మకుటం లేని మహారాజు;-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకుడు,చిట్యాల, నల్గొండ,8555010108
మట్టిలో పుట్టి మట్టిలో కలిసే దాకా 
మట్టితో చెలిమి చేసే మకుటంలేని మహారాజు 
పల్లె తల్లిని పరవశింప చేసే భూమి పుత్రుడు
హల మాయుధంగా పొలం సాగులో యుద్ద సైనికుడు!

పుడమి తల్లిని ప్రేమతో ఆరాధిస్తూ 
వ్యవసాయ యజ్ఞంలో అతనో సమిధ 
అన్నార్తుల ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు 
అహరహం విరామ మెరుగని విశ్వరక్షకుడు! 

తిండీ తిప్పలు వదలి ప్రకృతితో మమేకమై
అలుపెరుగని నిత్య కృషీవలుడు 
నేలతల్లి కడుపులో పసిడి పండించి
మానవాళికి గోరు ముద్ద లందించే మట్టిమనిషి! 

కాలమెంత కన్నెర్ర చేసినా గుండె నిబ్బరంతో
సేద్యం వదలని అపర భగీరథుడు 
అతని పాదస్పర్శకు పులకరించే ధరణి
పొద్దంతా సూరీడుతో పోటీపడే శ్రమయోగి!

పంట చేతికొచ్చే దాకా ప్రాణాలు అరచేతిలోనే  
కంటికి రెప్పలా పంటకు కాపలా దారుడు
రోగం రొప్పీ మరిచి కష్టించే కర్మయోగి కర్షకుడు 
అన్నదాత కన్నీటి దారలు దేశప్రగతి నిరోధకాలు!

.


కామెంట్‌లు