|| పౌర్ణమి ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
చిక్కని చీకటి 
నును వెచ్చని పొలిమేరలు దాటాక
మరులు గొలుపనో, మరి
మైమరుపును కలిగించనో
పెదవి విరుపు సవరించనో
మగువ మనసు కరిగించనో

సొగసు వయ్యారాలు ఒలకబోసుకుంటూ
పృకృతి కాంత సంబురపడగా
వగలాడి వెన్నెల కులుకుతూ వచ్చింది
నాగేటి సాలులా నవ్వులు రువ్వుతూ

గాలితో సయ్యాటలాడాలనుందో
నీటి అలలతో నాట్యమాడాలనుందో
ఆకాశంతో పాట పాడాలనుందో
పరువపు సొగసులతో జలకాలు ఆడాలనుందో

ధూళి రేణువుల్లోను ధగధగలు ముఱియంగ
దూదిపింజలాగ మనసు తేలి, తేలియాడంగ
తళుకు బెళుకులతో కులుకుతూ వచ్చింది 
మరుమల్లెల గుభాళింపుతో గూడి మధుర జ్ఞాపకమై

మబ్బు తునకలన్ని మదిని గుచ్చుకొనగ
సముద్రమంత గాయాలను మోస్తూ
స్వాగతం పలుకుతోంది వెన్నెల 
నిండు మనసులకు సరితూగు పూర్ణబింబమై.. 

______


కామెంట్‌లు