వీరభద్రానికి డెబ్భైరెండేళ్ళు.మనిషి చూస్తే అరవై ఏళ్ళవాడిలాగ కనబడతాడు!చక చకా తన పనులు తాను చేసుకుంటాడు,బ్యాంకకు వెడతాడు,మనవడికి కథలు చెబుతాడు!పెద్దలకు మంచి విషయాలు చెబుతాడు.
వీరభద్రం ఒకరోజు పని ఏదో ఉండి బయటకు పోవలసి వచ్చింది.కొడుకు,కోడలు ఆఫీసులకు వెళ్ళారు.మనవడు స్కూల్ కి వెళ్ళాడు.వీరభధ్రం డూప్లికేట్ తాళం చెవితో బయలు దేరాడు. అలా ఆయన ఆటోలో వెడుతుండగా ఆటో అదుపుతప్పి ఒక ఎలక్ట్రికల్ పోల్ ని గుద్దుకుంది.ఆటో ముందు భాగం దెబ్బతింది.ఆటో డ్రైవర్ కి మరో ఇద్దరికి చిన్న దెబ్బలు తగిలాయి.వీరభధ్రం మొహానికి దెబ్బలు తగిలాయి! ఆటో డ్రైవర్ పరారయ్యాడు.ఇక పోలీస్ కేసు కోర్టు చుట్టూ తిరగడం ఎందుకని దెబ్బలు తగిలిన ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు, వీరభధ్రం ఆపక్కనే ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి మొహానికి బాండేజీలు వేయించుకున్నాడు.అక్కడే విశ్రాంతి తీసుకుని ఆటోలో ఇంటికి వచ్చి సోఫాలో పడుకున్నాడు.
సాయంత్రం ఆరు అవుతున్నా కొడుకు,కోడలు,మనవడు రాలేదు.కొడుకు,కోడలు,మనవడు వస్తారని తలుపు గడియ పెట్టలేదు.ఆయన జుట్టు చెదరిపోయి ఉంది,బుగ్గల మీద నల్లని మచ్చలు ఏర్పడ్డాయి! డిమ్ లైటులో భయంకరంగా కనబడసాగాడు.
అప్పుడే ఒక సంఘటన జరిగింది.ఒక అగంతకుడు తలుపుతోసుకుని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువుల కోసం వెదక సాగాడు! గబుక్కున సోఫాలోకి చూసేసరికి వాడికి వీరభధ్రం భయంకరంగా కనబడ్డాడు!
దొంగ మానసిక బలహీనుడో,దెయ్యాలంటే అమిత భయంగలవాడో తెలియదుకానీ,వీరభధ్రాన్ని చూస్తూనే వాడికి ప్రాణం పోయినంత పని అయింది!
భయంతో అక్కడే స్పృహ తప్పి పడి పోయాడు.
అప్పుడే కొడుకు,కోడలు,మనవడు తలుపు తీసుకుని వచ్చి సోఫాలో బ్యాండేజీలతో పడుకుని ఉన్న వీరభధ్రన్ని చూసే సరికి ఆశ్చర్యంతో కూడిన భయం వేసింది వారికి.అంతకంటే ఆశ్చర్యం కిందపడి ఉన్న యువకుణ్ణి చూశాక కలిగింది.
వీరభధ్రాన్ని కొడుకు మెల్లగా తట్టి లేపాడు.వీరభధ్రం జరిగిన సంగతి వివరించాడు. ఆ యువకుడి సంగతి వీరభధ్రం కొడుకు ఊహించ గలిగాడు.వెంటనే వాడి మొహం మీద నీళ్ళు చల్లి లేపాడు.అందరినీ చూసే సరికి వాడికి ఒణుకు పుట్టి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు.చుట్టు పక్కల వారికి తెలిసి వాడిని పోలీసులకు అప్పగించారు.
హుషారైన వీరభధ్రానికి జరిగిన ఆక్సిడెంట్ కి బాధ పడ్డారు.
అసలు కొసరు విషయం ఏమిటంటే పోలీసులు దొంగను విడిచి పెట్టాక, నేరుగా వీరభధ్రం కొడుకు వద్దకు వచ్చి తన బీదతనాన్ని వివరించి ఏదైనా పని చూపించమని వేడుకున్నాడు.అక్కడే ఉన్న వీరభధ్రం
"అరేయ్,మారాలనుకున్నాడు కాబట్టే మన దగ్గరకు వచ్చాడు,వాడికి ఏదైనా పనిచూడు" చెప్పాడు కొడుకుతో వీరభధ్రం.
"రేపు సాయంత్రం నీ తల్లిదండ్రులతో రా పనిని గురించి చెబుతాను" చెప్పాడు కొడుకు.
మారిన దొంగ కళ్ళలో కాంతిని చూడగలిగారు వీరభధ్రం,ఆయన కొడకు.
********
దొంగకి భయం!;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి