గౌట్ కొన్ని విశేషాలు;- --కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  కొన్ని వ్యాధులు చాలా శరీర బాధలు కలుగ చేస్తాయి.అటువంటిదే గౌట్ వ్యాధి.తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీని నుండి ఉపశమనం పొందవచ్చు.
       మన శరీరంలో అనేక రసాయనిక చర్యలు జరుగుతుంటాయి.తద్వారా శరీరానికి పనికిరాని రసాయనాలు తయారవుతుంటాయి.వీటిలో చాలా మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంటాయి.
       మన శరీర జీవక్రియల్లో భాగంగా యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది.ఇది కూడా మూత్రపిండాలద్వారా విసర్జింపబడుతుంది.కొన్ని కారణాల వలన యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయి తగినంత విసర్జించబడకపోతే అవి రక్తంలో స్ఫటికాలుగా మారి రక్తప్రవాహంలో కలసి కీళ్ళలో పేర్కొంటాయి!  అందుకే గౌట్ వ్యాధి వచ్చిన వారిలో  కీళ్ళ వాపు,విపరీతమైన నొప్పి,బొటన వేళ్ళలో ఎర్రదనం కనబడుతుంది.
        ఎముకల్లో కాల్షియం తగ్గి నొప్పులు వస్తే దానిని 'ఆర్థ్రైటిస్' అంటారు.ఇది వయసు పెరిగే కొద్దీ వచ్చే వ్యాధి.కానీ గౌట్ మటుకు 40 ఏళ్ళ వయసు వారికి కూడా రావచ్చు.ఇది ముఖ్యంగా మగవారిలో ఎక్కువ.
       కొన్ని రకాల ఆహార పదార్థాలు ఈవ్యాధి ఉన్నప్పుడు తినక పోవడం మంచిది,ఎందుకంటే వీటిలో'ప్యూరైన్స్' అనే పదార్థం ఉంటుంది.అది యూరిక్ ఆసిడ్ గా మారే అవకాశం ఉంటుంది.ఆ ఆహార పదార్థాలు ఏవంటే సముద్రపు నాచుతో చేసే ఆహార పదార్థాలు,మాంసం,పంది మాంసం,ట్యూనా చేపలు,రొయ్యలు మొదలైనవి.ఇవే కాకుండా మద్యం అలవాటు కూడా ఈ వ్యాధి కలిగించవచ్చు.
       అరటి పండ్లు ఈ వ్యాధి కి ఎంతో మంచివి.పండ్ల రసాలు కూడా తగ్గిస్తే మంచిది. ఈవ్యాధి వచ్చిన వారు నీళ్ళు బాగా త్రాగాలి.రోజుకి 4లే5 కప్పుల కాఫీ రక్తంలో యూరిక్  ఆసిడ్ తగ్గిస్తున్నట్టు పరిశోధనలు తెలియచేస్తున్నాయి! ఉప్పు తగ్గించాలి.కోలాలు,చక్కెర కలిపిన పండ్ల రసాలు తాగ కూడదు.శరీర బరువు క్రమేపీ తగ్గించాలి. తక్కువ వెన్న శాతం గల పాలు,పెరుగు వాడ వచ్చు. చెర్రీ పండ్లు, గోధుమలు,బ్రౌన్ బియ్యం మంచివి.కానీ ఈ ఆహార పదార్థాలు గౌట్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి కానీ వ్యాధిని నివారించలేవు. నొప్పి నివారణకు విశ్రాంతి అవసరం.కాలి వేళ్ళు  బాధిస్తే నడక కర్ర  ఉపయోగించడం మంచిది.మరీ నొప్పి ఉంటే  ఐస్ గడ్డ  తగినంతగా పెట్టుకోవచ్చు. మానసిక వత్తిడి తగ్గించుకోవాలి.
      కీళ్ళ వాపులు,నొప్పి ఎక్కువయితే వెంటనే కీళ్ళ వ్యాధి నిపుణున్ని కలసి తగిన సూచన తీసుకోవాలి. రక్త పరీక్షలో రక్తంలో యూరిక్ ఆసిడ్ శాతం తెలుస్తుంది.ఈ వ్యాధికి మన దేశంలో కూడా మంచి మందులు వచ్చాయి.తగిన విధంగా మందులు వాడుతూ, తగిన వ్యాయామం చేస్తూ సూచించిన ఆహారం తీసుకుంటే ఈ వ్యాధిని గురించి భయపడాల్సిన అవసరం లేదు.
                
కామెంట్‌లు
Unknown చెప్పారు…
గౌట్ వ్యాధి గురించి చక్కటి వివరణ నివారణ గురించి తెలియచేసిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు. గౌటు వ్యాధి గురించి సామాన్య జనాలలో అవగ హన తక్కువ.
కందర్ప మూర్తి, హైదరాబాద్.