కెరటం లఘు కవిత;- ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 ధవళ వర్ణశోభితమై 
అట్టహాసంగా ఉరుకుతూ వచ్చి 
దారిలో మరిన్ని కెరటాలను అందుకుంటూ 
హోరున విజృంభించి, 
చెలియలికట్ట చేరగానే విశ్రాంతి 
పొందే కెరటం... 
మరో అలగా వెనువెంటనే తయారు !
పడ్డానని క్రుంగుబాటు లేదు 
ఎన్నాళ్లిలా అనే విసుగు లేదు 
అదొక జలధి లక్షణమనీ 
నిరంతరప్రక్రియ నిత్యఉత్తేజమని 
కెరటాలకు తెలుసు... 
తానే ఎందరికో స్ఫూర్తి ఆదర్శం అనీ.. !!
మహిళా చేతన,విద్యార్థి సాధన 
  కృషీవలుని శ్రమ,గురువు అంకిత భావన,
కుల వృత్తి నిర్మాణం,యోగి అన్వేషణ అన్నీ... 
కెరటాలు అంతర్గత సూత్రంగా 
సాగే మౌన పోరాటం!!


కామెంట్‌లు