*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౨౫ - 025)
 కందం:
*ఇలుఁగలఁదె పరివ్రాజకుఁ?*  *డెలమించుట ఎట్లు వేశ్య యీనివిటునెడన్?*
 *గులకాంత విత్తమడుగునె?*
*కొలదిఁగలదె రంకులాడి గువ్వలచెన్నా!*
తా.: 
మనుషులు నడిచే ఈ భూమి మీద, కాళ్ళకు చక్రాలు కట్టుకుని ఊరూరూ తిరిగే వానికి ఒక ఇల్లు వుండదు.  డబ్బులు ఇవ్వని విటుని మీద వేశ్యకు ప్రేమ వుండదు.  వయ్యారాలు పోతూ పదిమందిని ఆకర్షించాలి అనుజునే స్త్రీ కి  హద్దులు వుండవు.  కానీ, సంసార పక్షము గా వుండే స్త్రీ, డబ్బులు అడుగదు, విపరీతమైన ఆశలు వుండవు ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మన మనసు అనే స్త్రీ, తనకు అవకాశం వున్నంత వరకు, వేరు వేరు ప్రదేశాలు తిరుగుతూ, లక్షలు కోట్లలో కోరికల సమూహాన్ని పెంచుకుంటూ, ఒక విషయం మీద స్థిర చిత్తముతో వుండకుండా వుంటుంది.  వెలయాలి లాగా, పరివ్రాజకుని లాగా.  కానీ, తన చిత్త చాంచల్యాన్ని తగ్గించుకుని, ఒక స్వచ్ఛమైన సంసార పక్షమైన స్త్రీ లాగా, తనని తాను, అందరకూ భర్త అయిన ఆ పరాత్పరునకు సమర్పించు కోలేక పోతోంది.  తను ఏకాగ్ర చిత్తంతో, పరమేశ్వర ధ్యానము చేస్తూ,  పరాత్పరునిలో లీనమయ్యే మార్గన్వేషణ చిత్త శుద్ధితో చేస్తే... ఆ సర్వేశ్వరుడు తనంత తానుగా మనల్ని వెతుక్కుంటూ వచ్చి, తప్పక ఉద్ధరిస్తాడు. ఉత్తమమైన ఊర్ధ్వలోకాలు కల్పిస్తాడు.  కావలసింది, మనం చేయ వలసిందల్లా, ఆ సర్వ వ్యాపకుని పాదాలు వదలకుండా పట్టుకుని వుండడం.  అటువంటి శక్తిని మనకు ప్రసాదించమని ఆ శక్తినే వేడుకుందాము.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు