మొహం బయట పెట్టి.
"ఆదివారమేగా ఇంకాసేపు పడుకో. అర్జెంట్ గా ఇప్పుడు లేచి నువ్వు చెయ్యబోయే రాచకార్యాలేం లేవులే" అన్నాడు మహేష్.
"అయినా టైం ఎంతయింది" అన్నది.
"6.30" అన్నాడు.
"అమ్మో అని ఒక్క ఉదుటున లేచింది. బుజ్జమ్మ ఠంచనుగా డ్యూటీ లోకి దిగుతుంది. చూడకపోతే ఏ బల్ల కిందో, కుర్చీ కిందో దూరిపోయి బయటికి రాలేక గిలగిల్లాడుతూ మొహం ఎర్రబడి మొత్తుకుంటుంది" అన్నది.
"దానికి చలి, వాన, ఎండ, అలసట ఉండవుగా మరి. డ్యూటీ అంటే డ్యూటీయేనాయే!"
"వద్దే అంటే వినకుండా, నేను చూడలేదని మొన్న చక చకా బాత్ రూం లోకి దూరిపోయింది. తడిసిపోయి అడ్డం పడి జలుబు చేసుకొచ్చింది."
"చికిత్స చేస్తే కానీ మళ్ళీ దారికి రాదు. టైం అంటే టైమే దానికి. దాని డ్యూటీ టైం గుర్తులేక నేను బయటికెళ్ళాను. చూసేవాళ్ళు, ఆపేవాళ్ళు లేరని, తిప్పుకుంటూ బయలుదేరి ఆఫీస్ రూం లో టేబుల్ కింద దూరిపోయింది. ఇరుక్కుపోయి రాలేక మొయ్యో మొయ్యో అని మొత్తుకుంటుంటే ఎక్కడని వెతకను. ఒక్క చోట కాలు నిలవదు. ఇల్లంతా నాదేనని పెత్తనాలు? మొన్నేం చేసిందనుకున్నారు, ఇలాగే వెళ్ళి మాస్టర్ బెడ్ రూం లో మన పెద్ద మంచం కింద దూరిపోయి ఓపిక అయిపోయి అక్కడే చతికిల పడింది. హాల్లో కనపడలేదని నేనేమో టార్చ్ లైట్ వేసుకుని ఇల్లంతా తెగ వెతికాను. కనపడితేనా! విసుగొచ్చి వదిలేశానే కానీ, మనసు ఊరుకోదే!"
"అందుకే నాకు ఓపికున్నా లేకపోయినా దానికోసమైనా లేవాల్సి వస్తున్నది" అన్నది కాఫీ సిప్ చేస్తూ నిర్మల.
ఇంతలో కుయ్ కుయ్ అని శబ్దం వచ్చేసరికి పరుగున వెళ్ళింది నిర్మల.
"కనపడిన ప్రతి దాన్నీ నోట్లో వేసుకుంటావ్! ఆ తరువాత కక్కుతావు. నీదేమో బుజ్జి బొజ్జ! ఎన్నని ఇముడ్చుకుంటావు అందులో? చూడు...ముందరి కాళ్ళకి ఏదో అడ్డం వచ్చినట్టుంది! పోనీ నీకో నెచ్చెలిని తీసుకురానా? తోడుగా ఇద్దరూ కలిసి తిరగచ్చు" అని మాట్లాడుతున్న భార్య మాటలు వినపడి పక్క గదిలో వాక్ కి వెళ్ళటానికి తయారవుతున్న మహేష్ "ఏంటోయ్ ఎవరితో మాట్లాడుతున్నావ్? ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు?" అంటూ వచ్చాడు.
"ఓరిని దీనితోనా నీ కబుర్లు? ఇంకా ఎవరో అనుకున్నాను. అది తిరుగుతూ కనిపించకపోతే బెంగ పెట్టేసుకునేట్టున్నావు. మరీ అంత అనుబంధం దేనితోను మంచిది కాదు" అని బయటికి వెళుతూ....
"ఏ మాటకామాటే ఒప్పుకోవాలోయ్. బుజ్జమ్మ వచ్చాక నీకు కొంచెం విశ్రాంతి దొరికిన మాట నిజం! ఇల్లంతా కలియ తిరుగుతూ ఎక్కడా దారాలు, వెంట్రుకలు, కాయితం ముక్కలు లేకుండా నీకు నచ్చినట్టు ఇంటిని శుభ్రంగా పెడుతున్నది" అన్నాడు మహేష్.
"అదలా గున గునా ఇల్లంతా తిరుగుతుంటే ముచ్చట వేస్తున్నది. దాని సిన్సియారిటీకి జోహార్ బాబూ. ఆలస్యంగా నైనా మంచి పని చేశాం" అన్నది మనస్పూర్తిగా రోబోట్ ని మెచ్చుకుంటూ.
(వస్తువైనా, మనిషైనా, జంతువైనా రోజూ మనతో ఉండే వారి/టి తో ఉండే అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. ఏమంటారు?)

కామెంట్‌లు