చెత్త చిత్రాల ప్రదర్శనశాల--కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445


  ఓ మంచి చెట్టుబొమ్మను ఒక చిత్రకారుడు చిత్రీకరించాడు..పండు బరువుకు కొమ్మ వేలాడినట్లు ఉండాలి కానీ సన్నటి కొమ్మ పైకి పెరిగినట్లు ఉంటే ఆ చిత్రం చెత్త చిత్రం కాక మరేమిటి? మరొక చిత్రకారుడు పువ్వులతటలో ఓ పెద్దావిడను చిత్రీకరించాడు కానీ అసలు విషయం ఆ పెద్దావిడకు పెద్దాయన మొహం! 
      ఇటువంటి చిత్రాలు చూసి మనం ఏమిటీ చిత్రకారుల పైత్యం అనుకుంటాము లేకపోతే "ఎంతచెత్తగా బొమ్మ వేశాడు" అనుకుంటాం!
      ఇటువంటి అనేక చెత్త చిత్రాలు బోలెడు సేకరించి,1993 లో శ్రీమతి లూయిస్ రైలీ సాక్కో అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రం లోని డెడ్హామ్ లో మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్ (MOBA) స్థాపించి ఆ చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఆ విధంగా 1994లో మొదటిసారి చిత్రాలు ప్రదర్శించారు.
     చిత్రమేమిటంటే  చెత్తకుప్పల్లో,పనికిరాని వస్తువులు అమ్మే వాళ్ళ దగ్గర సేకరించిన చెత్త చిత్రాలను ఫ్రేములు కట్టించి ఈ ప్రదర్శనశాలలో ప్రదర్శిస్తున్నారు!
      చిత్రకళమీద ఎంతో ఆసక్తి ఉండి,తాము చిత్రీకరించిన చిత్రాల్లో అనేక లోపాలు గుర్తించిన చిత్రకారులు కూడా తమ చిత్రాలను ఈ మ్యూజియంకు ఇచ్చివేసిన చిత్రాలు కూడా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.
     ఈ ప్రదర్శనశాలలో సుమారు ఐదు వందల పెయింటింగ్స్ ఉన్నాయి.
      ఈ పెయింటింగ్ నకళ్ళను,ప్రింటు కార్డులను,కప్పుల మీద,టీ షర్టుల మీద ముద్రించి అమ్ముతున్నారు! అమెరికాలో ప్రతీదీ వ్యాపారమే కదా!
      ఈ మ్యూజియం దర్శించాలంటే ఏ రుసుము చెల్లించనక్కరలేదు.కానీ,అప్పుడప్పుడు చిత్ర కారుల గురించి,చిత్రకళను గురించి సినిమాలు ప్రదర్శిస్తుంటారు,అప్పుడు మటుకు మ్యూజియం నామ మాత్రపు రుసుం వసూలు చేస్తుంటారు.
     కొన్ని ఏళ్ళ క్రితం ఆయ్ లిన్ అనే చిత్ర కారిణి చిత్రించిన'ఏంజిలో' చిత్రం దొంగలించ బడింది.దానిని పోలీసులు చాలా కాలం వెతికారు.ఈ దొంగతనం గురించి టివీ,పేపర్లు మీడియాలో విశేషంగా ప్రసారం చేశారు.ఆ దెబ్బతో ఈ మ్యూజియానికి సందర్శకుల తాకిడి ఎక్కువ అయిపోయింది.
      ఈ మ్యూజియాన్ని అనేకమంది ఔత్సాహిక చిత్రకారులు దర్శించి చిత్రకళలో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుంటుంటారు.
      చెత్త చిత్రాలను ఈ మ్యూజియం బతికిస్తున్నందుకు ఆయా చిత్రకారులు ఈ మ్యూజియానికి కృతజ్ఞతలు తెలపాల్సిందే!
      మన దేశంలో కూడా ఇటువంటి 'చెత్త ఆర్ట్'మ్యూజియం ఒకటి ప్రారంభిస్తే బాగుంటుందేమో చూడండి!
          *********

కామెంట్‌లు