స్వచ్ఛతా యంత్రాలు;- కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకుడు,చిట్యాల,నల్గొండ, 8555010108
అర్ధరాత్రి సూరీడై చీకటిపొర చీల్చుకుంటూ 
చేతిలో చీపురు చిన్నబుట్ట ఆయుధాలుగా 
నిద్రించే రాస్తాకి శుభోదయం పలుకుతూ
కానరాని క్రిములతో పోరాడే మున్సిపల్ సైన్యం
అపరిశుభ్ర చీకటి తరిమే అరుణోదయ కిరణాలు! 

చెత్త చెదారం పులుముకున్న గల్లీ వీధులు 
పడేసిన ప్లాస్టిక్ పాత సామానంత కుప్పగా పోసి 
పల్లె పట్నాన్ని పడుచు పిల్లలా ముస్తాబు చేసి
అంటురోగ మూలాలు చేధించే ఆరోగ్య జ్యోతులు 
కరుగుతున్న కొవ్వత్తులు పారిశుద్ధ్య కార్మికులు! 

రోడ్డంతా పరుచుకున్న దుమ్ము ధూళి దులిపి 
చీపురు కుంచెతో రంగద్ది అద్దములా మెరిపిస్తూ 
రోగం రొప్పీ వెంటాడినా సేవే పరమావధిగా 
జీతం తక్కువైనా జీవితం ఫణంగా పెట్టి 
వృత్తే దైవమని చాటే సఫాయి ఓ సిపాయి!

పిడికెడు గింజల కోసం రెక్కలు ముక్కలైనా
నిత్యం మురికి కాలువలో మునిగి తేలుతూ 
ముక్కు పుటల నిండా దుర్గంధం నింపుకుంటూ
బాధ్యతకు బరోసా నిచ్చే మార్గదర్శకులు 
స్వచ్ఛత చిరునామాగా నిలిచే సృజన శీలురు!

ఛీత్కారా లెదురైనా చెదరని మౌన మునులు
వారు విధి మరిచిన దినం నగరం కుళ్ళిన కళేబరం
కల్మషాలు కాల్చుకుంటూ ఊరంతా పరిమళాలద్ది 
మురికి శుద్ధి చేయు స్వచ్ఛతా యంత్రాలు వారు
పారిశుద్ధ్య శ్రామికులారా! శతకోటి వందనాలు!


కామెంట్‌లు