టీఎంఎస్ ముచ్చట్లు - 1; - జగదీశ్ యామిజాల
 నాకెంతో ఇష్టమైన తమిళ నేపథ్య గాయకుడు టిఎంఎస్ గా ప్రసిద్ధి చెందిన టి.ఎం. సౌందరరాజన్. తమిళ హీరోలలో ముఖ్యంగా ఎంజిఆర్, శివాజీ గణేశన్ లకు టిఎంఎస్ పాడిన పాటలన్నీ ఇప్పటికీ వింటుంటే మనసుకెంతో హాయిగా అన్పిస్తుంటాయి. నాలుగు తరాలకు తన గాత్ర మాధుర్యాన్నందించిన టీఎమ్మెస్ తమిళ భాష ఉచ్చారణకోసమే పుట్టారా అన్పిస్తుంది. అటువంటి టిఎమ్మెస్ గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం....
1. టి.ఎం.ఎస్....లో ఉన్న ఎస్ అంటే సౌందరరాజన్ఎం ! అంటే ఆయన తండ్రి మీనాక్షి అయ్యంగార్ ! టి అంటే ఆయన ఇంటి పేరైన థొగులువా ! గర్భం ధరించిన స్త్రీలకు పౌష్ఠికతకోసం పిండిని తయారు చేసే కుటుంబం వీరిది.
2  ఈయన పుట్టింది మదురైలో. ఆయనకు ఒక అక్కయ్య, ఒక అన్నయ్య ఉన్నారు. ఈయన తమ్ముడి పేరు కృష్ణమూర్తి అయ్యంగార్. ఈ తమ్ముడు మృదంగ విద్వాంసుడు.
3. ఎస్ఎస్ఎల్సీ చదువుకున్న టీఎంఎస్ ఆరవ తరగతి వరకు మదురై సెయింట్ మేరీస్ స్కూల్లో, తదుపరి చదువుసంధ్యలు సౌరాష్ట్రా స్కూల్లోనూ కొనసాగించారు.
4. టి.ఎం.ఎస్ అనే పొడి అక్షరాలకు ఆయన చెప్పుకున్న మాటలు. టి అంటే త్యాగరాజ భాగవతార్ (టి) అని, మదురై సోము (ఎం), కె.పి. సుందరాంబాళ్ (ఎస్) అని, ఈ ముగ్గురూ తనకు మానసిక గురువులని ఆయన చెప్పుకున్నారు. అలాగే టి అంటే త్యాగయ్య అని, ఎం అంటే ముత్తయ్య దీక్షితర్ అని, ఎస్ అంటే శ్యామా శాస్త్రి అని, ఈ ముగ్గురు ప్రముఖుల అనుగ్రహంతోనే తాను దీర్ఘకాలం పాడగలిగానని కూడా చెప్పుకునే వారు టిఎంఎస్. 
5. 1946లో విడుదలైన కృష్ణ విజయం అనే సినిమాలో నరసింహ పాత్రలో నటించిన నటుడికి ఈయన పాడిన పాట..."రాధే ఎన్నై విట్టు ఓడాదడి...."  ఈయన సినిమాలో పాడిన తొలి పాట ఇదే.
6. టిఎంఎస్ పాడిన తొలి పాట వెలువడింది కోవై సెంట్రల్ స్టూడియో. అరవై ఏళ్ళ తర్వాత ఇమయుత్తుడన్ అని తన జీవిత కథనాన్ని రూపొందించిన టీవీ సీరియల్ కోసం ఈయన అక్కడికెళ్ళి శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ నిల్చుని తన తొలి సినిమా పాడి తరించారు. ఈ అనుభవాన్ని చిరస్మరణీయమని చెప్పుకున్నారాయన. 
7. పేదరికంతో నానా కష్టాలు పడుతున్న రోజుల్లో టిఎంఎస్ అలనాటి నటుడు, గాయకుడు అయిన ఎం.కె.టి. భాగవతార్ దగ్గర సహాయకుడిగా చేరే అవకాశం వచ్చింది. భాగవతార్ లాగా తానే స్వయంగా ఏదో ఒకరోజు పేరుప్రఖ్యాతులు సంపాదించగలననే కచ్చితమైన నమ్మకంతోటి ఎంఎస్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. 
8. మదురై వరదరాజ పెరుమాళ్ ఆలయంలో పూజారిగా ఉండేవారు టిఎంఎస్ తండ్రి మీనాక్షి అయ్యంగార్. భజనలు చేసేవారు. 
9. టి.ఎం.ఎస్. కూడా మదురై వరదరాజ పెరుమాళ్ ఆలయంలో స్వామివారకి సేవలు చేసేవారు. ఆ ఆలయ మండపంలో "థెర్కు పెరుమాళ్ మేస్త్రీ తెరు ఇందీ ప్రచార సభ" అనే పేరిట ఒక హిందీ స్కూలుని ప్రారంభించి విద్యార్థులకు హిందీ నేర్పించేవారు టిఎంఎస్.
10. హిందీ నేర్పించడం తప్ప మరే ఉద్యోగమూ చేయని టిఎంఎస్ ఆలయ ఉత్సవాలలో భజనలు చేస్తూ వారిచ్చే అయిదు రూపాయలు, తమలపాకులు, పళ్ళతో జీవనం సాగించేవారు.
11. ఈయనకు హిందీ సరళంగా వచ్చు. మాట్లాడేవారు. చదివేవారు. ఆయనకిష్టమైన హిందీ నేపథ్యగాయకూడు మొహ్మద్ రఫీ. ఆయన పాడిన పాటలనే రఫీ దగ్గర పాడి వినిపించి ఆయన మెచ్చుకోలు పొందారు టిఎమ్మెస్. 
12. ఆయనకు మొట్టమొదటగా అవకాశం ఇచ్చిన దర్శకుడు సుందర్ లాల్ నడ్కర్ణి.
ఆయన దగ్గర ఎలాగైనా పాడే అవకిశం పొందాలనే ఆరాటంతో టిఎమ్మెస్ నడ్కర్ణి ఇంట పనిమనిషిగా చేరారు టీఎమ్మెస్.
13. తమిళంలో మాత్రమే పది వేలకు పైగా సినిమా పాటలు పాడిన టిఎమ్మెస్ తెలుగు, మలయాళం భాషలలోనూ కొన్ని పాటలు పాడారు. ఇక ఆయనే సంగీతం సమకూర్చుకుని పాడిన భక్తి పాటలు వేలల్లో ఉంటాయి.
14. ఈయన కుమారస్వామి భక్తుడు. వాటిలో కర్పనై ఎండ్రాళుం అనే పల్లవితో సాగే సుబ్రమణ్య స్వామిపై పాట ఇప్పటికీ తమిళనాడులో మార్మోగుతుంటుంది. 
- (సశేషం)
కామెంట్‌లు