"పరిమిత నీటి వనరుల గురించి, కలుషితమవుతున్న జల వనరుల గురించి, మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, భూగర్భ జలాల పునరుత్పత్తి గురించి భరత్ చాలా మంచి విషయాలు తెలియచేశాడు. ఇప్పుడు వికాస్ కొత్త రకం వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడతాడు" అని విద్యార్ధి సలహాదారు పురుషోత్తం సర్ ప్రకటించారు.
వికాస్ వేదిక మీదికి వచ్చి "పెద్దలందరికీ నమస్కారం. నా తోటి విద్యార్ధులందరికీ శుభాకాంక్షలు. ప్రాణాధారమైన జలవనరులగురించి నేడు ముచ్చటించుకోవటం చాలా అవసరం! ఎందుకంటే పర్యావరణ కాలుష్యం వల్ల ఒక సంవత్సరం అతి వృష్టి, మరొక సారి అనావృష్టి వచ్చి ప్రజలకి చాలా ఇబ్బంది, నష్టం కలుగుతున్నది".
"నీటి వాడకంలో సింహ భాగం వ్యవసాయ అవసరాలకి ఉపయోగిస్తారు. సంప్రదాయ వ్యవసాయంలో నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షపాతం ప్రతి సంవత్సరం ఒకే పద్ధతిలో ఉండక, దాని ప్రభావం వ్యవసాయం మీద పడుతున్నది. ఇంతా చేసి పండించినా, పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు వచ్చి ధాన్యం కొట్టుకుపోవటం కానీ, మొలకలు రావటం కానీ జరిగి రైతు నష్టపోతున్నాడు."
"ఈ నేపధ్యం లో శాస్త్రవేత్తలు, తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలని, తక్కువ నీటిని ఉపయోగించే వ్యవసాయ పద్ధతులని కనుక్కుంటున్నారు. ఇందాక మన భరత్ చెప్పినట్లు ఎడారి ప్రాంతాలు, తక్కువ వర్షపాతం ఉండే ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో "బిందు సేద్యం" ప్రధానమైనది. అలాగే "హైడ్రో పోనిక్" వ్యవసాయం కూడా ఇప్పుడిప్పుడే ప్రాధాన్యతని సంతరించుకుంటున్నది. నగరాల్లో మురుగు నీటి కాలవల పక్కన కూరగాయలు పండించటం కూడా ఈ మధ్య ఎక్కువగానే చూస్తున్నాము."
"రాను రాను జనాభా పెరుగుదల వల్ల, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి వారంతా నగరాలకి వలస వెళుతున్నారు. అలా వచ్చిన వారందరికీ నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల అవసరాలు పెరగటం వల్ల వ్యవసాయ భూమి తగ్గిపోతున్నది. అటు నీటి సమస్య, ఇటు వ్యవసాయ భూమి క్రమేణా తగ్గిపోవటం వల్ల కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులని అనుసరిస్తున్నారు."
"ఆ పరిణామమే ఈ "హైడ్రోపోనిక్" వ్యవసాయం. ఈ తరహా పంటలకి అసలు మట్టి అక్కరలేదు. ఇందులో నీరు తక్కువగా ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించచ్చు. ఉన్న నీటినే పునరుపయోగిస్తూ, నీటిలో ఎల్లప్పుడూ పోషకాలుండేట్లు చూసుకుంటారు."
"ఈ విధానంలో మొక్కలు పెంచే ట్రేలుఏర్పాటు చేసి, ఆ ట్రేకి అడుగు దూరంలో చిన్న చిన్న కప్పులు ఉండేలాగా చిల్లులు చేసి (బొమ్మలో చూపినట్లుగా), అందులో మొక్కలు వేసి, వేళ్ళు క్రిందికి వ్రేలాడుతూ పోషకాలు సరఫరా అయ్యే నీటిలో ఎల్లప్పుడూ మునిగి ఉండే ఏర్పాటు చేస్తారు. ఈ నీరు నిరంతరం క్రింది నించి పైకి పైపు ద్వారా సైకిల్ అవుతూ ఉంటుంది. అలా చెయ్యటం వల్ల పోషకాలు ఎప్పటికప్పుడు మొక్కల వేళ్ళకి సరఫరా అవుతూ ఉంటాయి. ఈ పద్ధతిలో తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలని పెంచుతూ, చాలా మంది జనాభాకికావలసిన కూరగాయలు, తృణ ధాన్యాలు పండిస్తున్నారు."
"జపాన్ లో ఈ పద్ధతిలో రెండు భవనాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో కూడా కూరగాయలు పండిస్తున్నారు. అది చాలా జనాదరణ పొందింది."
"చైనా వారు సముద్ర ఉపరితలం మీద ఈ రకమైన మొక్కలు పెంచే పెద్ద పెద్ద వేదికలు నిర్మించి, వాటి మీద ట్రేలు ఏర్పాటు చేసి భారీ ఎత్తున వరి, తృణ ధాన్యాలు పండిస్తున్నారు. పోషకాలతో ఉండే నీటి సరఫరా పైపుల్లోకి సముద్రపు నీరు పోకుండా బిరడాలు బిగించి జాగ్రత్త పడుతున్నారు."
"నగర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో, మిద్దెల మీద, బాల్కనీల్లో ఇలాంటి "హైడ్రో పోనిక్"వ్యవసాయం తో ఇంటికి కావలసిన కూరగాయలు, ఆకు కూరలు పండిస్తున్నారు."
"ఇజ్రాయిల్ లో ఇలాంటి వ్యవసాయానికి "డి శాలినేటెడ్" నీటిని ఉపయోగిస్తున్నారు. ఈ రకం వ్యవసాయ పద్ధతుల్లో ఆధునికత నిండిన ఉజ్వల భవిష్యత్తుని చూడచ్చు" అని వికాస్ తన ప్రసంగాన్ని ముగించాడు.
కొత్త విషయాలని ఆసక్తికరంగా వినిపించిన వికాస్ ప్రసంగంతో విద్యార్ధులంతా ఉత్తేజితులయి, "మనం కూడా మన మిద్దెల మీద ఇలాంటి వ్యవసాయం చేసే ప్రయత్నం మొదలుపెడదాము. అవసరమైన విషయాల్లో ఉద్యానవన శాఖ వారి సహాయం తీసుకోవచ్చు" అనుకున్నారు.
"వ్యవసాయంలో కొత్త పుంతలు";- ఎం . బిందు మాధవి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి