*మాయల మారాఠీ (తల్లిదండ్రుల కోసం ఒక కథ)* డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212
   శైలజ కుక్కర్‌ గిన్నెలోంచి అన్నం తీసి క్యారియర్‌లో సర్దుతూ వంటగదిలోంచి పడకగదిలోకి చూసింది. భర్త సాయిరాం ముసుగు తన్ని నిద్రపోతున్నాడు. సమయం ఎనిమిదవుతూ వుంది. ఆఫీసులో పనుండడంతో రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు. మామూలుగా అయితే సాయంత్రం ఆరుగంటలకల్లా ఇల్లు చేరి ఉదయం ఏడుకంతా బైలుదేరతాడు.
పిల్లలిద్దరూ టిఫిన్‌ చేస్తున్నారు. పాప నాలుగో తరగతి. బాబు ఒకటో తరగతి. బడేమో తొమ్మిదికి.
'' తొందరగా తినండమ్మా... ఆలస్యమవుతా వుంది'' అని శైలజ లోపలి నుంచే అరుస్తూ క్యారియర్లు నింపి బుట్టలో సర్దింది. చిన్నోనికి పలక, పుస్తకాలు బ్యాగులో సర్ది పెన్సిల్‌ బాక్స్‌లో బలపం, పెన్సిల్‌, రబ్బరు అన్నీ వున్నాయో లేదో చెక్‌ చేసింది. చిన్నోడు రోజుకొక బలపం పోగొట్టి, పెన్సిలు ముక్క విరగ్గొడుతుంటాడు. పెన్సిల్‌ జువ్వుతూ ''ఏమ్మా.. నీ బాక్స్‌లో అన్నీ వున్నాయా'' అని అడిగింది పాపని. ''వున్నాయమ్మా... కానీ పెన్సిలే చిన్నగైపోయింది. రేపు కొత్తదివ్వు'' అంది పళ్ళెంలో చేయి కడుక్కుంటూ.
'' అలాగే గానీ... పోయి మీ నాన్నని లేపు. బడి దగ్గర వదిలేసి వస్తాడు'' అంటూ మళ్ళా వంట గదిలోకి పోయింది.
సాయిరాం అప్పటికే నిద్ర లేచి పావుగంటయింది. కానీ ఎవరూ కనుక్కోకుండా ముసుగకు కప్పుకొని పండుకొని వున్నాడు. పాప వస్తూ వుంటే గుండె దడ దడా కొట్టుకోసాగింది. కళ్ళు గట్టిగా మూసుకోని అలాగే పండుకున్నాడు.
'' నాన్నా.... నాన్నా... లెయ్యి నాన్నా.. అమ్మ చెప్పింది. బడి దగ్గర వదిలెయ్యాలంట'' అంటూ భుజం పట్టుకొని వూపుతూ అరిచింది పాప.
ఆ మాటలేవీ వినబడనట్టు కళ్ళు మరింత గట్టిగా మూసుకొని నిద్ర నటించసాగాడు సాయిరాం.
అంతలో శైలజ లోపలికి వచ్చి ''లెయ్‌.. లెయ్‌... అవతల మొదటి గంట కొట్టే సమయమవుతా వుంది. కావాలంటే వదిలేసి వచ్చి పడుకో'' అంది పైన కప్పుకున్న దుప్పటి లాగేస్తూ.
'' అబ్బా... ఏందే పొద్దున్నే... కొంచెం గూడా నిద్ర పోనియ్యకుండా... నువ్వు పోయి వదిలేసి రావచ్చుగా'' అన్నాడు విసుగ్గా అటువైపు తిరుగుతూ.
'' నేనా... మళ్ళా చీర కట్టుకోవాల, ముఖం కడుక్కోవాల, తల దువ్వుకోవాల... మీ మాదిరి చిటికెలో అంగీ, ప్యాంటు తగిలించుకోని పోయి రాలేం గదా... ఎంతసేపు ఐదునిమిషాలు... వచ్చేలోపు వేడి వేడి కాఫీ చేసి పెడతాలే'' అంది వూరిస్తూ.
''నిద్ర సరిగా లేక... వళ్ళంతా ఎట్లాగో వుందే''.. తప్పించుకోవడానికి ఆఖరి ప్రయత్నం చేశాడు.
'' ఎప్పుడు నేనే గదా వదిలేసి వచ్చేది... ఈ రోజు నువ్వున్నావు గదా అని పనులన్నీ నెమ్మదిగా చేసుకొంటి. ఇప్పుడు పోనంటే ఎట్లా? గంటకొట్నారంటే బైటే నిలబెట్టి నానా మాటలంటారు. మొన్ననే ఆలస్యమైందని తిడ్తే పాప ఇంటికొచ్చి పడీ పడీ ఏడ్చింది.''
'' నాన్నా.. లెయ్యి నాన్నా ...'' అంటూ బాబు ఒక వంక, పాప ఒక వంక చేతులు పట్టుకొని లాగసాగారు.
సాయిరాంకి ఏం చేయాలో అర్థం గాక లేచి కూర్చున్నాడు. గబగబా లోపలికి పోయి ముఖం మీద ఇన్ని నీళ్ళు చల్లుకొని, అంగీ, ప్యాంటు వేసుకున్నాడు. జేబులో నూరు రూపాయల కాగితం కనబడింది. జీతం రావడానికి మరో రెండు రోజుల సమయముంది. ఎప్పుడు ఏ అవసరం ఎటువైపు నుంచి ముంచుకొస్తాదో తెలీదు. నెలాఖర్లో ఎవర్నీ అడగలేడు. కంపెనీలో అందరి పరిస్థితీ ఆడికాడికే. పిల్లల వంక చూశాడు. ఇద్దరూ సాక్సులు వేసుకొని, బూట్లు తొడుక్కుంటున్నారు. పాప గుసగుసగా తమ్మునికేదో చెబుతూ వుంది. వాడు కళ్ళు పెద్దవి చేసి వింటున్నాడు. అది చూసి సాయిరాం గుండె దడ దడా కొట్టుకోసాగింది. అట్లాగే వాళ్ళనే చూస్తుండిపోయాడు.
'' ఎంతసేపలా బెల్లం కొట్టిన రాయిలెక్క గుడ్లప్పగించి చూస్తా వుంటావు. తొందరగా పోయి రాపో, కావాలంటే మధ్యాన్నం డ్యూటీకెళ్ళేదాకా ఎంతసేపు పన్నుకుంటావో పన్నుకుందువు గానీ'' అంది శైలజ.
సాయిరాం నెమ్మదిగా క్యారియర్‌ బుట్టలు అందుకున్నాడు. పిల్లలు అప్పటికే బ్యాగులు భుజాలకు తగిలించుకొని సిద్ధంగా వున్నారు. బడి దగ్గరే. పది నిమిషాలంతే. పిల్లలే పోయి రావచ్చు. కానీ మధ్యలో ఒక రోడ్డుంది. వాహనాలు అటూ యిటూ తిరుగుతుంటాయి. పాపతో భయం లేదు గానీ చిన్నోనితోనే చాలా కష్టం. పగ్గాల్లేని దూడలెక్క వురుకుతుంటాడు. 
పిల్లల చేతులు పట్టుకొని నెమ్మదిగా రోడ్డు చేరాడు. ఏదో ఆటో సర్రున కొంపలేవో మునిగిపోతున్నట్లు వేగంగా దూసుకువస్తోంది. అది పోగానే జాగ్రత్తగా రోడ్డు దాటాడు. మరో ఐదు నిమిషాల్లో బడి వచ్చేస్తాది. బడి దగ్గరవుతున్న కొద్దీ సాయిరాం గుండె కొట్టుకునే వేగం పెరిగిపోసాగింది. పిల్లలకు ఏవేవో మాటలు చెబుతున్నా ఇద్దరి దృష్టీ తన మీద లేదు.
వాళ్ళ చూపంతా బడికి ఎదురుగా వున్న అంగడి మీదే అతుక్కుపోయింది. పిల్లల్లో చాలామంది అక్కడ ఆగిపోతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలు అడిగినవి కొనిస్తా వుంటే మరికొందరు ఏమాత్రం పట్టించుకోకుండా కళ్ళతోనే బెదిరిస్తూ బర బరా లాక్కుపోతున్నారు.
పాప చిన్నోనికేదో సైగ చేస్తోంది. పాప పెద్దది కావడంతో తండ్రికి భయపడతాది. చిన్నోడలా కాదు. పరమ మొండి. పట్టుపట్టినాడంటే తలకిందులు తపస్సు చేసినా వదలడు. పాప తనకేమన్నా కావాలంటే నేరుగా అడగదు. నెమ్మదిగా చిన్నోనికి ఎక్కించేస్తాది. వానికి వూరించి వూరించి చెప్పి రెచ్చగొడతాది. దాంతో వాడు ఎక్కుపెట్టబడ్డ బాణంలాగా సిద్ధమై వుంటాడు.
సరిగ్గా అంగడి దగ్గరికి వచ్చేశారు.
చిన్నోని అడుగులు ఆగిపోయాయి.
'' నాన్నా'' అన్నాడు నోరు తెరచి. సాయిరాం గుండె ఒక్క క్షణం ఆగింది.
'' నాన్నా... ఒక సూపర్‌ జాయ్‌ చాక్లెట్‌ కొనియ్యి నాన్నా'' అన్నాడు ముద్దుగా.
ఒక్కసారిగా బాంబు మీద పన్నట్టయ్యింది. లేచినప్పటి నుంచీ అదే వూహిస్తూ... ఎట్లా తప్పించుకోవాల్నా అని ఆలోచిస్తా వున్నాడు.
'' ఏముంటాయిరా దాంట్లో.. కావాలంటే వేరేవి కొనిస్తాలే'' అన్నాడు నెమ్మదిగా.
'' బళ్ళో అందరూ తెచ్చుకుంటున్నారు నాన్నా.... నువ్వేమో ఎప్పుడడిగినా రేపు రేపంటూ తప్పించుకుంటున్నావు. ఎదురింటి రేఖయితే పెద్ద ఫోజు. దాని దగ్గర సూపర్‌ జాయ్‌ బొమ్మ ఎంత బాగుందో తెలుసా... మొన్న ఇంటర్వెల్‌లో సంచీలోంచి తీసి అందరికీ చూపించింది. నేను ఒక్కసారి ముట్టుకుంటానంటే గూడా ఇవ్వలేదు. వాళ్ళ నాన్న సరుకులకు పోయినప్పుడల్లా తెచ్చిస్తాడంట తెలుసా...'' అంది పాప మనసులో దాచిపెట్టుకున్న కోరికను అణచిపెట్టుకోలేక.
సాయిరాంకి కొనియ్యలేని తన అశక్తతకు మనసు కళుక్కుమంది. ''పోనీలే పాపం అని ఒకసారి కొనిచ్చినా పిల్లలు తృప్తిపడరు. మళ్ళా మళ్ళా అడుగుతూనే వుంటారు. అందుకే ముందే తమ శక్తికి మించిన వాటికి దూరంగా వుంటే పిల్లలు మొదట మారాం చేసినా తరువాత చెప్పేది అర్థం చేసుకుంటారు'' అనుకుంటూ పాప భుజంపై చేయి వేస్తూ అనునయంగా.
'' అది కాదమ్మా... ఏముంటాది చెప్పు దాంట్లో. ఒక చిన్న బొమ్మ, క్రీంలో ముంచిన రెండు తియ్యని గుండ్లు. ఆ మాత్రం దానికి నలభై రూపాయలా... ఆ బొమ్మలన్నా ఆడుకోని దాచిపెట్టుకునేవా అంటే అదీ కాదు. పదినిమిషాల తరువాత వాటి ముఖం గూడా చూడరు. సరే ఆ తినేటివన్నా బాగుంటాయా అంటే అవీ ఆడికాడికే. పంటికిందకు గూడా ఆనవు. కావాలంటే వేరేవి కొనుక్కోండమ్మా... ఏ చాక్లెట్లో, బిస్కెట్లో...'' అన్నాడు.
పాప మౌనంగా తలాడించింది. కానీ చిన్నోడు ఆ మాటలేవీ పట్టించుకోకుండా '' నాన్నా... సూపర్‌జాయ్‌ కొనిస్తావా... కొనియ్యవా'' అన్నాడు ముఖమంతా గంటు పెట్టుకొని అసహనంగా.
'' డబ్బుల్లేవురా... అవి వచ్చేవారం కొనిస్తాలే'' అన్నాడు సాయిరాం అనునయంగా. వాడక్కన్నించి ఒక్క ఇంచు గూడా పక్కకు కదల్లేదు. ముక్కుపుటాలు కోపంతో అదురుతున్నాయి. పాప వాన్నే చూస్తా వుంది. దాని కళ్ళలో ఏదో దింపుడు కళ్ళెం ఆశ మెరుస్తా వుంది.
'' అబద్దాలెందుకు చెబుతావ్‌. కనబడుతున్నాయి గదా డబ్బులు జేబులో'' అన్నాడు గట్టిగా కాలు నేల మీదకేసి కొడుతూ. వానికి ఆ డబ్బులు ఎంత అవసరమో ఎలా చెప్పాలో సాయిరాంకి అర్థం కాలేదు.
అందుకే వాళ్ళను బడి దగ్గర వదలాలంటే సాయిరాంకి చాలా భయం. అదే వాళ్ళమ్మ వెంబడి పోతే కిక్కురుమనరు. కళ్ళతోనే కట్టడి చేసేస్తాది. ఆమెకసలు అంగళ్ళోని తినుబండారాలంటేనే అలర్జీ. 
'' ఏందా పనికిరాని చెత్త. ఎప్పుడో మూన్నెళ్ళ కిందట్నో, ఆర్నెళ్ళ కిందట్నో చేసిన సద్దివన్నీ... ఆరోగ్యాలు పాడు చేసే ఆ సన్నాసి ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి, చెడిపోకుండా నానా రసాయనాలు కలిపి, అన్ని ఛానెళ్ళలో పదే పదే ప్రకటనలు వేస్తూ.. పసిపిల్లల లేత మనస్సులకు వల వేస్తుంటారు. చూడటానికి ఒకొక్కటి ఇంత లావుంటాయి గానీ కత్తిరిస్తే వుత్త గాలే. పట్టుమని పదిముక్కలు గూడా వుండవు. మీకు తినడానికి ఇంట్లోనే చేస్తా గదా... ఏం కావాల్నో చెప్పండి'' అంటుంది.
పండుగరోజు గూడా తినుబండారాలు స్వగృహ సెంటర్లలో తెచ్చుకునే ఈ రోజుల్లో పాపం కష్టపడి పిల్లల కోసం ఏవేవో చేస్తుంటాది.
'' ఎందుకే ఇంత కష్టమంటే...'' నవ్వేస్తూ.. ''ఆరోగ్యానికి ఆరోగ్యం మిగులుకి మిగులు. మన సంపాదనకి ఆ పనికిరాని ఖర్చులు అవసరం లేదులే'' అంటుంది.
'' నాన్నా... కొనిస్తావా... కొనియ్యవా...'' అనే చిన్నోని అరుపుతో సాయిరాం వులిక్కిపడ్డాడు. కొందరు ముందు పోతున్న వాళ్ళు ఆగి వెనక్కి తిరిగి చూశారు. సాయిరాంకి చాలా అవమానంగా అనిపించింది.
'' ఏం చెప్తే అర్థం కాదా మరలా కొనిస్తానంటే... పదపద'' అన్నాడువాని భుజం మీద చేయి వేసి ముందుకు దొబ్బుతూ.
వాడు అంగుళం గూడా కదల్లేదు సరికదా... ఒక్కపెట్టున దిక్కులు పిక్కటిల్లేలా 'ఓ' అంటూ ఏడుపు అందుకున్నాడు. దారినపోయే కొందరు ఇవన్నీ మామూలే అన్నట్లు ముసి ముసిగా నవ్వుకుంటుంటే, మరికొందరు అదోలా చూస్తున్నారు. ఇంకొందరేమో ''పిల్లోడు అడిగితే ఆ మాత్రం కొనియ్యలేవా... ఏం మనిషివయ్యా నువ్వు, చేతగాక పోతే ఎందుకు కన్నట్టో'' అన్నట్లు అవహేళనగా చూస్తున్నారు.
సాయిరాంకి వాన్ని రోడ్డుమీదనే ధనాధనామని నాలుగు పీకాలనిపించింది. కానీ వాడు మరింత గొడవ సృష్టిస్తాడు. అక్కన్నే కిందపడి గిలగిలా కొట్టుకోవడం, పుస్తకాలు విసిరి కొట్టడం చేస్తాడు. వాన్ని నడిబజారులో ఏమీ అనలేని చేతగాని తనాన్ని ఆసరాగా తీసుకొని చిన్నోడు మరింతగా రెచ్చిపోతున్నాడు.
ఆ ఏడుపును ఆపలేక తన ఏడుపు దిగమింగుకుంటూ జేబులోకి చేయి పెట్టాడు. నెలాఖరి ఖర్చులకు దాచుకున్న చివరి వందరూపాయలు నవ్వుతూ వెక్కిరించింది.
ఒకటి కొంటే కుదరదు. కొంటే ఇద్దరికీ కొనాలి ఒకొక్కటి నలభైరూపాయలు. రెండంటే ఎనభై.
గుండె కలుక్కుమంది. పళ్ళ బిగువున బాధను అణచిపెట్టుకుంటూ '' సర్లే... ఇంక ముయ్యి. కొనిస్తాగానీ'' అన్నాడు సాయిరాం వాడిపోయిన ముఖంతో అంగడివైపు అడుగులేస్తూ...
చిన్నోడి ముఖంలో ఏడుపు ఛటుక్కున ఆగిపోయింది. తన పాచిక పారినందుకు పాప ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
అంగడి ముందంతా వరుసగా
కొత్తగా మార్కెట్టులోకి అడుగుపెట్టిన ప్రతిదీ
రంగురంగుల ఆకర్షణీయమైన ప్లాస్టిక్‌ కవర్లలో
పసిపిల్లలను ఆకర్షిస్తూ... వూరిస్తూ... కవ్విస్తూ...
పిల్లలను కిడ్నాప్‌ చేసి డబ్బులు గుంజే మాయలమరాఠీల్లా విషపునవ్వులతో పరిహసిస్తున్నాయి.


కామెంట్‌లు