*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౩౮ - 038)
 కందం:
*అతి చనువిచ్చి మెలంగఁగ*  
*సుతసతులైన నిరసించి చులకనచేతుర్*
*మతమెరిఁగి చరింపందగుఁ*
*గుతుకముతో మనుజుఁడెపుడు గువ్వలచెన్నా!*
తా.: 
ఈ భూమి మీద మగవాడు పెళ్ళి చేసుకుని తన భార్యా, పిల్లలను అతిగా ప్రేమతో చూడటం చేస్తే, వారు ఆ ప్రేమను చులకనగా తీసుకుని ఆ మగవానిని నిర్లక్ష్యం చేస్తారు. అందువల్ల, భార్యా పిల్లలైన వేరే ఎవరైనా  వారి ప్రవర్తన, నైజం తెలుసుకుని నడుచుకోవాలి....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మనం ఎప్పడైతే ఈ బాహ్య ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ వుంచి భార్యా, పిల్లలు, స్నేహితులు, ఆత్మీయులు అంటూ అందరినీ "నా బొందో" అనుకుంటూ  అతి ప్రేమ, మమకారం చూపించినా మనం చులకనగా చూడబడతాము.  కానీ, మన ప్రయాణం భక్తి మార్గంలో అయితే ఎవరు ఎలా చూచినా మనకు ఏ ఇబ్బంది వుండదు. మనకు ఎటువంటి వికారమూ కలుగదు. కనుక, ఐహికాన్ని వదలి పారమార్థిక మార్గంలో ప్రయాణం చేసేటట్టు నీలకంఠుడు అనుగ్రహించాలని, అలా మనల్ని తనలో కలుపుకోవాలని కామితార్థ దాయకుడిని వేడుకుంటూ....*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు