అసలు కారణం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు.9348611445

   కందర్ప రాజ్య రాజుగారి గోశాలలో అనేక శేర్ల పాలు ఇచ్చే మంచి పుష్టికరమైన ఆవులు ఉండేవి.
ఆవుల పాలు అంతఃపురంలోని వారికి,సైన్యానికి సరఫరా చేయబడుతుండేవి.
      కానీ రాను రాను పాలు తక్కువ అయి అంతఃపురంలోనివారు,సైనికులు అనేక ఇబ్బందులకు గురి అవ్వసాగారు.గోవులకు పుష్టికరమైన దాణా ఇస్తున్నా పాల దిగుబడి ఎందుకు తక్కువ అయిందో  రాజు గారికి అర్థం కాలేదు!
     ఆయన వెంటనే గోశాలలో జరుగుతున్నదేమిటో పరిశీలించమని గూఢచారులను  ఆదేశించాడు.గూఢచారులు గోసంరక్షకుడైన గోవుల గోపన్నను రహస్యంగా పరిశీలించారు.గోవులు ఇచ్చిన పాలలో కొన్ని శేర్ల పాలను పక్క ఊరిలోని పాల పాపన్నకు అమ్మడం గమనించి,గోపన్న చేస్తున్న పనిని రాజుగారికి వివరించారు.
       వెంటనే గోపన్నను పిలిపించి," ఏరా గోపన్నా నీవు కొన్ని శేర్ల పాలను పాల పాపన్నకు అమ్మితే అమ్మావుకానీ,అంతే కొలతతో నీళ్ళు కలిపి మాకు అనుమానం రాకుండా ఎందుకు చూసుకో లేదు?" అడిగాడు రాజు.
      రాజుగారికి తన రహస్యం తెలిసి పోయిందని తెలిసి గోపన్న భయంతో ఈ విధంగా చెప్ఫాడు.
      "ఏలినవారు మన్నించాలి,అన్ని శేర్ల నీళ్ళే ఉంటే పాలను అమ్ముకునే వాడినికాదు,పోనీ అంతఃపురం లోని బావిలోని నీళ్ళు కలపాలంటే అక్కడ నిరంతరం తమరి మనుషులు ఉంటారు.మీరు ఇచ్చే జీతం కుటుంబ ఖర్చులకు నీళ్ళ ఖర్చులకు సరిపోవడం లేదు.నేను నగరం ఉత్తర దిక్కున ఉంటున్నాను.అక్కడ నీళ్ళ కరవు ఉంది,బిందె రెండు వరహాలు పెట్టి కొనాలి.అందుకే ఈ పాడు పని చేస్తున్నాను"తలవంచుకుని అసలు విషయం చెప్పాడు గోపన్న.
      గోపన్న కష్టాలు విన్న రాజుగారి కళ్ళు తెరుచుకున్నాయి.వెంటనే మంత్రిని పిలచి "మనం ప్రజల కనీస అవసరాలు తీర్చక పోతే ప్రజలు అడ్డ దారుల్లో ఆ అవసరాలు తీర్చుకుంటారు.మనం కనీస అవసరాలు తీరుస్తే ప్రజలు తమ శక్తిని,పని నైపుణ్యాలను తమ పనుల్లో చూపిస్తారు,లేకపోతే వాళ్ళ ఆలోచనల్లో సగం ఆ కనీస అవసరాలవైపే మళ్ళుతాయి.వెంటనే నగరంలో ఉత్తరం వైపున నీళ్ళ వసతులకు  దక్షిణాన ఉన్న నదినుండి ఉత్తర దిక్కుకు కలువ త్రవ్వించండి.కాలువ పనులు పూర్తి అయ్యేవరకు పెద్ద బానల్లో ఏనుగుల మీద నీళ్ళు సరఫరా చేయించండి."ఆజ్ఞ జారీ చేశాడు.
      " నేను చేసిన పనికి క్షమించండి మహారాజా" నమస్కారం పెట్టి చెప్పాడు గోపన్న.
     "నీవు చేసిన పనివలన ప్రజల అవసరాలను గుర్తించి తీర్చక పోతే ఏంజరుగుతుందో తెలిసింది,అందుకే ప్రజలకు కావలసిన అవసరాల మీద శోధించమని ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాను"నవ్వుతూ చెప్పాడు రాజు.
                  ********

కామెంట్‌లు