బస్సుకు టైం అయిపోతోందని పరుగు పరుగున బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చాడు పశుపతి. పశుపతికి ఏదో చెప్పాలని వాడి నాన్నమ్మ కాంతమ్మ బయటికి వస్తుండగానే ఓ ఆటోరావడం పశుపతి ఆటోలో బస్సు స్టాండుకు వెళ్ళిపోవడం జరిగాయి.
అలా బస్టాండుకు వెళ్ళే సరికి మరో గంట వరకు బస్సు లేదని పశుపతికి తెలిసింది.సరే బస్టాండు బయటకు వచ్చేసరికి అక్కడ ఒక 'తుఫాన్' వ్యాను నిలబడి ఉంది.
"ఆత్మకూర్,ఆత్మకూర్" అంటూ ఆ వ్యాను డ్రైవర్ అరుస్తున్నాడు.
"అమ్మయ్యా" అనుకుంటూ పశుపతి వ్యాను ఎక్కి వెనుక ఉన్న ఖాళీసీటు ఎక్కేశాడు.బ్యాగు తన సీటుకింద సర్దేసుకున్నాడు. అప్పుడే మరొక వ్యక్తి వ్యాను ఎక్కాడు..పశుపతి ఎదురుగా ఉన్న ఖాళీ సీటులో కూర్చున్నాడు. ఆవ్యక్తి కూడా అచ్చం పశుపతి బ్యాగులాటి బ్యాగే తెచ్చాడు. ఆ బ్యాగు చూసి పశుపతి ఆశ్చర్య పోయాడు.ఆ తరువాత కొంత పశుపతి మనస్సులో ఒక దుష్ట ఆలోచన రూపు దిద్దుకొంది! తన బ్యాగు అతని బ్యాగు ఒకటిగానే ఉన్నాయి కనుక,శుభ్రంగాతన బ్యాగును అతని బ్యాగు స్థానంలో పెట్టి ,ఆ బ్యాగు తీసుకుంటే అందులో విలువైన సామాన్లు లేక డబ్బు ఉంటే తన పంట పండినట్లే కదా! తన బ్యాగులో ఒక జత బట్టలు,షేవింగ్ కిట్ తప్ప మరేమీ లేవు! అలా ఆలోచించి ఆలోచించి వ్యాను బయలు దేరాక,సదరు వ్యక్తి నిద్రలోకి జారుకున్నాక మెల్లగా ఎవరికీ మానం రాకుండా,అతని బ్యాగ్ స్థానంలో తన బ్యాగు పెట్టి అతని బ్యాగును తన సీటుకింద పెట్టాడు!
అప్పటినుండి పశుపతి మనసులో టెంక్షన్ పెరిగి పోయింది.వ్యాను భైరిపురం వచ్చేసరికి వ్యాను ఆపమని చెప్పి డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి ఒడి ఒడిగా అడుగులు వేసుకుంటూవెళ్ళి పోయాడు.ఇక ఎవరూ దిగక పోయేసరికి వ్యాను తుర్రున వెళ్ళి పోయింది.
పశుపతి ఓ చెట్టు కంద కూర్చుని బ్యాగు తీసి చూస్తే ఏముంది.... ఓ పాత లుంగీ,సబ్బుపెట్టె,దువ్వెన,టూత్ బ్రష్, మూడు నోట్ బుక్కులు ఉన్నాయి.పశుపతి నిరాశతో తల కొట్టుకున్నాడు. అలా మరొక బస్సు ఎక్కి ఆత్మకూరుకి వెళ్ళి తన అక్క ఇంటికి వెళ్ళి పని చూసుకుని,తాపీగా పొద్దున్నే మరో బస్సు ఎక్కి కర్నూలు వచ్చాడు.
ఇంట్లోకి వస్తూనే నాన్నమ్మ " ఒరే పశూ, నిన్న తొందరలో నేను చెప్పేది వినకుండా వెళ్ళావు,నీ అక్కకు ఇవ్వడానికి నీ బ్యాగులో,జంతికల డబ్బా,ఐదొందలు పెట్టాను, చూసుకున్నావా?" అడిగింది.
పశుపతికి మతి పోయింది.తన వెధవ బుద్ధి వలన అప్పళంగా ఐదు వందలు ,జంతికలు ఎవడికో అప్పగించి,వాడి మురికి పట్టిన పాత లుంగీ,ఎంగిలి టూత్ బ్రష్ తెచ్చు కున్నాడు. కాంతమ్మ పశుపతికి టీ ఇవ్వడానికి వంటింట్లోకి వెళ్ళింది. పశుపతి తను తెచ్చిన బ్యాగును కళ్ళప్పగించి చూస్తుండి పోయాడు!
**********
వెధవ బుద్ధి;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి