బంగారు పంజరం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
      శ్రీనాథ తన భార్యా పిల్లలతో సెలవుల్లో తన అన్నయ్య రంగనాథ ఇంటికి వచ్చాడు. శ్రీనాథ పిల్లలు వరుణ్, వాశిష్టిలు, రంగనాథ పిల్లలు రోహిత్, రేవతీలతో ఆడుకుందామని అడిగారు. ఇద్దరూ మొబైల్ ఫోన్లతో గంటల తరబడి కాలక్షేపం చేస్తూ తీరిక లేకుండా ఉన్నారు. "మీరూ మీ అమ్మా నాన్నలను సెల్ ఫోన్ అడిగి ఆడుకోవచ్చు కదా!" అని ఉచిత సలహా ఇచ్చారు. వరుణ్ వాశిష్టిలు అక్కడే ఉన్న నాయనమ్మను చేరి, "నాయనమ్మా! కథలు చెప్పవా?" అన్నారు. "నాకు ఎక్కడ కుదురుతుంది? ఉదయం నుంచి రాత్రి దాకా టి.వి. సీరియల్స్. ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఆ కథ ఎవరు చెబుతారు? అన్నది నాయనమ్మ. పాపం! ఆ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు వాళ్ళతో వాళ్ళే ఆడుకున్నారు.
       ఒకరోజు రంగనాథ, శ్రీనాథ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళారు. అక్కడ పంజరంలో రామచిలుక పిల్లలను ఆకర్షించింది. "నాన్నా! మనమూ పంజరంలో రామచిలుకను పెంచుదాం." అన్నాడు వరుణ్. అప్పుడు రంగనాథ "తప్పుగా! చిలకలను జైళ్ళ లాంటి పంజరాల్లో ఉంచవద్దు. స్వేచ్ఛగా వాళ్ళ అమ్మా నాన్నలతో ఉండనివ్వాలి." అన్నాడు. "చాలా గొప్పగా చెప్పావు. అయితే మీ ఇంట్లో కూడా బంగారు పంజరాల్లో చిలుకలు ఉన్నాయి కదా!" అన్నాడు శ్రీనాథ. "ఎక్కడ చూశావు?" అన్నాడు రంగనాథ. "మీ ఇంట్లో వాళ్ళే ఆ రామచిలుకలు. పిల్లలు బాల్యంలో కరవు తీరా ఆటలు ఆడుతూ ఉండాలి. వాళ్ళకు పెద్ద వాళ్ళ నుంచి కాలక్షేపం కావాలి. బాల్యం ఒక వరం కావాలి. కానీ ఆటపాటల బాల్యాన్ని"సెల్" ఫోన్లలో బందీ చేస్తున్నాం. పిల్లలతో గడపాల్సిన పెద్దలు టి.వి. సీరియల్స్ అనే కఠిన కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. పిల్లలకు మంచీ చెడూ చెప్పేది ఎవరు? వాళ్ళ భవిష్యత్తు ఎటు పోతుందో ఆలోచించు." అన్నాడు శ్రీనాథ. రంగనాథకు కనువిప్పు కలిగింది. తన పిల్లలను బంగారు పంజరం నుంచి విడిపించాలని అనుకున్నాడు.   

కామెంట్‌లు