ఉప్పుకి కొరత;-కంచనపల్లి వేంకట కృష్ణారావు.9348611445

  మల్లవరంలో సుబ్బయ్య పేరు మోసిన వ్యాపారి. ఆఊరికి చుట్టు పక్కలనున్న పల్లెలకు కూడా కావలసిన నిత్యావసర సరుకులు  తన అంగట్లో అమ్ముతుంటాడు.సుబ్బయ్య వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నది. దానికి కారణం సుబ్బయ్య తెలివితేటలే. ఒకసారి పక్కపల్లెలో దూర ప్రాంతాన్నుండి వచ్చిన ఒక ఉప్పు వ్యాపారి అతి తక్కువ ధరకి ఉప్పును అమ్మతున్నట్లు సుబ్బయ్యకు తెలిసింది.
      సుబ్బయ్య ఆ వర్తకుడిని కలసి అతని వద్దనున్న అన్ని బస్తాలను కొనివేసి తన గోదాములో నింపించి వర్తకుడిని పంపివేశాడు.ఆ ఉప్పుని కొంచెం అధిక ధరకు సాధ్యమైనంత త్వరగా  అమ్మి లాభం సంపాదించాలని సుబ్బయ్య పథకం వేశాడు!
      వెంటనే తన నమ్మిన బంట్లను పిలచి ఉప్పుకి తీవ్రమైన కొరత రాబోతున్నదని ప్రచారం చేయించాడు.ఆ నమ్మిన బంట్లవలన కర్ణాకర్ణిగా ఊరంతా ఉప్పుకి కొరత విషయం పాకింది! వెంటనే జనం సాధ్యమైనంత ఉప్పుని సుబ్బయ్య నిర్ణయించిన ధరకే కొనుక్కున్నారు.వారం రోజుల్లో గోదాములో దాచిన ఉప్పు అయిపోయింది.ఆ ఉప్పు వ్యాపారం పై సుబ్బయ్యకు విపరీతమైన లాభం వచ్చింది.
       అంత లాభం వచ్చింది కనుక సుబ్బయ్య మంచి మనసుతో కొంత ధనాన్ని ఆ ఊరి పాఠశాలలో మరొక గది కట్టించాడు. సుబ్భయ్య డబ్బు సంపాదించడమే కాదు,ఊరికి ఉపయోగ పడే పనులుకూడా చేయసాగాడు.
         ఊరిలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
                    ***********

కామెంట్‌లు